Jayalalitha death mystery
-
జయలలిత మృతి కేసులో కీలక ట్విస్ట్
-
దర్యాప్తు కమిషన్ ముందు హాజరవుతా: పన్నీర్ సెల్వం
సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నాయకురాలు జయలలిత మృతిపై అనుమానాలున్నాయని తాను ఆనాడే చెప్పానని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. జయలలిత హాస్పిటల్లో ఉన్నప్పుడు చూసేందుకు కూడా నన్నుఅనుమతించలేదని, ఆమె మృతిపై దర్యాప్తు చేయాలని తాను కోరానని గుర్తుచేశారు. ‘అమ్మ’ మృతిపై దర్యాప్తు చేస్తున్న జస్టిస్ అర్ముగస్వామి కమిషన్ తనను విచారణకు హాజరుకావాలని నాలుగు సార్లు కోరిందనీ, కానీ పని ఒత్తిడి వల్ల వెళ్లలేకపోయాననీ స్పష్టం చేశారు. ఈ సారి పిలిస్తే కచ్చితంగా వెళ్తానని తెలియజేశారు. కాగా, జయలలిత మృతికి సంబంధించిన వివరాలు ఇవ్వడానికి ఇంకొంత సమయం కావాలని తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు జులై ఒకటిన అనుమతించింది. ఆ తర్వాత కొద్ది రోజుల వ్యవధిలో పన్నీర్ సెల్వం ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
జయ మృతి విచారణ కమిషన్‌పై స్టే
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత మృతి మిస్టరీపై విచారణ జరుపుతున్న ఏకసభ్య ఆర్ముగస్వామి కమిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. అపోలో వైద్యులను కూడా విచారించేందుకు జస్టిస్ ఆర్ముగ స్వామి పూనుకోవడంతో అపోలో యాజమాన్యం మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేసింది. ఆర్ముగ స్వామి ఒక్కరే కాకుండా స్వచ్ఛంద వైద్య నిపుణుల బృందం, ప్రత్యేక నిపుణుల బృందాలను ఏర్పాటు చేసి వైద్యులను విచారించాలని కోరింది. ఈ పిటిషన్‌ను విచారించిన మద్రాసు హైకోర్టు అపోలో అభ్యర్థనను తోసిపుచ్చడంతో అపోలో సుప్రీంను ఆశ్రయించింది. -
పోలీసులు చెప్పినందుకే..
చెన్నై: తమిళనాడు సీఎం దివంగత జయలలితకు చికిత్స సందర్భంగా ఆసుపత్రి కారిడార్లలో సీసీటీవీలను పోలీసుల సూచన మేరకే ఆపేశామని అపోలో ఆసుపత్రి ఆర్ముగస్వామి కమిషన్‌కు తెలిపింది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజీ సత్యమూర్తి ఆదేశాల మేరకే ఇలా చేశామని అపోలో గ్రూప్ న్యాయవాది కమిషన్‌ముందు అఫిడవిట్ ఇచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించేందుకు జయలలితను గది నుంచి బయటకు తీసుకొచ్చిన సమయంలో కారిడార్లలో సీసీటీవీలను ఆపేయడంతో పాటు మెట్లదారిని మూసివేసేవారమని ఆమె తెలిపారు. లిఫ్ట్ ద్వారా ఆమెను వేరే అంతస్తులోకి తరలించాల్సి వస్తే మిగతా లిఫ్టులను నిలిపివేసేవాళ్లమన్నారు. జయలలిత చికిత్స గదిలోకి వెళ్లిపోగానే సీసీటీవీలను ఆన్ చేసేవాళ్లమని అపోలో గ్రూప్ న్యాయవాది పేర్కొన్నారు. -
జయలలిత చికిత్స వీడియోలు లేవు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలితకు తమ ఆస్పత్రిలో చికిత్సచేసినపుడు చిత్రీకరించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం లేవని, అవి చెరిగిపోయాయని చెన్నై అపోలో ఆస్పత్రి యాజమాన్యం స్పష్టంచేసిన విషయం తాజాగా వెల్లడైంది. జయ మరణంపై తమిళనాడు ప్రభుత్వం రిటైర్డు జడ్జి ఆర్ముగస్వామి చైర్మన్‌గా విచారణ కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే. ఈ విచారణ కమిషన్‌కు ఈనెల 11న ఆస్పత్రి యాజమాన్యం రాసిన లేఖ బుధవారం బహిర్గతమైంది. సీసీటీవీల్లో రికార్డయిన వీడియోలు నెలరోజులకు మించి ఉండవని, తాజా దృశ్యాలు నమోదు కాగానే పాతవి ఆటోమేటిక్‌గా చెరిగిపోతాయని, జయ చికిత్స దృశ్యాలు సైతం ఇలాగే చెరిగిపోయాయని లేఖలో ఆస్పత్రి వివరణ ఇచ్చింది. దీంతో ఆస్పత్రిలోని సర్వర్లను పరిశీలించి నిపుణుల బృందం సాయంతో చెరిగిపోయిన దృశ్యాలను రాబట్టాలని కమిషన్ నిర్ణయించింది. -
జయకు విదేశీ వైద్యం వద్దనుకున్నారు
సాక్షి ప్రతినిధి, చెన్నై: అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే ముఖ్యమంత్రి జయలలితను మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తరలించేందుకు మంత్రులు సిద్ధపడినా, తరువాత వెనక్కి తగ్గారని తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామమోహన్‌రావు వెల్లడించారు. జయ మరణంపై విచారణ జరుపుతున్న కమిషన్‌కు ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఆరు నెలల తరువాత బహిర్గతమైంది. తమిళ దినపత్రికలు ఆ విషయాల్ని గురువారం ప్రముఖంగా ప్రచురించాయి. రిటైర్డు న్యాయమూర్తి ఆర్ముగస్వామి గత డిసెంబరు 21న రామమోహన్ రావును విచారించారు. ‘అత్యుత్తమ వైద్యం అందించేందుకు జయను విదేశాలకు తరలించాలని మంత్రులకు సూచించాను. ఈ విషయంపై వారు 4 రోజులు ఆలోచించి, ఆ తరువాత పూర్తిగా విస్మరించారు’ అని ఆయన వివరించారు. మంత్రులకు మరెక్కడి నుంచైనా అనుమతులు రావాల్సి ఉండే దా? అని కమిషన్ ప్రశ్నించగా తనకు తెలియద ని బదులిచ్చారు. ‘జయ పరిస్థితి విషమంగా ఉన్నట్లు 2016 డిసెంబరు 4న వైద్యులు చెప్పగానే ఆసుపత్రికి వెళ్లి చూడగా, ఆమె శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. అదే రోజు రాత్రి 10.30 గంటలకు ఇక లాభం లేదని వైద్యులు తేల్చేశారు. ఇదంతా జరిగినప్పుడు అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆసుపత్రిలోనే ఉన్నారు’ అని చెప్పారు. -
జయలలిత ఆడియో క్లిప్పుల విడుదల
సాక్షి, చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మాట్లాడిన ఆడియో క్లిప్పులు వెలుగులోకి వచ్చాయి. జయ మృతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ వీటిని శనివారం విడుదల చేసింది. దాదాపు 1.07 నిమిషాల నిడివి ఉన్న తొలి ఆడియో క్లిప్‌లో ‘మీకు రక్తపోటు(బీపీ) ఎక్కువగా ఉంది. సిస్టోలిక్ పీడనం 140గా ఉంది’ అని జయకు డ్యూటీ డాక్టర్ చెప్పారు. ఆమె వెంటనే ‘డయాస్టోలిక్ పీడనం ఎంతుంది?’ అని అడిగారు. దీనికి 140/80 అని డాక్టర్ జవాబిచ్చారు. దీంతో ‘అయితే అది నాకు మామూలే’ అని జయలలిత సంతృప్తి వ్యక్తం చేశారు. శ్వాస తీసుకోవడంలో తనకు ఎదురవుతున్న ఇబ్బందిని కేఎస్ శివకుమార్ అనే వైద్యుడికి వివరిస్తూ.. ‘శ్వాస తీసుకున్నప్పడు వస్తున్న గురకలాంటి శబ్దం నాకు స్పష్టంగా విన్పిస్తోంది. అది సినిమా థియేటర్లో అభిమానులు వేసే విజిల్స్‌లా ఉంది’ అని జయలలిత చమత్కరించారు. కమిషన్ విడుదల చేసిన మరో 33 సెకన్ల ఆడియో క్లిప్‌లో డా.శివకుమార్ జయతో మాట్లాడుతూ.. గతంతో పోల్చుకుంటే శ్వాస తీసుకుంటున్నప్పుడు వస్తున్న శబ్దం తీవ్రత తగ్గిందని జయలలితకు చెప్పారు. దీంతో ఆమె వెంటనే స్పందిస్తూ.. ‘గురకలాంటి శబ్దం ఎక్కువగా ఉండగానే రికార్డు చేసేందుకు మొబైల్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేయమని మీకు చెప్పాను. మీరేమో కుదరదన్నారు’ అని వ్యాఖ్యానించారు. దీంతో కుమార్ ‘మీరు చెప్పిన వెంటనే మొబైల్లో డౌన్లోడ్ చేశాను’ అని సమాధానమిచ్చారు. అలాగే ఆస్పత్రిలో భోజనానికి సంబంధించి జయలలిత రాసుకున్న లిస్ట్‌ను కమిషన్ బహిర్గతం చేసింది. కాగా, తూత్తుకుడి కాల్పుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రభుత్వం ఈ ఆడియో క్లిప్పులను విడుదల చేయించిందని ప్రతిపక్ష నేత స్టాలిన్ ఆరోపించారు. 2016, సెప్టెంబర్ 22న అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత 75 రోజుల చికిత్స అనంతరం డిసెంబర్ 5న చనిపోయారు. చికిత్స సమయంలో జయను ఎవ్వరికీ చూపకపోవడంతో ఆమె మరణంపై అనుమానాలు తలెత్తాయి. వీటిని నివృత్తి చేసేందుకు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్‌ను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ విచారణలో భాగంగా జయకు చికిత్స అందించిన వైద్యులు, అపోలో ఆస్పత్రి చీఫ్ ప్రతాప్.సి. రెడ్డి, జయ నెచ్చెలి శశికళ సహా పలువురి వాంగ్మూలాలను నమోదు చేశారు. -
అక్క చెప్పినట్టే అన్నీ ఆచరించా: శశికళ
దివంగత నటుడు, పత్రికా సంపాదకులు చో రామస్వామి కారణంగా తాను పోయెస్ గార్డెన్‌కు దూరంగా కొంత కాలం గడపాల్సి వచ్చిందని ప్రమాణ పత్రంలో చిన్నమ్మ శశికళ వివరించారు. అక్క జయలలిత చెప్పినట్టే నడుచుకున్నానని, తానెప్పుడూ ఏ విషయాల్లోనూ జోక్యం చేసుకోలేదని స్పష్టంచేశారు. విచారణ కమిషన్‌కు సమర్పించిన ప్రమాణ పత్రంలోని కొన్ని వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. సాక్షి, చెన్నై : దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం మిస్టరీని నిగ్గు తేల్చేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి కమిషన్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ విచారణకు శశికళ స్వయంగా రాలేని పరిస్థితి. ఆమె పరప్పన అగ్రహార చెరలో అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తుండడమే ఇందుకు కారణం. తన న్యాయమూర్తి రాజ చెందూర్ పాండియన్ ద్వారా వాంగ్మూలాన్ని ప్రమాణ పత్రం రూపంలో ఆమె కమిషన్‌కు సమర్పించి ఉన్నారు. ఆమె నివేదించిన అంశాలు ఇప్పటికే అధికారంలో ఉన్న అన్నాడీఎంకే మంత్రుల్లో గుబులు రేకెత్తించాయి. జయలలితకు జ్వరం వచ్చిన రోజు నుంచి ఆస్పత్రిలో సాగిన చికిత్స, మరణం వరకు శశికళ ప్రమాణ పత్రంలో వివరించారు. అలాగే, ఎవరెవరు జయలలితను పరామర్శించారో తదితర వివరాలను కమిషన్ ముందుంచారు. ప్రస్తుతం శశికళ తరఫున న్యాయవాది రాజ చెందూర్ పాండియన్ విచారణకు హాజరయ్యే వారిని క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో శశికళను పోయెస్ గార్డెన్ నుంచి జయలలిత గతంలో గెంటి వేయడానికి గల కారణాలు సైతం ప్రమాణ పత్రంలో పొందుపరిచి ఉండడం వెలుగులోకి వచ్చింది. 2011లో ప్రకంపనలు 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయంతో జయలలిత సీఎం పగ్గాలు చేపట్టిన కొన్ని నెలల్లో పోయెస్ గార్డెన్లో ప్రకంపన బయలు దేరింది. శశికళను గార్డెన్ నుంచి బయటకు సాగనంపడమే కాదు, ఆమె కుటుంబీకుల మీద కేసుల మోత మోగడం అప్పట్లో చర్చకు దారి తీసింది. జయలలితకు వ్యతిరేకంగా శశికళ కుటుంబం వ్యవహరించడంతోనే ఈ గెంటివేత అన్న చర్చ సాగింది. కొన్నాళ్లకు మళ్లీ శశికళ గార్డెన్ మెట్లు ఎక్కడం ట్విస్టుగా మారింది. అయితే, ఈ తతంగం వెనుక కారణాలేమిటో అనేది ప్రశ్నగానే మిగిలింది. దీనికి సమాధానం ఇచ్చే రీతిలో శశికళ తన ప్రమాణ పత్రంలో పేర్కొని ఉండడం గమనార్హం. 2011లో మళ్లీ అన్నాడీఎంకే అధికారంలోకి రాగానే, ఓ రోజున అక్క జయలలిత తనను పిలిచి ఇక్కడ ఉండొద్దు.. టీ నగర్‌లోని ఇంటికి వెళ్లి పో.. అని సూచించారని తెలిపారు. అక్క ఆజ్ఞను శిరసా వహించి గార్డెన్ నుంచి బయటకు వచ్చామన్నారు. ఈ హఠాత్ నిర్ణయంతో తొలుత తాను అయోమయంలో పడ్డానని ఆవేదన వ్యక్తంచేశారు. అయితే, అక్క భరోసా ఇచ్చి మరీ పంపినట్టు పేర్కొన్నారు. తాను గార్డెన్ నుంచి బయటకు రావడంలో తుగ్లక్ పత్రిక సంపాదకులుగా ఉన్న నటుడు చో రామస్వామి కీలక భూమిక పోషించినట్టు వివరించారు. తనకు వ్యతిరేకంగా ఏదో జరుగుతోందనే సమాచారం ఆ సమయంలో జయలలితను షాక్‌కు గురి చేసిందన్నారు. ఈ విషయంపై సమగ్రంగా ఆరా తీసిన చో రామస్వామి అన్ని వివరాలను అక్క దృష్టికి తీసుకు వచ్చినట్టు తెలిపారు. దానిపై రహస్య విచారణ సైతం సాగినట్టు పేర్కొన్నారు. . అక్క చెప్పినట్టే.. ఆ సమయంలో అక్క(జయలలిత) చెప్పినట్టే తాను విన్నానని పేర్కొన్నారు. తన కుటుంబీకులందరినీ సాగనంపిన అనంతరం ఓ రోజున అక్కే తనకు సమాచారం పంపించారని పేర్కొన్నారు. ‘నీ మీద ఏ తప్పు లేదు.. ఇక, వచ్చేయి..’ అని అక్క పిలవడంతో గార్డెన్‌లోకి మళ్లీ వచ్చానన్నారు. ఈ సమయంలో చో రామస్వామి మరో ఆలోచన ఇచ్చారన్నారు. ఆయన ఆలోచన మేరకు తాను జయలలితకు ఓ లేఖను రాశానని తెలిపారు. ‘నేను ఏ తప్పూ చేయలేదు, రాజకీయం వ్యవహారాల్లో జోక్యం చేసుకోను, నా కుటుంబంతో సంబంధాలు కల్గి ఉండను.. నీ (జయలలిత)సంక్షేమమే ముఖ్యం’ అని ఆ లేఖలో వివరించి గార్డెన్లో చేరినట్టు పేర్కొన్నారు. తాను ఎప్పుడూ అన్నాడీఎంకే వ్యవహారాల్లో గానీ, అధికార విషయాల్లో గానీ జోక్యం చేసుకోవడం లేదన్న విషయం అక్కకు తెలుసు అని తెలిపారు. అయితే, కొన్ని సందర్భాల్లో అక్క ఆజ్ఞ మేరకు అనేక వివరాలను , ఇచ్చే సూచనల్ని, ఆదేశాలను ద్వితీయ శ్రేణి నేతల దృష్టికి తాను తీసుకెళ్లాని తెలిపారు. ఆ పయనం సాగిస్తూ ఉన్న సమయంలో సెప్టెంబరు 19న జయలలిత జ్వరం బారిన పడటం, ఆ తదుపరి వివరాలను ఆమె ప్రమాణ పత్రంలో వివరించి ఉండడం గమనార్హం. -
జయ ఆస్పత్రికి వెళ్లేందుకు నిరాకరించారా?
-
అమ్మ మరణ తేదీలోనూ మరోమలుపు
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం మిస్టరీ మలుపులు తిరుగుతోంది. జయ కన్నుమూసి ఏడాది దాటినా మరణం వెనుక అనేక మర్మాలు దాగి ఉన్నట్లు పార్టీ పెద్దలే ప్రచారం చేస్తూ సంచలనాలకు తెరదీస్తున్నారు. సాక్షి, చెన్నై: 2016 సెప్టెంబర్ 22వ తేదీ రాత్రి జయలలిత చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరినపుడు జ్వరం, డీహైడ్రేషన్ వంటి స్వల్ప అనారోగ్యంతో బాధపుడుతున్నారని ఆస్పత్రి యాజమాన్యం బులిటెన్ విడుదల చేసింది. త్వరలోనే ఆమె కోలుకుని డిశ్చార్జ్ అవుతారని సైతం ఆస్పత్రి వర్గాలు, పార్టీ శ్రేణులు తెలిపాయి. అయితే 74 రోజుల చికిత్స తరువాత అదే ఏడాది డిసెంబర్ 5వ తేదీ కన్నుమూసినట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. కోలుకుంటున్న జయలలిత ప్రాణాలు ఎలా కోల్పోయారనే ప్రశ్న సహజంగానే అందరి మెదళ్లను తొలిచివేసింది. ఎక్కువశాతం మంది ప్రజలు, అమ్మ అభిమానులు శశికళనే నిందించారు. అన్నాడీఎంకే శ్రేణులు సైతం శశికళ వైపు అనుమానంగా చూసాయేగానీ ఎవ్వరూ నోరుమెదపలేదు. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు సీబీఐ, న్యాయవిచారణకు పట్టుపట్టాయి. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేయగా, కమిషన్ చైర్మన్, రిటైర్డ్డ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉండగా, జయలలిత మరణ వివాదం ఇటీవలి కాలంలో మళ్లీ రాజుకుంటోంది. మరణించిన తరువాతనే వేలిముద్రలు సేకరణ 2016లో జరిగిన ఉప ఎన్నికల్లో బీఫారంపై జయ మరణించిన తరువాతనే వేలిముద్రలు సేకరించారని డీఎంకే లీగల్‌సెల్ కార్యదర్శి శరవణన్ విచారణ కమిషన్ ముందు వాంగ్మూలం ఇచ్చాడు. జయ వేలిముద్రలతో జీవించి ఉన్నవారి వేలిముద్రలను ఆయన పోల్చిచూపారు. కాగా, జయ 5వ తేదీ కాదు 4వ తేదీ సాయంత్రమే మరణించారని శశికళ తమ్ముడు దివాకరన్ ఇటీవల మరో బాంబు పేల్చారు. ఆ సమయంలో అక్కడే ఉన్న కేంద్రప్రభుత్వానికి చెందిన పెద్దమనిషి నడిపిన రాజకీయం వల్లనే మరణ వార్త ప్రకటన మరురోజుకు వాయిదా పడిందని ఆరోపించారు. దివాకరన్ చేసిన ప్రకటన జైల్లో ఉన్న శశికళను సైతం కంగారు పెట్టింది. ఇదిలా ఉండగా దివాకరన్ వ్యాఖ్యలను సాక్షాత్తు మంత్రి రాజేంద్రబాలాజి సైతం బలపరిచారు. విరుదునగర్‌లో శనివారం జరిగిన దివంగత ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ శత జయంతి వేడుకల బహిరంగ సభలో తమిళనాడు మంత్రి రాజేంద్రబాలాజి మాట్లాడుతూ, జయలలిత గుండెఆగిపోయి మరణించినట్లుగా 2016 డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం 5.20 గంటలకు తనకు సమాచారం రాగా వెంటనే తాను అపోలో ఆస్పత్రికి వెళ్లానని చెప్పారు. జయది హత్యే: ఇక జయ మరణాన్ని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి, మాజీ మంత్రి పొన్నయ్యన్ మరింత సంచల మలుపు తిప్పారు. అన్నాడీఎంకే వ్యవస్థాపక దినోత్సవం, దివంగత ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ శత జయంతి వేడుకలు కాంచీపురంలో శనివారం జరిగాయి. పొన్నయ్యన్ ప్రత్యేక ఉపన్యాసం చేశారు. షుగర్ వ్యాధితో బాధపడుతున్న జయలలిత అప్పుడప్పుడూ స్టెరాయిడ్ మందులు ఇవ్వాల్సి ఉండేది. అయితే జయ అనారోగ్యాన్ని శశికళ, ఆమె కుటుంబ సభ్యులు అవకాశంగా తీసుకుని ఎనిమిది నెలలపాటూ స్లోపాయిజన్‌గా పదే పదే స్టెరాయిడ్స్ ఇచ్చారు. తరచూ ఇచ్చిన స్టెరాయిడ్స్‌తో అమె ఇన్ఫెక్షన్కు గురైయ్యేలా చేసి హతమార్చారు. ఈ విషయాన్ని అన్నాడీఎం శ్రేణులు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం వల్లనే ప్రభుత్వం విచారణ కమిషన్‌ను నియమించిందని ఆయన తెలిపారు. జయ ఆస్తులపై పెత్తనం కోరిన దీప, దీపక్: జయలలిత మరణ వివాదం ఇలా సాగుతుండగా, ఆమె ఆస్తులకు తమను నిర్వాహకులుగా ప్రకటించాలని కోరుతూ ఆమె అన్నకుమారుడు దీపక్, కుమార్తె దీప మద్రాసు హైకోర్టులో శనివారం పిటిషన్ దాఖలు చేశారు. అందులో జయకు తాము మినహా చట్టబద్ధమైన వారసులు ఎవ్వరూ లేరు. చనిపోయే ముందు ఆమె వీలునామా రాసిన దాఖలాలు కూడా లేవు. వారసులుగా తమను నిర్ధారిస్తూ సర్టిఫికెట్‌ను జారీచేయాల్సిందిగా అనేకసార్లు చెన్నై తహసీల్దారును కోరినా ఇవ్వలేదు. సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేసి సర్టిఫికెట్ పొందవచ్చని ఆయన సూచించారు. జయలలితకు రూ.52 కోట్ల స్థిర, చరాస్తులున్నాయి. వాటిని ఆరునెలల్లోగా పూర్తిగా లెక్కకట్టి కోర్టుకు తెలియజేస్తాం. ఆ తరువాత ఏడాది లోగా అసలైన లెక్కలు కోర్టుకు చూపుతాం. ఇందుకు వీలుగా తమను జయ ఆస్తుల నిర్వాహకులుగా ప్రకటించాల్సిందిగా వారు పిటిషన్లో పేర్కొన్నారు. -
దినకరన్‌కు నోటీసులు..!
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆకస్మిక మరణం రాను రానూ అనుమానాస్పద మృతిగా మారిపోతున్న తరుణంలో జయ మరణ విచారణ కమిషన్ టీటీవీ దినకరన్‌కు బుధవారం నోటీసులు జారీచేసింది. అలాగే శశికళ మేనకోడలు, ఇళవరసి కుమారై్తన కృష్ణప్రియ, జయలలితకు అంతరంగిక కార్యదర్శిగా వ్యవహరించిన పూంగున్రన్లకు నోటీసులు జారీ అయినాయి. జయ మరణంపై అనేక అనుమానాలు తలెత్తడంతో సీఎం ఎడపాడి సెప్టెంబరు 25 వ తేదీన విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. రిటైర్డు న్యాయమూర్తి అరుముగస్వామి చైర్మన్‌గా నియమితులైనారు. గత నెల 22వ తేదీన విచారణ ప్రారంభం కాగా, డీఎంకే లీగల్‌సెల్ కార్యదర్శి డాక్టర్ శరవణన్, జయ మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్, దీప భర్త మాధవన్, తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శులు షీలా బాలకృష్ణన్, రామమోహన్‌రావు సహా ఇప్పటి వరకు 28 మంది కమిషన్ ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. వీరుగాక మరో 422 మంది కమిషన్‌కు వినతిపత్రాలు సమర్పించారు. అపోలో ఆసపత్రి చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రీతారెడ్డి, శశికళ సైతం విచారణ కమిషన్ నుండి నోటీసులు అందుకున్నారు. ఈ ముగ్గురు కమిషన్ ముందు హాజరుకావాల్సి ఉంది. ఇదిలా ఉండగా, అపోలో ఆసుపత్రిలో జయ చికిత్స దృశ్యాలను ఆర్కేనగర్ ఉప ఎన్నికల పోలింగ్ ముందు దినకరన్ అనుచరుడైన బహిషృత ఎమ్మెల్యే వెట్రివేల విడుదల చేయడాన్ని కమిషన్ తీవ్రంగా తప్పుపట్టింది. వీడియోల విడుదల నేరం: విచారణ జరుగుతున్న సమయంలో వీడియో విడుదల చేయడం నేరమని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కమిషన్ ఆదేశాల మేరకు వీడియో ఆధారాలను తన న్యాయవాది ద్వారా వెట్రివేల్ కమిషన్‌కు అందజేశాడు. జయలలిత చికిత్సకు సంబంధించి తన వద్ద మరిన్ని దృశ్యాలు ఉన్నాయని కృష్ణప్రియ మీడియాకు చెప్పడం కమిషన్ నుండి నోటీసులకు కారణమైంది. వచ్చేనెల 2వ తేదీన కృష్ణప్రియ కమిషన్ ముందు హాజరుకావాల్సి ఉంది. జయలలిత వీడియోకు సంబంధించి మరిన్ని ఆధారాలుంటే వారంలోగా అందజేయాలని పేర్కొంటూ దినకరన్‌కు నోటీసులు అందాయి. జయ చికిత్సకు సంబంధించిన వీడియోల విడుదలపై విచారణ కమిషన్ నిషేధం విధించింది. -
జయ తండ్రిని ఆయన భార్యే చంపేసింది!
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జీవించి ఉన్నపుడే కాదు మరణించిన తరువాత కూడా ఆమె జీవితం అనేక మలుపులు తిరుగుతోంది. జయ తండ్రి జయరామన్ ఆయన భార్య సంధ్య చేతిలోనే హత్యకు గురయ్యాడనే సంచలన వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. జయ తండ్రిది హత్యే! వివాదాస్పదంగా మారిన జయ జీవితంపై బెంగళూరులో నివసిస్తున్న ఆమె అత్త లలిత ఇటీవల తమిళ చానల్ సన్న్యూస్తో మాట్లాడారు. జయకు ఒక ఆడశిశువు జన్మించిన మాట వాస్తవమేనని, తన పెద్దమ్మే ఆమెకు పురుడుపోసిందని చెప్పారు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని జయలలిత తమతో ప్రమాణం చేయించుకున్నారన్నారు. అయితే, సదరు అమృతనే ఆమె కుమార్తె అని చెప్పడానికి తన వద్ద ఆధారమేదీ లేదన్నారు. జయ తండ్రి జయరామన్ మద్యానికి బానిస కావటంతో దూరంగా ఉంచారని, అతనికి తల్లి సంధ్యే విషమిచ్చి చంపినట్లు లలిత ఆరోపించారు. జయ ఈగోను భరించలేక, జయరామన్ హత్య వంటి సంఘటనలతో తామంతా దూరంగా వెళ్లిపోయామన్నారు. జయలలిత తండ్రి జయరామన్, సంధ్య దంపతులకు జయలలిత, జయకుమార్ సంతానం. స్వతహాగా సినీ నటి అయిన సంధ్య జయలలితను సైతం వెండితెర వైపునకు ప్రోత్సహించింది. ఆమె ఉన్నతిలో తల్లి సంధ్య ముఖ్య పాత్ర పోషించింది. జయలలిత ఆకస్మిక మరణంతో ఒక్కసారిగా అనేక వివాదాలు తెరపైకి వచ్చాయి. వీటిలో అన్నిటికంటే ముఖ్యమైంది గోప్యంగా సాగిన ఆమె వ్యక్తిగత జీవితం. అజ్ఞాతంలో అమృత: శోభన్‌బాబుతో జయ సహజీవనం చేశారని వారికి కుమార్తె కూడా ఉందనే ప్రచారం జయ మరణం తరువాత జోరందుకుంది. ఇద్దరు యువతులు, ఒక యువకుడు తాము జయ సంతానం అంటూ చెప్పుకోవడం ప్రారంభించారు. కోర్టు కొరడా ఝుళిపించడంతో ఇద్దరు వెనక్కి తగ్గగా బెంగళూరుకు చెందిన అమృత అనే యువతి మాత్రం..సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. డీఎన్ఏ పరీక్షలకు సైతం సిద్ధం అని, జయ భౌతిక కాయాన్ని సమాధి నుంచి బయటకు తీసి పరీక్షలు జరపండంటూ సవాల్ చేశారు. అయితే, ముందుగా రాష్ట్రస్థాయిలో పరిష్కరించు కోవాలంటూ సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టి వేసింది. దీంతో కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్ధమైన తరుణంలో తనను చంపుతామంటూ బెదిరింపులు వస్తున్నట్లు అమృత తెలిపారు. ఈ నేపథ్యంలోనే అమృత అజ్ఞాతంలోకి వెళ్లారని, త్వరలో కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేస్తారని సమాచారం. -
