న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అరెస్టై సీబీఐ రిమాండ్‌లో ఉన్న మాజీ కేంద్ర మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకోనుంది. సీబీఐ, ఈడీ అధికారులు చెబుతున్న ప్రకారం ఐఎన్‌ఎక్స్ మీడియా కేసుతోపాటు మరిన్ని కేసుల్లో కార్తీ పాత్రపై స్పష్టమైన ఆధారాలు లభించాయి. దీంతో జూనియర్ చిదంబరంపై మరికొన్ని కేసులు నమోదు చేసేందుకు ఈ రెండు విచారణ సంస్థలు సిద్ధమవుతున్నాయి.
యూపీఏ హయాంలో భారతదేశంలోని పలు కంపెనీలకు విదేశీ పెట్టుబడులకు అనుమతులు వచ్చేలా చేసేందుకు కార్తీ చక్రం తిప్పారని.. ఇందుకోసం భారీమొత్తంలో డబ్బులు తీసుకున్నారని ఈడీ వెల్లడించింది. దీనికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలున్నాయని స్పష్టం చేసింది. కార్తీకి చెందిన అడ్వాంటేజ్ స్ట్రాటెజిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏఎస్‌సీపీఎల్) సంస్థ పేరుతోనే ఈ లావాదేవీలు జరిగినట్లు తెలిపింది. రెండు కంపెనీలు ఇలా అనుమతులు పొందిన ఆధారాలున్నాయని.. మిగిలిన వివరాలు సంపాదిస్తామని ఈడీ అధికారులు తెలిపారు. కార్తీ కంపెనీ రంగంలోకి దిగగానే అన్ని అనుమతులు చకచకా వచ్చేశాయని గుర్తుచేశారు. అయితే కార్తీ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ మాత్రం ఈ విషయం ఇంతవరకు తన దృష్టికి రాలేదన్నారు.
తొలిరోజు విచారణలో..
తమ కస్టడీలో ఉన్న కార్తీపై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఐదురోజుల రిమాండ్‌కు కోర్టు అనుమతిచ్చిన నేపథ్యంలో తొలిరోజైన శుక్రవారం ఉదయం 8 గంటలనుంచే విచారణ మొదలుపెట్టింది. ఐఎన్‌ఎక్స్ మీడియాతో పాటు పలు ఇతర కేసుల్లో కార్తీ పాత్రపై ప్రశ్నలు సంధించింది. దీంతోపాటు ఇటీవలి విదేశీ పర్యటనలో ఈ కేసులకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారనే అంశంపైనా గుచ్చిగుచ్చి ప్రశ్నించినట్లు తెలిసింది. శుక్రవారం గంటసేపు కార్తీ తన న్యాయవాదితో మాట్లాడేందుకు సీబీఐ అవకాశమిచ్చింది.
కార్తీ సహకరించట్లేదు: సీబీఐ
కస్టడీలో ఉన్న కార్తీ విచారణకు సహకరించటం లేదని ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నాడని సీబీఐ అధికారులు చెబుతున్నారు. విచారణ ప్రారంభమైనప్పటినుంచీ.. అసలు విషయాలను పక్కనపెట్టి అనవసర అంశాలతో సమయాన్ని వ్యర్థం చేస్తున్నాడన్నారు. స్విగ్గీ, జొమాటోల ద్వారా తనకు భోజనం ఆర్డర్ చేయాలని పట్టుబడుతున్నారన్నారు. చెన్నై ఎయిర్‌పోర్టులో అరెస్టయినప్పటినుంచీ కార్తీ ఇలాగే వ్యవహరిస్తున్నారని.. ఎకానమీ క్లాస్‌లో ఎక్కనని, తనకు బిజినెస్ క్లాస్‌లో టికెట్ బుక్ చేయాలని పట్టుబట్టాడని వెల్లడించారు.
కోర్టు కస్టడీకి ఇవ్వగానే తనకు ఇంట్లో వండిన భోజనమే కావాలని డిమాండ్ చేశాడన్నారు. బంగారు చైన్, ఉంగరం తీసేయాలని చెప్పగా.. మతవిశ్వాసమని చెప్పి నిరాకరించాడన్నారు. కోర్టులో ఉండగా తన మిత్రుడితో కార్తీ తమిళంలో మాట్లాడారు. ఇంగ్లీష్‌లో మాట్లాడాలని సీబీఐ అధికారులు కోరగా.. ‘అలాగైతే.. నేను ఉన్నప్పుడు మీరు కూడా ఇంగ్లీష్‌లోనే మాట్లాడుకోండి’ అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో ‘మీరు కస్టడీలో ఉన్నారు. మేము కాద’ని అధికారులు ఘాటుగా సమాధానమిచ్చినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment