అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం మిస్టరీ మలుపులు తిరుగుతోంది. జయ కన్నుమూసి ఏడాది దాటినా మరణం వెనుక అనేక మర్మాలు దాగి ఉన్నట్లు పార్టీ పెద్దలే ప్రచారం చేస్తూ సంచలనాలకు తెరదీస్తున్నారు.
సాక్షి, చెన్నై: 2016 సెప్టెంబర్ 22వ తేదీ రాత్రి జయలలిత చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరినపుడు జ్వరం, డీహైడ్రేషన్ వంటి స్వల్ప అనారోగ్యంతో బాధపుడుతున్నారని ఆస్పత్రి యాజమాన్యం బులిటెన్ విడుదల చేసింది. త్వరలోనే ఆమె కోలుకుని డిశ్చార్జ్ అవుతారని సైతం ఆస్పత్రి వర్గాలు, పార్టీ శ్రేణులు తెలిపాయి. అయితే 74 రోజుల చికిత్స తరువాత అదే ఏడాది డిసెంబర్ 5వ తేదీ కన్నుమూసినట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. కోలుకుంటున్న జయలలిత ప్రాణాలు ఎలా కోల్పోయారనే ప్రశ్న సహజంగానే అందరి మెదళ్లను తొలిచివేసింది.
ఎక్కువశాతం మంది ప్రజలు, అమ్మ అభిమానులు శశికళనే నిందించారు. అన్నాడీఎంకే శ్రేణులు సైతం శశికళ వైపు అనుమానంగా చూసాయేగానీ ఎవ్వరూ నోరుమెదపలేదు. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు సీబీఐ, న్యాయవిచారణకు పట్టుపట్టాయి. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేయగా, కమిషన్ చైర్మన్, రిటైర్డ్డ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉండగా, జయలలిత మరణ వివాదం ఇటీవలి కాలంలో మళ్లీ రాజుకుంటోంది.
మరణించిన తరువాతనే వేలిముద్రలు సేకరణ
2016లో జరిగిన ఉప ఎన్నికల్లో బీఫారంపై జయ మరణించిన తరువాతనే వేలిముద్రలు సేకరించారని డీఎంకే లీగల్‌సెల్ కార్యదర్శి శరవణన్ విచారణ కమిషన్ ముందు వాంగ్మూలం ఇచ్చాడు. జయ వేలిముద్రలతో జీవించి ఉన్నవారి వేలిముద్రలను ఆయన పోల్చిచూపారు. కాగా, జయ 5వ తేదీ కాదు 4వ తేదీ సాయంత్రమే మరణించారని శశికళ తమ్ముడు దివాకరన్ ఇటీవల మరో బాంబు పేల్చారు. ఆ సమయంలో అక్కడే ఉన్న కేంద్రప్రభుత్వానికి చెందిన పెద్దమనిషి నడిపిన రాజకీయం వల్లనే మరణ వార్త ప్రకటన మరురోజుకు వాయిదా పడిందని ఆరోపించారు.
దివాకరన్ చేసిన ప్రకటన జైల్లో ఉన్న శశికళను సైతం కంగారు పెట్టింది. ఇదిలా ఉండగా దివాకరన్ వ్యాఖ్యలను సాక్షాత్తు మంత్రి రాజేంద్రబాలాజి సైతం బలపరిచారు. విరుదునగర్‌లో శనివారం జరిగిన దివంగత ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ శత జయంతి వేడుకల బహిరంగ సభలో తమిళనాడు మంత్రి రాజేంద్రబాలాజి మాట్లాడుతూ, జయలలిత గుండెఆగిపోయి మరణించినట్లుగా 2016 డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం 5.20 గంటలకు తనకు సమాచారం రాగా వెంటనే తాను అపోలో ఆస్పత్రికి వెళ్లానని చెప్పారు.
జయది హత్యే:
ఇక జయ మరణాన్ని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి, మాజీ మంత్రి పొన్నయ్యన్ మరింత సంచల మలుపు తిప్పారు. అన్నాడీఎంకే వ్యవస్థాపక దినోత్సవం, దివంగత ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ శత జయంతి వేడుకలు కాంచీపురంలో శనివారం జరిగాయి. పొన్నయ్యన్ ప్రత్యేక ఉపన్యాసం చేశారు. షుగర్ వ్యాధితో బాధపడుతున్న జయలలిత అప్పుడప్పుడూ స్టెరాయిడ్ మందులు ఇవ్వాల్సి ఉండేది. అయితే జయ అనారోగ్యాన్ని శశికళ, ఆమె కుటుంబ సభ్యులు అవకాశంగా తీసుకుని ఎనిమిది నెలలపాటూ స్లోపాయిజన్‌గా పదే పదే స్టెరాయిడ్స్ ఇచ్చారు. తరచూ ఇచ్చిన స్టెరాయిడ్స్‌తో అమె ఇన్‌ఫెక్షన్‌కు గురైయ్యేలా చేసి హతమార్చారు. ఈ విషయాన్ని అన్నాడీఎం శ్రేణులు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం వల్లనే ప్రభుత్వం విచారణ కమిషన్‌ను నియమించిందని ఆయన తెలిపారు.
జయ ఆస్తులపై పెత్తనం కోరిన దీప, దీపక్:
జయలలిత మరణ వివాదం ఇలా సాగుతుండగా, ఆమె ఆస్తులకు తమను నిర్వాహకులుగా ప్రకటించాలని కోరుతూ ఆమె అన్నకుమారుడు దీపక్, కుమార్తె దీప మద్రాసు హైకోర్టులో శనివారం పిటిషన్ దాఖలు చేశారు. అందులో జయకు తాము మినహా చట్టబద్ధమైన వారసులు ఎవ్వరూ లేరు. చనిపోయే ముందు ఆమె వీలునామా రాసిన దాఖలాలు కూడా లేవు. వారసులుగా తమను నిర్ధారిస్తూ సర్టిఫికెట్‌ను జారీచేయాల్సిందిగా అనేకసార్లు చెన్నై తహసీల్దారును కోరినా ఇవ్వలేదు. సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేసి సర్టిఫికెట్ పొందవచ్చని ఆయన సూచించారు. జయలలితకు రూ.52 కోట్ల స్థిర, చరాస్తులున్నాయి. వాటిని ఆరునెలల్లోగా పూర్తిగా లెక్కకట్టి కోర్టుకు తెలియజేస్తాం. ఆ తరువాత ఏడాది లోగా అసలైన లెక్కలు కోర్టుకు చూపుతాం. ఇందుకు వీలుగా తమను జయ ఆస్తుల నిర్వాహకులుగా ప్రకటించాల్సిందిగా వారు పిటిషన్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment