షీనాబోరా హత్యకేసులో మరో మలుపు!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకేసు విచారణ బాధ్యతను సీబీఐకి అప్పగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత కమిషనర్ జావేద్ అహ్మద్ ఈ కేసు విచారణ బాధ్యతలు చేపట్టేందుకు సుముఖంగా లేకపోవడం, పాత కమిషనర్ రాకేష్ మారియాను దీన్నుంచి తప్పించాలని ప్రయత్నాలు జరగడం లాంటి పరిణామాల నేపథ్యంలో.. ఈ తలనొప్పి తమకెందుకని సర్కారు భావించినట్లు తెలుస్తోంది.
షీనా బోరా హత్యకేసు గురించిన పూర్తి వివరాలను ఇవ్వాల్సిందిగా తాను డీజీపీని కోరారని, ఆయన నుంచి నివేదిక రాగానే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్తో కలిసి దీనిపై సమగ్రంగా చర్చించామని మహారాష్ట్ర హోం శాఖ కార్యదర్శి కేపీ బక్షీ తెలిపారు. ఈ హత్యకేసు దర్యాప్తు పూర్తి నిష్పక్షపాతంగా జరగాలని, స్థానిక పోలీసులు లేదా రాష్ట్ర ప్రభుత్వ అధికారుల జోక్యం ఏమాత్రం లేకుండా ఉండాలనే మహారాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. కన్నతల్లి ఇంద్రాణీ ముఖర్జీ చేతుల్లోనే షీనా బోరా హత్యకు గురైనట్లు కథనాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను చూస్తున్న ముంబై నగర పోలీసు కమిషనర్ రాకేష్ మారియాకు మధ్యలో పదోన్నతి కల్పించి ఆయనను వేరే పదవిలోకి బదిలీ చేయడం, ఆ తర్వాత ఏ పదవిలో ఉన్నా.. మారియానే కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తారని చెప్పడం లాంటి అనేక మలుపులు తిరిగాయి. చివరకు ఈ కేసు ఇప్పుడు సీబీఐ చేతికి వెళ్లింది.