cbi enquity
-
సీబీఐ విచారణ పూర్తి.. సీఎం కేసీఆర్‌తో కవిత భేటీ
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట కవిత సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి బయల్దేరిన కవిత ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. ఆమె వెంట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఉన్నారు. సీబీఐ విచారణపై కేసీఆర్‌కు వివరించారు. 45 నిమిషాలపాటు వీరి సమావేశం కొనసాగింది. అనంతరం ప్రగతిభవన్ నుంచి కవిత తన ఇంటికి వెళ్లారు. కాగా ఢిల్లీ లిక్కరర్ స్కాం కేసులో కవితను సీబీఐ ఆదివారం విచారించిన విషయం తెలిసిందే. ఉదయం 11 గంటల నుంచి దాదాపు 7 గంటలపాటు కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. సీఆర్పీసీ 161కింద కవిత స్టేట్మెంట్ను రికార్డు చేశారు. విచారణ ముగియడంతో సీబీఐ అధికారులు ఢిల్లీకి తిరిగి వెళ్లారు. అవసరమైతే మళ్లీ విచారించే అవకాశం ఉంది. మరోవైపు కవిత విచారణకు సంబంధించి సీబీఐ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. చదవండి: ముగిసిన కవిత సీబీఐ విచారణ.. -
దేశ చరిత్రలో తొలిసారి.. సిట్టింగ్ జడ్జ్‌పై
సాక్షి, న్యూఢిల్లీ: అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎన్ శుక్లాపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ అనుమతించారు. శుక్లాపై గతకొంత కాలంగా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వినిపిస్తోన్న విషయం తెలిసిందే. జస్టిస్ శుక్లాపై 2017-2018 విద్యా సంవత్సరంలో ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను లెక్కచేయకుండా ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే సిట్టింగ్ జడ్జ్‌పై సీబీఐ విచారణ చేపట్టాలంటే దానికి సీజేఐ అనుమతి తప్పని సరి. ఈ నేపథ్యంలో ఆయనపై విచారణకు ఆదేశించాలని సీబీఐ ప్రత్యేక దర్యాప్తు అధికారి ప్రధాన న్యాయమూర్తిని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన గొగోయ్ శుక్లాపై విచారణకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఓ సిట్టింగ్ న్యాయమూర్తిపై సీబీఐ విచారణ చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న శుక్లాను తొలగించాలని జస్టిస్ రంజన్ గొగోయ్ ఇదివరకే కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. అంతర్గత విచారణలో జస్టిస్ శుక్లా దుష్ప్రవర్తన రుజువైందని లేఖలో పేర్కొన్నారు. అందువల్ల ఆయన్ను తొలగించాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. ప్రైవేటు మెడికల్ కళాశాల అడ్మిషన్లలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. గతంలో దీనికి సంబంధించి ఆయనపై కేసు నమోదైందయినట్లు కూడా సీజే గుర్తుచేశారు. ఇదిలావుండగా.. జస్టిస్ శుక్లాపై ఆరోపణల నేపథ్యంలో మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ, సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్కే అగ్నిహోత్రి, మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీకే జైస్వాల్‌లతో అంతర్గత కమిటీ ఏర్పాటైంది. జస్టిస్ శుక్లాపై వచ్చిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని కమిటీ తన విచారణ నివేదికలో స్పష్టం చేసింది. దీంతో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా స్పందిస్తూ జస్టిస్ శుక్లా రాజీనామా చేయాలని, లేదంటే స్వచ్ఛంద పదవీవిరమణను ఎంచుకోవచ్చని సూచించారు. తాజాగా సీజే ఆదేశాలతో ఆయన సీబీఐ విచారణకు తప్పనిసరిగా హాజరుకావాల్సింది. -
అసిఫా కుటుంబానికి రక్షణ ఇవ్వండి
న్యూఢిల్లీ/కఠువా: కఠువాలో సామూహిక అత్యాచారం, హత్యకు గురైన చిన్నారి అసిఫా కుటుంబానికి, ఈ కేసులో బాధితులకు సాయపడుతున్న న్యాయవాదితో పాటు వారి కుటుంబ స్నేహితుడికి రక్షణ కల్పించాలని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే కేసు విచారణను కఠువా నుంచి చండీగఢ్ మార్చాలన్న బాధితురాలి తండ్రి పిటిషన్‌ను కూడా సుప్రీం సోమవారం పరిగణనలోకి తీసుకుంది. ఈ అంశంపై స్పందన తెలియజేయాలని కశ్మీర్ ప్రభుత్వానికి సూచించింది. ఈ కేసులో జమ్మూ కశ్మీర్ పోలీసుల దర్యాప్తు పట్ల తాను సంతృప్తిగా ఉన్నానని బాధితురాలి తండ్రి సుప్రీంకు వెల్లడించడంతో పాటు, సీబీఐ విచారణను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపాడు. ఈ సందర్భంగా కోర్టు స్పందిస్తూ.. ‘ఈ స్థితిలో కేసును సీబీఐకి బదిలీ చేసే అంశంపై జోక్యం చేసుకునే ఉద్దేశ్యం మాకు లేదు’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం పేర్కొంది. ‘బాధితురాలి కుటుంబానికి, న్యాయవాది దీపక్ సింగ్ రజావత్, కుటుంబ స్నేహితుడు తలిద్ హుస్సేన్‌కు భద్రతను పెంచాలని జమ్మూ కశ్మీర్ పోలీసులను ఆదేశిస్తున్నాం. జమ్మూలో మతపరమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశమున్న నేపథ్యంలో కేసు విచారణను బదిలీ చేసే అంశంపై ఏప్రిల్ 27లోగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసుతో సంబంధమున్న మైనర్‌కు తగిన భద్రత కల్పించాలనీ ఆదేశించింది. కేసుతో సంబంధమున్న వారి పిటిషన్లను మాత్రమే విచారిస్తామంది. సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ ప్రస్తావించిన పిటిషన్లను విచారించేందుకు అంగీకరించింది. విధులకు హాజరైన జమ్మూ న్యాయవాదులు కఠువా కేసును సీబీఐకి అప్పగించాలని కోరడంతో పాటు పలు డిమాండ్లతో 12 రోజులుగా విధులు బహిష్కరించిన జమ్మూ హైకోర్టు బార్ అసోసియేషన్ న్యాయవాదులు సోమవారం విధుల్లో చేరారు. బార్ అసోషియేషన్ సమావేశంలో నిర్ణయం అనంతరం వారు కోర్టుకు హాజరయ్యారు. సీబీఐకి అప్పగించండి: నిందితులు తాము ఎలాంటి తప్పు చేయలే దని, తమకు నార్కో ఎనాలిసిస్ పరీక్షలు నిర్వహించాలని కఠువా కేసులోని 8మంది నిందితులు కఠువా డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు జడ్జికి విజ్ఞప్తి చేశారు. విచారణ నిమిత్తం సోమవారం వారిని పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. నిందితుల తరఫు న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు.. చార్జిషీట్ కాపీలు సమర్పిం చాలని పోలీసుల్ని జడ్జి ఆదేశించారు. అనంతరం విచారణను ఏప్రిల్ 28కు వాయిదావేశారు. మరోవైపు విచారణ జరుగుతుండగా.. ప్రధాన నిందితుడు సంజీరామ్ కుమార్తె మధు శర్మ సీబీఐ దర్యాప్తు కోరుతూ కోర్టు బయట ఆందోళన నిర్వహించింది. -
మరిన్ని కేసుల్లో కార్తీ పాత్ర!
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టై సీబీఐ రిమాండ్‌లో ఉన్న మాజీ కేంద్ర మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకోనుంది. సీబీఐ, ఈడీ అధికారులు చెబుతున్న ప్రకారం ఐఎన్ఎక్స్ మీడియా కేసుతోపాటు మరిన్ని కేసుల్లో కార్తీ పాత్రపై స్పష్టమైన ఆధారాలు లభించాయి. దీంతో జూనియర్ చిదంబరంపై మరికొన్ని కేసులు నమోదు చేసేందుకు ఈ రెండు విచారణ సంస్థలు సిద్ధమవుతున్నాయి. యూపీఏ హయాంలో భారతదేశంలోని పలు కంపెనీలకు విదేశీ పెట్టుబడులకు అనుమతులు వచ్చేలా చేసేందుకు కార్తీ చక్రం తిప్పారని.. ఇందుకోసం భారీమొత్తంలో డబ్బులు తీసుకున్నారని ఈడీ వెల్లడించింది. దీనికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలున్నాయని స్పష్టం చేసింది. కార్తీకి చెందిన అడ్వాంటేజ్ స్ట్రాటెజిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏఎస్‌సీపీఎల్) సంస్థ పేరుతోనే ఈ లావాదేవీలు జరిగినట్లు తెలిపింది. రెండు కంపెనీలు ఇలా అనుమతులు పొందిన ఆధారాలున్నాయని.. మిగిలిన వివరాలు సంపాదిస్తామని ఈడీ అధికారులు తెలిపారు. కార్తీ కంపెనీ రంగంలోకి దిగగానే అన్ని అనుమతులు చకచకా వచ్చేశాయని గుర్తుచేశారు. అయితే కార్తీ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ మాత్రం ఈ విషయం ఇంతవరకు తన దృష్టికి రాలేదన్నారు. తొలిరోజు విచారణలో.. తమ కస్టడీలో ఉన్న కార్తీపై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఐదురోజుల రిమాండ్‌కు కోర్టు అనుమతిచ్చిన నేపథ్యంలో తొలిరోజైన శుక్రవారం ఉదయం 8 గంటలనుంచే విచారణ మొదలుపెట్టింది. ఐఎన్ఎక్స్ మీడియాతో పాటు పలు ఇతర కేసుల్లో కార్తీ పాత్రపై ప్రశ్నలు సంధించింది. దీంతోపాటు ఇటీవలి విదేశీ పర్యటనలో ఈ కేసులకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారనే అంశంపైనా గుచ్చిగుచ్చి ప్రశ్నించినట్లు తెలిసింది. శుక్రవారం గంటసేపు కార్తీ తన న్యాయవాదితో మాట్లాడేందుకు సీబీఐ అవకాశమిచ్చింది. కార్తీ సహకరించట్లేదు: సీబీఐ కస్టడీలో ఉన్న కార్తీ విచారణకు సహకరించటం లేదని ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నాడని సీబీఐ అధికారులు చెబుతున్నారు. విచారణ ప్రారంభమైనప్పటినుంచీ.. అసలు విషయాలను పక్కనపెట్టి అనవసర అంశాలతో సమయాన్ని వ్యర్థం చేస్తున్నాడన్నారు. స్విగ్గీ, జొమాటోల ద్వారా తనకు భోజనం ఆర్డర్ చేయాలని పట్టుబడుతున్నారన్నారు. చెన్నై ఎయిర్‌పోర్టులో అరెస్టయినప్పటినుంచీ కార్తీ ఇలాగే వ్యవహరిస్తున్నారని.. ఎకానమీ క్లాస్‌లో ఎక్కనని, తనకు బిజినెస్ క్లాస్‌లో టికెట్ బుక్ చేయాలని పట్టుబట్టాడని వెల్లడించారు. కోర్టు కస్టడీకి ఇవ్వగానే తనకు ఇంట్లో వండిన భోజనమే కావాలని డిమాండ్ చేశాడన్నారు. బంగారు చైన్, ఉంగరం తీసేయాలని చెప్పగా.. మతవిశ్వాసమని చెప్పి నిరాకరించాడన్నారు. కోర్టులో ఉండగా తన మిత్రుడితో కార్తీ తమిళంలో మాట్లాడారు. ఇంగ్లీష్‌లో మాట్లాడాలని సీబీఐ అధికారులు కోరగా.. ‘అలాగైతే.. నేను ఉన్నప్పుడు మీరు కూడా ఇంగ్లీష్‌లోనే మాట్లాడుకోండి’ అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో ‘మీరు కస్టడీలో ఉన్నారు. మేము కాద’ని అధికారులు ఘాటుగా సమాధానమిచ్చినట్లు తెలిసింది. -
‘ఎస్ఎస్సీ స్కామ్‌పై విచారణకు డిమాండ్’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ ఉద్యోగాల కోసం స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) నిర్వహించిన పరీక్షలో కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై సీబీఐచే విచారణ జరిపించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఎస్ఎస్సీ ఎగ్జామ్ కుంభకోణంపై సీబీఐ విచారణను పలువురు అభ్యర్ధులు డిమాండ్ చేస్తున్నారని..ఇది వారి భవిష్యత్‌కు సంబంధించిన అంశమని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఉద్యోగార్థుల డిమాండ్‌కు తలొగ్గి కేంద్ర ప్రభుత్వం తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలని సీఎం ట్వీట్ చేశారు. కాగా, ఫిబ్రవరిలో నిర్వహించిన ఎస్ఎస్సీ ఎగ్జామ్‌లో ప్రశ్నాపత్రం ముందుగానే లీకైందని అభ్యర్ధులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలతో వారు సెలక్షన్ కమిటీ సభ్యులను కలిసి సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
‘గౌరీ హత్యను లక్ష గొంతులు ప్రశ్నించాయి’
సాక్షి, బెంగళూరు: ‘ఎవరైనా మరణిస్తే శ్రద్ధాంజలి ఘటించి వదిలేస్తాం. కానీ గౌరి లంకేశ్ హత్యకు గురైతే.. ఆ దారుణాన్ని లక్ష గొంతులు ప్రశ్నించాయి’ అని ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ అన్నారు. ప్రముఖ జర్నలిస్టు గౌరి లంకేశ్ 56వ జయంతి సందర్భంగా సోమవారం జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు ‘గౌరి డే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ.. ‘రోహిత్ వేముల మరణం, గౌరి లంకేశ్ హత్యను నిరసిస్తూ అనేక మంది రోడ్లపైకి వచ్చారు. దేశంలో జరుగుతున్న దౌర్జన్యాన్ని ప్రశ్నిస్తున్నారు’ అని తెలిపారు. గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ, విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ మాట్లాడుతూ.. లంకేశ్ హత్యకు కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలన్నారు. కేసులో సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టును ఆశ్రయిస్తానని గౌరీ సోదరుడు ఇంద్రజిత్ వెల్లడించారు. -
అశ్లీల సీడీలపై సీబీఐ విచారణకు సిఫార్స్
సాక్షి,రాయ్‌పూర్: రాష్ట్ర మంత్రిపై ఆరోపణలు వచ్చిన అశ్లీల సీడీ వివాదంపై సీబీఐ విచారణకు చత్తీస్ఘడ్ ప్రభుత్వం సిఫార్సు చేసింది. ముఖ్యమంత్రి రమణ్ సింగ్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రెవెన్యూ మంత్రి ప్రేమ్ ప్రకాష్ పాండే వెల్లడించారు. ఈ వీడియో వివాదంపై చర్చించిన అనంతరం సీబీఐ విచారణకు రికమెండ్ చేసినట్టు మంత్రి తెలిపారు. నకిలీ సీడీ ద్వారా మంత్రిని ఇరికించేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని ఆరోపించారు. సీడీని ట్యాంపరింగ్ చేశారని స్థానిక టీవీ ఛానెల్ తన నివేదికలో స్పష్టం చేసిందని చెప్పారు. ఈ అంశం రాజకీయంగా సున్నితమైనది కావడం, నేరపూరిత కుట్రలో భాగంగా ఉండటంతో సీబీఐచే దర్యాప్తు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. సీబీఐ విచారణకు సహకరించేలా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి రాజేష్ మునోత్ పదవి నుంచి వైదొలుగుతారా అని ప్రశ్నించగా రాష్ట్ర మంత్రి సీబీఐ విచారణను ఎలా ప్రభావితం చేయగలరని ప్రశ్నించారు. సెక్స్ సీడీకి సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ వినోద్ వర్మను చత్తీస్ఘడ్ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. వర్మ నివాసంలో 500 అశ్లీల సీడీలు, రూ 2 లక్షల నగదు, ఓ పెన్‌డ్రైవ్, డైరీని స్వాధీనం చేసుకున్నామని రాయ్‌పూర్ ఎస్పీ సంజీవ్ శుక్లా చెప్పారు. అశ్లీల సీడీల వ్యవహారం బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పెను వివాదం సృష్టించడంతో చత్తీస్‌ఘడ్‌లో రాజకీయ దుమారం చెలరేగింది. -
‘అమ్మ’ చర్చే
దివంగత సీఎం జయలలిత మరణం మిస్టరీకి బలాన్ని చేకూర్చే రీతిలో మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అమ్మ మరణంపై రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక, త్వరితగతిన విచారణకు ఆదేశించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. డీఎంకే అయితే, సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేసింది. సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంల మీద సైతం అనుమానాలు వ్యక్తం అవుతూ చర్చ జోరందుకోవడంతో పాలకులు ఇరకాటంలో పడే ప్రమాదం వచ్చింది. జయలలిత మేనకోడలు దీప కోర్టును ఆశ్రయించేందుకు నిర్ణయించారు. సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి జయలలిత మరణంలో మిస్టరీ ఉందనే ఆరోపణలకు బలం చేకూరే రీతిలో ఒక్కో నిజాలు తాజాగా బయటకు వస్తున్నాయి. అటవీ శాఖ మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ ఒక అడుగు ముందుకు వేసి అనుమానాలకు బలం చేకూర్చే విధంగా చేసిన వ్యాఖ్యలు దుమారా న్ని రేపుతున్నాయి. జయలలిత ఆరోగ్యం గురించి బయటకు చెప్పిందంతా అమ్మ మీదొట్టు.. అంతా అబద్ధం అని ఆయన స్పందించడం చర్చకు దారితీసింది. అమ్మ మరణంలో మిస్టరీ ఉందన్న విషయం తేటతెల్లం అవుతోందని సర్వత్రా వ్యాఖ్యానిస్తున్నారు. అన్నీ కప్పి పుచ్చి, ఇప్పుడు నోరు మెదుపుతున్న పాలకుల మీద అగ్గి మీద గుగ్గిలంలా మండిపడే వాళ్లు కొందరు అయితే, చిన్నమ్మ శశికళ సహా మంత్రులందరినీ విచారణ వలయంలోకి తీసుకొచ్చి కఠినంగా శిక్షించాల్సిందేనని మరికొందరు నినదిస్తున్నారు. ఇక, ప్రతిపక్షాలు అయితే, విచారణ కమిషన్‌ను ప్రకటించి, న్యాయమూర్తి నియామకంలో జాప్యం ఏమిటంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఆస్పత్రిలోని సీసీ కెమెరాల పుటేజీని బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. కొన్ని పార్టీలు ప్రత్యేక విచారణకు, మరికొన్ని సీబీఐ విచారణకు పట్టుబడుతున్నాయి. జయలలిత మేనకోడలు, ఎంజీఆర్ అమ్మ దీప పేరవై కార్యదర్శి దీప మాట్లాడుతూ ఎన్నిరోజులు దాచి పెట్టి్టనా వాస్తవాలన్నీ బయటికొస్తాయని వ్యాఖ్యానించారు. సీబీఐ విచారణకు పట్టు డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, ఎవరినీ అమ్మ జయలలితను చూడడానికి అనుమతించలేదని మంత్రి వ్యాఖ్యానించి ఉన్నారని గుర్తుచేశారు. అలాంటప్పుడు ఉప ఎన్నికల్లో అభ్యర్థుల బీ ఫాంలో వేలి ముద్రలు వేసిందెవరు, వేయించుకు వచ్చిందెవరు..? అని ప్రశ్నించారు. ఇప్పటికే పలు రకాల అనుమానాలు జయలలిత మరణం మీద సాగుతున్నాయని వివరిస్తూ, ఇన్నాళ్లు నోరు మెదపని వాళ్లు, ఇప్పుడెందుకు ముందుకు వస్తున్నారని ప్రశ్నించారు. విచారణ కమిషన్ అని ప్రకటించిన సీఎం, డిప్యూటీ సీఎంలు, ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. అమ్మ మరణంలో మిస్టరీ ఛేదింపునకు ధర్మయుద్ధం అని వ్యాఖ్యానించిన డిప్యూటీ, ఇప్పుడు ఎలాంటి సమాధానం ప్రజలకు ఇస్తారో వేచి చూడాల్సి ఉందని విమర్శించారు. ఆయన చేసింది ధర్మయుద్ధం కాదని, నమ్మక ద్రోహం అని ఆగ్రహం వ్యక్తంచేశారు. జయలలిత ఆస్పత్రిలో ఉన్న సమయంలో పళని, పన్నీరు సైతం అక్కడే ఉన్నారని గుర్తుచేస్తూ, విచారణకు ఆదేశిస్తే, ఎక్కడ తాము ఇరకాటంలో పడుతామేమోనన్న భయంతోనే జాప్యం చేస్తున్నట్టుందని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచనున్నామన్నారు. దిండుగల్ స్పందన స్టాలిన్ వ్యాఖ్యలపై దిండుగల్ శ్రీనివాసన్ స్పందించారు. ఆయన డిమాండ్ చేయడంలో తప్పేమి లేదని వ్యాఖ్యానించారు. విచారణ కమిషన్‌కు తగ్గ కార్యాచరణ సాగుతోందని పేర్కొంటూ, శశికళ, అండ్ కుటుంబం నిర్బంధం వల్లే ఆస్పత్రి వ్యవహారాలపై అబద్ధాలు చెప్పాల్సి వచ్చిందని తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. సీసీ కెమెరాల్లోని దృశ్యాలను మార్చలేంగా, అందులోనే వాస్తవాలు బయటకువస్తాయని వ్యాఖ్యానించారు. మంత్రి కడంబూరు రాజు పేర్కొంటూ, విచారణ కమిషన్ ఏర్పాటుకు చర్యలు సాగుతున్నాయని వ్యాఖ్యానించారు. అన్నీ ఒకే సారి చేయలేమని, ఒక్కొక్కటిగా చేస్తూ వెళ్తున్నట్టు వివరించారు. తొలుత పోయెస్ గార్డెన్‌ను స్మారక మందిరంగా మార్చే పనులు, తదుపరి రూ. 15 కోట్లతో అమ్మ సమాధి వద్ద మణి మండపం పనుల మీద దృష్టి పెట్టి ఉన్నట్టు తెలిపారు. మంత్రి బెంజిమిన్ పేర్కొంటూ, జయలలిత ఆత్మ ఏ ఒక్కర్నీ వదలి పెట్టదని, అందర్నీ శిక్షించి తీరుతుందని వ్యాఖ్యానించడం గమనార్హం. కోర్టుకు దీప కాలం గడిచిన అనంతరం ఇప్పుడు మంత్రులు ఒకొక్కటిగా బయట పెడుతున్నారని జయలలిత మేన కోడలు వ్యాఖ్యానించారు. ఇంకా మరెన్ని రోజులు వాస్తవాలను దాచి పెడుతారో చూస్తానని, అన్నీ బయటకు వస్తాయని పేర్కొన్నారు. మేనత్త మరణంలో ఉన్న మిస్టరీ త్వరితగతిన బయటకు వచ్చే విధంగా కోర్టును ఆశ్రయించనున్నట్టు తెలిపారు. ఇక, పీఎంకే అధినేత రాందాసు పేర్కొంటూ, జయలలిత మరణంలో వెయ్యి అనుమానాలున్నాయని, ఇప్పుడు అందులో కొన్ని బయటకు వస్తున్న దృష్ట్యా, మిగిలినవన్నీ వెలుగులోకి రావాలంటే, త్వరితగతిన విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ పేర్కొంటూ, విచారణ కమిష న్ను ఏర్పాటుచేస్తే, దొంగల పనితనం అంతా బయట కు రావడం ఖాయం అని, అందుకే ఆ కమిషన్ ఏర్పాటులో జాప్యం సాగుతున్నట్టుందని అనుమానం వ్యక్తం చేశారు. నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ పేర్కొంటూ, అమ్మ మరణంతోనే నిజాలన్నీ పాతిపెట్టారని, ఇప్పుడు కొత్తగా ఎన్ని ప్రయత్నాల చేసినా ఫలితం శూన్యమేనని వ్యాఖ్యానించారు. జయలలిత మరణించినపుడే నిజం చనిపోయిందని, ఈ దృష్ట్యా, ఇక ఈ విషయంగా రాద్దాంతం అనసరం అని స్పందించారు. అన్నాడీఎంకే కున్నం ఎమ్మెల్యే రామచంద్రన్ పేర్కొంటూ, అమ్మ ఆరోగ్యం, ఆస్పత్రి, మరణం వరకు ఇద్దరికే అన్నీ తెలిసి ఉన్నాయని, ఆ ఇద్దరినీ విచారణ వలయంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇందులో ఒకరు శశికళ అని, మరొకరు అమ్మ వైద్యుడు శివకుమార్ అని పేర్కొంటూ, కనీసం శివకుమార్ అయినా, వివరాలను బయటపెట్టాలని విన్నవించారు. -
షీనాబోరా హత్యకేసులో మరో మలుపు!
-
షీనాబోరా హత్యకేసులో మరో మలుపు!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకేసు విచారణ బాధ్యతను సీబీఐకి అప్పగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత కమిషనర్ జావేద్ అహ్మద్ ఈ కేసు విచారణ బాధ్యతలు చేపట్టేందుకు సుముఖంగా లేకపోవడం, పాత కమిషనర్ రాకేష్ మారియాను దీన్నుంచి తప్పించాలని ప్రయత్నాలు జరగడం లాంటి పరిణామాల నేపథ్యంలో.. ఈ తలనొప్పి తమకెందుకని సర్కారు భావించినట్లు తెలుస్తోంది. షీనా బోరా హత్యకేసు గురించిన పూర్తి వివరాలను ఇవ్వాల్సిందిగా తాను డీజీపీని కోరారని, ఆయన నుంచి నివేదిక రాగానే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో కలిసి దీనిపై సమగ్రంగా చర్చించామని మహారాష్ట్ర హోం శాఖ కార్యదర్శి కేపీ బక్షీ తెలిపారు. ఈ హత్యకేసు దర్యాప్తు పూర్తి నిష్పక్షపాతంగా జరగాలని, స్థానిక పోలీసులు లేదా రాష్ట్ర ప్రభుత్వ అధికారుల జోక్యం ఏమాత్రం లేకుండా ఉండాలనే మహారాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. కన్నతల్లి ఇంద్రాణీ ముఖర్జీ చేతుల్లోనే షీనా బోరా హత్యకు గురైనట్లు కథనాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను చూస్తున్న ముంబై నగర పోలీసు కమిషనర్ రాకేష్ మారియాకు మధ్యలో పదోన్నతి కల్పించి ఆయనను వేరే పదవిలోకి బదిలీ చేయడం, ఆ తర్వాత ఏ పదవిలో ఉన్నా.. మారియానే కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తారని చెప్పడం లాంటి అనేక మలుపులు తిరిగాయి. చివరకు ఈ కేసు ఇప్పుడు సీబీఐ చేతికి వెళ్లింది.