దివంగత సీఎం జయలలిత మరణం మిస్టరీకి బలాన్ని చేకూర్చే రీతిలో మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అమ్మ మరణంపై రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక, త్వరితగతిన విచారణకు ఆదేశించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. డీఎంకే అయితే, సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేసింది. సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంల మీద సైతం అనుమానాలు వ్యక్తం అవుతూ చర్చ జోరందుకోవడంతో పాలకులు ఇరకాటంలో పడే ప్రమాదం వచ్చింది. జయలలిత మేనకోడలు దీప కోర్టును ఆశ్రయించేందుకు నిర్ణయించారు.
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి జయలలిత మరణంలో మిస్టరీ ఉందనే ఆరోపణలకు బలం చేకూరే రీతిలో ఒక్కో నిజాలు తాజాగా బయటకు వస్తున్నాయి. అటవీ శాఖ మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ ఒక అడుగు ముందుకు వేసి అనుమానాలకు బలం చేకూర్చే విధంగా చేసిన వ్యాఖ్యలు దుమారా న్ని రేపుతున్నాయి. జయలలిత ఆరోగ్యం గురించి బయటకు చెప్పిందంతా అమ్మ మీదొట్టు.. అంతా అబద్ధం అని ఆయన స్పందించడం చర్చకు దారితీసింది. అమ్మ మరణంలో మిస్టరీ ఉందన్న విషయం తేటతెల్లం అవుతోందని సర్వత్రా వ్యాఖ్యానిస్తున్నారు.
అన్నీ కప్పి పుచ్చి, ఇప్పుడు నోరు మెదుపుతున్న పాలకుల మీద అగ్గి మీద గుగ్గిలంలా మండిపడే వాళ్లు కొందరు అయితే, చిన్నమ్మ శశికళ సహా మంత్రులందరినీ విచారణ వలయంలోకి తీసుకొచ్చి కఠినంగా శిక్షించాల్సిందేనని మరికొందరు నినదిస్తున్నారు. ఇక, ప్రతిపక్షాలు అయితే, విచారణ కమిషన్‌ను ప్రకటించి, న్యాయమూర్తి నియామకంలో జాప్యం ఏమిటంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఆస్పత్రిలోని సీసీ కెమెరాల పుటేజీని బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. కొన్ని పార్టీలు ప్రత్యేక విచారణకు, మరికొన్ని సీబీఐ విచారణకు పట్టుబడుతున్నాయి. జయలలిత మేనకోడలు, ఎంజీఆర్ అమ్మ దీప పేరవై కార్యదర్శి దీప మాట్లాడుతూ ఎన్నిరోజులు దాచి పెట్టి్టనా వాస్తవాలన్నీ బయటికొస్తాయని వ్యాఖ్యానించారు.
సీబీఐ విచారణకు పట్టు
డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, ఎవరినీ అమ్మ జయలలితను చూడడానికి అనుమతించలేదని మంత్రి వ్యాఖ్యానించి ఉన్నారని గుర్తుచేశారు. అలాంటప్పుడు ఉప ఎన్నికల్లో అభ్యర్థుల బీ ఫాంలో వేలి ముద్రలు వేసిందెవరు, వేయించుకు వచ్చిందెవరు..? అని ప్రశ్నించారు. ఇప్పటికే పలు రకాల అనుమానాలు జయలలిత మరణం మీద సాగుతున్నాయని వివరిస్తూ, ఇన్నాళ్లు నోరు మెదపని వాళ్లు, ఇప్పుడెందుకు ముందుకు వస్తున్నారని ప్రశ్నించారు.
విచారణ కమిషన్ అని ప్రకటించిన సీఎం, డిప్యూటీ సీఎంలు, ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. అమ్మ మరణంలో మిస్టరీ ఛేదింపునకు ధర్మయుద్ధం అని వ్యాఖ్యానించిన డిప్యూటీ, ఇప్పుడు ఎలాంటి సమాధానం ప్రజలకు ఇస్తారో వేచి చూడాల్సి ఉందని విమర్శించారు. ఆయన చేసింది ధర్మయుద్ధం కాదని, నమ్మక ద్రోహం అని ఆగ్రహం వ్యక్తంచేశారు. జయలలిత ఆస్పత్రిలో ఉన్న సమయంలో పళని, పన్నీరు సైతం అక్కడే ఉన్నారని గుర్తుచేస్తూ, విచారణకు ఆదేశిస్తే, ఎక్కడ తాము ఇరకాటంలో పడుతామేమోనన్న భయంతోనే జాప్యం చేస్తున్నట్టుందని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచనున్నామన్నారు.