జయలలిత మృతిపై విచారణ ప్రారంభం
సాక్షి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడానికి తమిళనాడు ప్రభుత్వం ఆదేశించిన న్యాయవిచారణ ప్రారంభమైంది. జయలలిత మృతిపై రిటైర్డ్ జడ్జీ నేతృత్వంలో న్యాయవిచారణకు ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి రిటైర్డ్ జడ్జి ఆర్ముగ సామి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ముందుగా కేసులో సంబంధం ఉన్నవారికి నోటీసులు పంపనున్నారు. జయలలిత ఆస్పత్రిలో చేరిన దగ్గరనుంచి చనిపోయేవరకు దారితీసిన అన్ని పరిస్థితులపై ఆయన విచారణ జరుపుతారు. విచారణ పారదర్శకంగా జరుగుతందని, ప్రభుత్వం నిర్దేశించిన మూడు నెలల్లోనే దర్యాప్తు పూర్తి చేసి నివేదిక అందజేస్తామని ఆర్ముగ సామి చెప్పారు. అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె.. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. గత ఏడాది డిసెంబర్ 5 న అనుమానాస్పద పరిస్థితుల్లో కన్నుమూశారు. జయలలిత మృతి వెనుక ఆమె నెచ్చెలి శశికళ హస్తముందనే ఆరోపణలు వచ్చాయి. ఆమె మృతిపై అపోలో ఆస్పత్రి ఇప్పటికే వివరణ ఇచ్చింది. అయినా, జయలలిత మృతిపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడానికి న్యాయవిచారణ జరపాల్సిందేనని ఆమె వీరవిధేయుడు పన్నీర్ సెల్వం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పళనిస్వామి ప్రభుత్వం అమ్మ జయలలిత మృతిపై న్యాయవిచారణకు ఆదేశించింది. -
జయ మరణం: మూడు నెలల్లో కమిటీ నివేదిక
సాక్షి,చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ మూడు నెలల్లో నివేదిక సమర్పిస్తుంది. గత ఏడాది జయలలిత తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రికి తరలింపునకు దారితీసిన పరిస్థితులు, మరణించేవరకూ అక్కడ ఆమెకు అందించిన చికిత్స వివరాలపై విచారణ కమిషన్ దృష్టిసారిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఏఐఏడీఎంకే గ్రూపుల విలీనం సందర్భంగా మాజీ సీఎం పన్నీర్ సెల్వం జయ మృతిపై విచారణను ప్రధాన డిమాండ్‌గా ముందుకు తెచ్చిన సంగతి తెలిసిందే. పార్టీకి చెందిన పళని, పన్నీర్ సెల్వం గ్రూపులు గత నెల 21న ఏకమయ్యాయి. జయలలిత మరణంపై పార్టీ నేతలతో పాటు పలువురు సందేహాలు వ్యక్తం చేశారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ అమ్మ మరణంపై విచారణ చేపట్టాలని పెద్ద ఎత్తున నెటిజన్లు ప్రభుత్వాన్ని కోరారు. -
జయ మృతిపై విచారణ కమిషన్
సాక్షి, చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై తమిళనాడు సర్కారు విచారణ కమిషన్‌ను ఏర్పాటుచేసింది. మద్రాసు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అరుముగసామి నేతృత్వంలోని విచారణ కమిషన్ జయ మృతిపై విచారణ చేపట్టి నివేదికను సమర్పించ నుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. విషమంగా నటరాజన్ ఆరోగ్యం అక్రమ ఆస్తుల కేసులో పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ భర్త నటరాజన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయనకు చెన్నై గ్లోబల్ హెల్త్ సిటీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గత వారం అనారోగ్య సమస్యలతో హెల్త్ సిటీలో నటరాజన్‌ను చేర్పించారు. ఆయనకు కాలేయం, కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం వెంటిలేటర్ సాయంతో శ్వాస అందిస్తున్నారు. -
‘అమ్మ’ చర్చే
దివంగత సీఎం జయలలిత మరణం మిస్టరీకి బలాన్ని చేకూర్చే రీతిలో మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అమ్మ మరణంపై రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక, త్వరితగతిన విచారణకు ఆదేశించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. డీఎంకే అయితే, సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేసింది. సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంల మీద సైతం అనుమానాలు వ్యక్తం అవుతూ చర్చ జోరందుకోవడంతో పాలకులు ఇరకాటంలో పడే ప్రమాదం వచ్చింది. జయలలిత మేనకోడలు దీప కోర్టును ఆశ్రయించేందుకు నిర్ణయించారు. సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి జయలలిత మరణంలో మిస్టరీ ఉందనే ఆరోపణలకు బలం చేకూరే రీతిలో ఒక్కో నిజాలు తాజాగా బయటకు వస్తున్నాయి. అటవీ శాఖ మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ ఒక అడుగు ముందుకు వేసి అనుమానాలకు బలం చేకూర్చే విధంగా చేసిన వ్యాఖ్యలు దుమారా న్ని రేపుతున్నాయి. జయలలిత ఆరోగ్యం గురించి బయటకు చెప్పిందంతా అమ్మ మీదొట్టు.. అంతా అబద్ధం అని ఆయన స్పందించడం చర్చకు దారితీసింది. అమ్మ మరణంలో మిస్టరీ ఉందన్న విషయం తేటతెల్లం అవుతోందని సర్వత్రా వ్యాఖ్యానిస్తున్నారు. అన్నీ కప్పి పుచ్చి, ఇప్పుడు నోరు మెదుపుతున్న పాలకుల మీద అగ్గి మీద గుగ్గిలంలా మండిపడే వాళ్లు కొందరు అయితే, చిన్నమ్మ శశికళ సహా మంత్రులందరినీ విచారణ వలయంలోకి తీసుకొచ్చి కఠినంగా శిక్షించాల్సిందేనని మరికొందరు నినదిస్తున్నారు. ఇక, ప్రతిపక్షాలు అయితే, విచారణ కమిషన్‌ను ప్రకటించి, న్యాయమూర్తి నియామకంలో జాప్యం ఏమిటంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఆస్పత్రిలోని సీసీ కెమెరాల పుటేజీని బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. కొన్ని పార్టీలు ప్రత్యేక విచారణకు, మరికొన్ని సీబీఐ విచారణకు పట్టుబడుతున్నాయి. జయలలిత మేనకోడలు, ఎంజీఆర్ అమ్మ దీప పేరవై కార్యదర్శి దీప మాట్లాడుతూ ఎన్నిరోజులు దాచి పెట్టి్టనా వాస్తవాలన్నీ బయటికొస్తాయని వ్యాఖ్యానించారు. సీబీఐ విచారణకు పట్టు డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, ఎవరినీ అమ్మ జయలలితను చూడడానికి అనుమతించలేదని మంత్రి వ్యాఖ్యానించి ఉన్నారని గుర్తుచేశారు. అలాంటప్పుడు ఉప ఎన్నికల్లో అభ్యర్థుల బీ ఫాంలో వేలి ముద్రలు వేసిందెవరు, వేయించుకు వచ్చిందెవరు..? అని ప్రశ్నించారు. ఇప్పటికే పలు రకాల అనుమానాలు జయలలిత మరణం మీద సాగుతున్నాయని వివరిస్తూ, ఇన్నాళ్లు నోరు మెదపని వాళ్లు, ఇప్పుడెందుకు ముందుకు వస్తున్నారని ప్రశ్నించారు. విచారణ కమిషన్ అని ప్రకటించిన సీఎం, డిప్యూటీ సీఎంలు, ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. అమ్మ మరణంలో మిస్టరీ ఛేదింపునకు ధర్మయుద్ధం అని వ్యాఖ్యానించిన డిప్యూటీ, ఇప్పుడు ఎలాంటి సమాధానం ప్రజలకు ఇస్తారో వేచి చూడాల్సి ఉందని విమర్శించారు. ఆయన చేసింది ధర్మయుద్ధం కాదని, నమ్మక ద్రోహం అని ఆగ్రహం వ్యక్తంచేశారు. జయలలిత ఆస్పత్రిలో ఉన్న సమయంలో పళని, పన్నీరు సైతం అక్కడే ఉన్నారని గుర్తుచేస్తూ, విచారణకు ఆదేశిస్తే, ఎక్కడ తాము ఇరకాటంలో పడుతామేమోనన్న భయంతోనే జాప్యం చేస్తున్నట్టుందని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచనున్నామన్నారు. దిండుగల్ స్పందన స్టాలిన్ వ్యాఖ్యలపై దిండుగల్ శ్రీనివాసన్ స్పందించారు. ఆయన డిమాండ్ చేయడంలో తప్పేమి లేదని వ్యాఖ్యానించారు. విచారణ కమిషన్‌కు తగ్గ కార్యాచరణ సాగుతోందని పేర్కొంటూ, శశికళ, అండ్ కుటుంబం నిర్బంధం వల్లే ఆస్పత్రి వ్యవహారాలపై అబద్ధాలు చెప్పాల్సి వచ్చిందని తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. సీసీ కెమెరాల్లోని దృశ్యాలను మార్చలేంగా, అందులోనే వాస్తవాలు బయటకువస్తాయని వ్యాఖ్యానించారు. మంత్రి కడంబూరు రాజు పేర్కొంటూ, విచారణ కమిషన్ ఏర్పాటుకు చర్యలు సాగుతున్నాయని వ్యాఖ్యానించారు. అన్నీ ఒకే సారి చేయలేమని, ఒక్కొక్కటిగా చేస్తూ వెళ్తున్నట్టు వివరించారు. తొలుత పోయెస్ గార్డెన్‌ను స్మారక మందిరంగా మార్చే పనులు, తదుపరి రూ. 15 కోట్లతో అమ్మ సమాధి వద్ద మణి మండపం పనుల మీద దృష్టి పెట్టి ఉన్నట్టు తెలిపారు. మంత్రి బెంజిమిన్ పేర్కొంటూ, జయలలిత ఆత్మ ఏ ఒక్కర్నీ వదలి పెట్టదని, అందర్నీ శిక్షించి తీరుతుందని వ్యాఖ్యానించడం గమనార్హం. కోర్టుకు దీప కాలం గడిచిన అనంతరం ఇప్పుడు మంత్రులు ఒకొక్కటిగా బయట పెడుతున్నారని జయలలిత మేన కోడలు వ్యాఖ్యానించారు. ఇంకా మరెన్ని రోజులు వాస్తవాలను దాచి పెడుతారో చూస్తానని, అన్నీ బయటకు వస్తాయని పేర్కొన్నారు. మేనత్త మరణంలో ఉన్న మిస్టరీ త్వరితగతిన బయటకు వచ్చే విధంగా కోర్టును ఆశ్రయించనున్నట్టు తెలిపారు. ఇక, పీఎంకే అధినేత రాందాసు పేర్కొంటూ, జయలలిత మరణంలో వెయ్యి అనుమానాలున్నాయని, ఇప్పుడు అందులో కొన్ని బయటకు వస్తున్న దృష్ట్యా, మిగిలినవన్నీ వెలుగులోకి రావాలంటే, త్వరితగతిన విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ పేర్కొంటూ, విచారణ కమిష న్ను ఏర్పాటుచేస్తే, దొంగల పనితనం అంతా బయట కు రావడం ఖాయం అని, అందుకే ఆ కమిషన్ ఏర్పాటులో జాప్యం సాగుతున్నట్టుందని అనుమానం వ్యక్తం చేశారు. నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ పేర్కొంటూ, అమ్మ మరణంతోనే నిజాలన్నీ పాతిపెట్టారని, ఇప్పుడు కొత్తగా ఎన్ని ప్రయత్నాల చేసినా ఫలితం శూన్యమేనని వ్యాఖ్యానించారు. జయలలిత మరణించినపుడే నిజం చనిపోయిందని, ఈ దృష్ట్యా, ఇక ఈ విషయంగా రాద్దాంతం అనసరం అని స్పందించారు. అన్నాడీఎంకే కున్నం ఎమ్మెల్యే రామచంద్రన్ పేర్కొంటూ, అమ్మ ఆరోగ్యం, ఆస్పత్రి, మరణం వరకు ఇద్దరికే అన్నీ తెలిసి ఉన్నాయని, ఆ ఇద్దరినీ విచారణ వలయంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇందులో ఒకరు శశికళ అని, మరొకరు అమ్మ వైద్యుడు శివకుమార్ అని పేర్కొంటూ, కనీసం శివకుమార్ అయినా, వివరాలను బయటపెట్టాలని విన్నవించారు. -
మిస్టరీ తేల్చాల్సిందే!
♦ తేనంపేటలో న్యాయవాది పుగలేంది ఫిర్యాదు ♦ జయ మృతిపై 186 మందిపై అనుమానాలు ♦ జాబితాలో పన్నీరు, శశికళ పేర్లు ♦ కేంద్ర, రాష్ట్ర హోంశాఖలకు కూడా సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలిత మరణం వెనుక దాగి ఉన్న మిస్టరీని ఛేదిం చాల్సిందేనని పట్టుబడుతూ ఎంజీఆర్ నగర్‌కు చెందిన న్యాయవాది పుగలేంది తేనాంపేట పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. చిన్నమ్మ శశికళ, మాజీ సీఎం పన్నీరుసెల్వంతోపాటు 186 మందిపై అనుమానాలు ఉన్నాయని పేర్కొంటూ ఓ జాబితాను ఫిర్యాదుకు జత పరిచారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హోం శాఖలకు, డీజీపీలకు సైతం ఫిర్యాదు చేశారు. తమిళుల అమ్మ జయలలిత మరణం వెనుక మిస్టరీ దాగి ఉందన్న ప్రచారం రాష్ట్రంలో సాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. అమ్మ నమ్మిన బంటు పన్నీ రుసెల్వం సైతం అనుమానం వ్యక్తం చేయడంతో ఆ ప్రచారానికి బలం చేకూ రింది. విచారణ కమిషన్ ఏర్పాటు చేయాల్సిందేనని పన్నీరు శిబిరం పట్టుబడుతూ వస్తోంది. తాము అధికారంలోకి వస్తే తప్పకుండా విచారణ జరిపించి తీరుతామన్న వ్యాఖ్యలను డీఎంకే వర్గాలు చేస్తూ వస్తున్నాయి. వ్యవహారం కోర్టుల వరకు వెళ్లిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో న్యాయవాది పుగలేంది శనివారం తేనాంపేట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మళ్లీ అమ్మ మరణం మిస్టరీ నినాదం తెర మీదకు వచ్చింది. ఈ ఫిర్యాదులో 186 మంది పేర్లను చేర్చడం గమనార్హం. దీనిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హోం శాఖలకు, రాష్ట్ర డీజీపీకి సైతం ఆయన పంపించారు. మిస్టరీ తేల్చాల్సిందే: న్యాయవాది పుగలేంది తేనాంపేట ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేశారు. అందులో... అమ్మ ఆస్పత్రి పాలు, ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అన్నాడీఎంకే వర్గాలు స్పందిస్తూ వచ్చిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. ఆరోగ్యంగా తమ సీఎం ఉన్నారని ప్రజలందరూ భావిస్తూ వచ్చారని పేర్కొన్నారు. అయితే, డిసెంబర్ ఐదో తేదీ అర్ధరాత్రి జయలలిత ఇక లేదని ప్రకటించడం తమిళ ప్రజల్ని తీవ్ర ఆందోళనకు, ఆవేదనకు గురి చేసిందని గుర్తు చేశారు. అదే రోజు అర్ధరాత్రి నుంచి సీఎంగా పన్నీరుసెల్వం కొనసాగినట్టు పేర్కొన్నారు. అయితే, ఫిబ్రవరి ఏడో తేదీ వరకు ఎనిమిదిన్నర గంటల సమయంలో జయలలిత సమాధి వద్ద పన్నీరు సెల్వం చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో అనుమానాలు రేపినట్టు గుర్తు చేశారు. అమ్మ మరణంలో మిస్టరీ ఉందని, ఆయన సంధించిన వ్యాఖ్యల్లో ఆమె నెచ్చలి శశికళ కుటుంబం చుట్టూ అనుమానాలు బయలు దేరినట్టు వివరించారు. ఇందుకు సమాధానం ఇచ్చే రీతిలో ఆరోగ్య మంత్రి విజయభాస్కర్ అనుమానాలకు బలం చేకూర్చే విధంగా పన్నీరు మీద నిందల్ని వేశారని గుర్తు చేశారు. జరిగిన, జరుగుతున్న ఘటనలు, సాగుతున్న పరిణామాలను బట్టి చూస్తే, జయలలిత హత్యకు గురయ్యారా? అన్న అనుమానాలు బయలు దేరాయని, రాజకీయ స్వలాభం కోసం ఉమ్మడిగా కుట్ర జరిగినట్టు తాను భావిస్తున్నట్టు పేర్కొన్నారు. సీఎంను పథకం ప్రకారం మట్టుబెట్టి , సహజమరణంగా చిత్రీకరించినట్టుగా అనుమానాలకు బలం చేకూరుతున్నట్టుగా తాజా పరిణామాలు ఉన్నాయన్నారు. మాజీ సీఎం పన్నీరుసెల్వం, శశికళ, అన్నాడీఎంకేకు చెందిన 127 మంది ఎమ్మెల్యేలు, అన్వర్ రాజా, సెంగొట్టవన్, గోపాలకృష్ణన్, జనార్దన్, వనరోజ, ఎస్ఆర్ విజయభాస్కర్ తదితర 37 మంది పార్లమెంట్ సభ్యులు, ముత్తుకరుప్పన్, సెల్వరాజ్, విజిలా సత్యనాంద్, నవనీతకృష్ణన్, వైద్యలింగం, ఎస్ఆర్ బాలసుబ్రమణియన్ తదితర 11 మంది రాజ్య సభ సభ్యులు, అన్నాడీఎంకే నేతలు పొన్నయ్యన్, మధుసూదనన్, బన్రూటి రామచంద్రన్, వలర్మతి, గోకుల ఇందిర, సీఆర్ సర్వతిలతో పాటు అపోలో ఆస్పత్రి డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డి, ఆయన కుమార్తె సంగీత రెడ్డిల మీద అనుమానాలు ఉన్నాయని, జయలలిత మరణం గురించి వీళ్లందరికీ తప్పకుండా తెలిసి ఉంటుందని, అందుకే మిస్టరీ ఛేదింపునకు విచారణ జరిపించాల్సిందేనని పట్టుబట్టే పనిలో పడ్డారు. పలు సమస్యలపై మీద తరచూ కోర్టుల్లో పిటిషన్లు వేయడంలో పుగలేంది ముందున్న విషయం తెలిసిందే. తాజా ఫిర్యాదు మీద పోలీసులు స్పందించని పక్షంలో, 186 మంది పేర్లతో కూడిన పిటిషన్‌ను మరికొద్ది రోజుల్లో కోర్టులో వేసినా వేయవచ్చు.