సాక్షి,చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ మూడు నెలల్లో నివేదిక సమర్పిస్తుంది. గత ఏడాది జయలలిత తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రికి తరలింపునకు దారితీసిన పరిస్థితులు, మరణించేవరకూ అక్కడ ఆమెకు అందించిన చికిత్స వివరాలపై విచారణ కమిషన్ దృష్టిసారిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
ఏఐఏడీఎంకే గ్రూపుల విలీనం సందర్భంగా మాజీ సీఎం పన్నీర్ సెల్వం జయ మృతిపై విచారణను ప్రధాన డిమాండ్‌గా ముందుకు తెచ్చిన సంగతి తెలిసిందే. పార్టీకి చెందిన పళని, పన్నీర్ సెల్వం గ్రూపులు గత నెల 21న ఏకమయ్యాయి. జయలలిత మరణంపై పార్టీ నేతలతో పాటు పలువురు సందేహాలు వ్యక్తం చేశారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ అమ్మ మరణంపై విచారణ చేపట్టాలని పెద్ద ఎత్తున నెటిజన్లు ప్రభుత్వాన్ని కోరారు.