దిండుగల్ స్పందన
స్టాలిన్ వ్యాఖ్యలపై దిండుగల్ శ్రీనివాసన్ స్పందించారు. ఆయన డిమాండ్ చేయడంలో తప్పేమి లేదని వ్యాఖ్యానించారు. విచారణ కమిషన్‌కు తగ్గ కార్యాచరణ సాగుతోందని పేర్కొంటూ, శశికళ, అండ్ కుటుంబం నిర్బంధం వల్లే ఆస్పత్రి వ్యవహారాలపై అబద్ధాలు చెప్పాల్సి వచ్చిందని తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. సీసీ కెమెరాల్లోని దృశ్యాలను మార్చలేంగా, అందులోనే వాస్తవాలు బయటకువస్తాయని వ్యాఖ్యానించారు.
మంత్రి కడంబూరు రాజు పేర్కొంటూ, విచారణ కమిషన్ ఏర్పాటుకు చర్యలు సాగుతున్నాయని వ్యాఖ్యానించారు. అన్నీ ఒకే సారి చేయలేమని, ఒక్కొక్కటిగా చేస్తూ వెళ్తున్నట్టు వివరించారు. తొలుత పోయెస్ గార్డెన్‌ను స్మారక మందిరంగా మార్చే పనులు, తదుపరి రూ. 15 కోట్లతో అమ్మ సమాధి వద్ద మణి మండపం పనుల మీద దృష్టి పెట్టి ఉన్నట్టు తెలిపారు. మంత్రి బెంజిమిన్ పేర్కొంటూ, జయలలిత ఆత్మ ఏ ఒక్కర్నీ వదలి పెట్టదని, అందర్నీ శిక్షించి తీరుతుందని వ్యాఖ్యానించడం గమనార్హం.
కోర్టుకు దీప
కాలం గడిచిన అనంతరం ఇప్పుడు మంత్రులు ఒకొక్కటిగా బయట పెడుతున్నారని జయలలిత మేన కోడలు వ్యాఖ్యానించారు. ఇంకా మరెన్ని రోజులు వాస్తవాలను దాచి పెడుతారో చూస్తానని, అన్నీ బయటకు వస్తాయని పేర్కొన్నారు. మేనత్త మరణంలో ఉన్న మిస్టరీ త్వరితగతిన బయటకు వచ్చే విధంగా కోర్టును ఆశ్రయించనున్నట్టు తెలిపారు. ఇక, పీఎంకే అధినేత రాందాసు పేర్కొంటూ, జయలలిత మరణంలో వెయ్యి అనుమానాలున్నాయని, ఇప్పుడు అందులో కొన్ని బయటకు వస్తున్న దృష్ట్యా, మిగిలినవన్నీ వెలుగులోకి రావాలంటే, త్వరితగతిన విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ పేర్కొంటూ, విచారణ కమిష న్‌ను ఏర్పాటుచేస్తే, దొంగల పనితనం అంతా బయట కు రావడం ఖాయం అని, అందుకే ఆ కమిషన్ ఏర్పాటులో జాప్యం సాగుతున్నట్టుందని అనుమానం వ్యక్తం చేశారు. నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ పేర్కొంటూ, అమ్మ మరణంతోనే నిజాలన్నీ పాతిపెట్టారని, ఇప్పుడు కొత్తగా ఎన్ని ప్రయత్నాల చేసినా ఫలితం శూన్యమేనని వ్యాఖ్యానించారు. జయలలిత మరణించినపుడే నిజం చనిపోయిందని, ఈ దృష్ట్యా, ఇక ఈ విషయంగా రాద్దాంతం అనసరం అని స్పందించారు. అన్నాడీఎంకే కున్నం ఎమ్మెల్యే రామచంద్రన్ పేర్కొంటూ, అమ్మ ఆరోగ్యం, ఆస్పత్రి, మరణం వరకు ఇద్దరికే అన్నీ తెలిసి ఉన్నాయని, ఆ ఇద్దరినీ విచారణ వలయంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇందులో ఒకరు శశికళ అని, మరొకరు అమ్మ వైద్యుడు శివకుమార్ అని పేర్కొంటూ, కనీసం శివకుమార్ అయినా, వివరాలను బయటపెట్టాలని విన్నవించారు.