దివంగత నటుడు, పత్రికా సంపాదకులు చో రామస్వామి కారణంగా తాను పోయెస్ గార్డెన్‌కు దూరంగా కొంత కాలం గడపాల్సి వచ్చిందని ప్రమాణ పత్రంలో చిన్నమ్మ శశికళ వివరించారు. అక్క జయలలిత చెప్పినట్టే నడుచుకున్నానని, తానెప్పుడూ ఏ విషయాల్లోనూ జోక్యం చేసుకోలేదని స్పష్టంచేశారు. విచారణ కమిషన్‌కు సమర్పించిన ప్రమాణ పత్రంలోని కొన్ని వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
సాక్షి, చెన్నై : దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం మిస్టరీని నిగ్గు తేల్చేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి కమిషన్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ విచారణకు శశికళ స్వయంగా రాలేని పరిస్థితి. ఆమె పరప్పన అగ్రహార చెరలో అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తుండడమే ఇందుకు కారణం. తన న్యాయమూర్తి రాజ చెందూర్ పాండియన్ ద్వారా వాంగ్మూలాన్ని ప్రమాణ పత్రం రూపంలో ఆమె కమిషన్‌కు సమర్పించి ఉన్నారు. ఆమె నివేదించిన అంశాలు ఇప్పటికే అధికారంలో ఉన్న అన్నాడీఎంకే మంత్రుల్లో గుబులు రేకెత్తించాయి. జయలలితకు జ్వరం వచ్చిన రోజు నుంచి ఆస్పత్రిలో సాగిన చికిత్స, మరణం వరకు శశికళ ప్రమాణ పత్రంలో వివరించారు.
అలాగే, ఎవరెవరు జయలలితను పరామర్శించారో తదితర వివరాలను కమిషన్ ముందుంచారు. ప్రస్తుతం శశికళ తరఫున న్యాయవాది రాజ చెందూర్ పాండియన్ విచారణకు హాజరయ్యే వారిని క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో శశికళను పోయెస్ గార్డెన్ నుంచి జయలలిత గతంలో గెంటి వేయడానికి గల కారణాలు సైతం ప్రమాణ పత్రంలో పొందుపరిచి ఉండడం వెలుగులోకి వచ్చింది.
2011లో ప్రకంపనలు
2011 అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయంతో జయలలిత సీఎం పగ్గాలు చేపట్టిన కొన్ని నెలల్లో పోయెస్ గార్డెన్‌లో ప్రకంపన బయలు దేరింది. శశికళను గార్డెన్ నుంచి బయటకు సాగనంపడమే కాదు, ఆమె కుటుంబీకుల మీద కేసుల మోత మోగడం అప్పట్లో చర్చకు దారి తీసింది. జయలలితకు వ్యతిరేకంగా శశికళ కుటుంబం వ్యవహరించడంతోనే ఈ గెంటివేత అన్న చర్చ సాగింది. కొన్నాళ్లకు మళ్లీ శశికళ గార్డెన్ మెట్లు ఎక్కడం ట్విస్టుగా మారింది.
అయితే, ఈ తతంగం వెనుక కారణాలేమిటో అనేది ప్రశ్నగానే మిగిలింది. దీనికి సమాధానం ఇచ్చే రీతిలో శశికళ తన ప్రమాణ పత్రంలో పేర్కొని ఉండడం గమనార్హం. 2011లో మళ్లీ అన్నాడీఎంకే అధికారంలోకి రాగానే, ఓ రోజున అక్క జయలలిత తనను పిలిచి ఇక్కడ ఉండొద్దు.. టీ నగర్‌లోని ఇంటికి వెళ్లి పో.. అని సూచించారని తెలిపారు. అక్క ఆజ్ఞను శిరసా వహించి గార్డెన్ నుంచి బయటకు వచ్చామన్నారు. ఈ హఠాత్ నిర్ణయంతో తొలుత తాను అయోమయంలో పడ్డానని ఆవేదన వ్యక్తంచేశారు.
అయితే, అక్క భరోసా ఇచ్చి మరీ పంపినట్టు పేర్కొన్నారు. తాను గార్డెన్ నుంచి బయటకు రావడంలో తుగ్లక్ పత్రిక సంపాదకులుగా ఉన్న నటుడు చో రామస్వామి కీలక భూమిక పోషించినట్టు వివరించారు. తనకు వ్యతిరేకంగా ఏదో జరుగుతోందనే సమాచారం ఆ సమయంలో జయలలితను షాక్‌కు గురి చేసిందన్నారు. ఈ విషయంపై సమగ్రంగా ఆరా తీసిన చో రామస్వామి అన్ని వివరాలను అక్క దృష్టికి తీసుకు వచ్చినట్టు తెలిపారు. దానిపై రహస్య విచారణ సైతం సాగినట్టు పేర్కొన్నారు. .
అక్క చెప్పినట్టే..
ఆ సమయంలో అక్క(జయలలిత) చెప్పినట్టే తాను విన్నానని పేర్కొన్నారు. తన కుటుంబీకులందరినీ సాగనంపిన అనంతరం ఓ రోజున అక్కే తనకు సమాచారం పంపించారని పేర్కొన్నారు. ‘నీ మీద ఏ తప్పు లేదు.. ఇక, వచ్చేయి..’ అని అక్క పిలవడంతో గార్డెన్‌లోకి మళ్లీ వచ్చానన్నారు. ఈ సమయంలో చో రామస్వామి మరో ఆలోచన ఇచ్చారన్నారు. ఆయన ఆలోచన మేరకు తాను జయలలితకు ఓ లేఖను రాశానని తెలిపారు. ‘నేను ఏ తప్పూ చేయలేదు, రాజకీయం వ్యవహారాల్లో జోక్యం చేసుకోను, నా కుటుంబంతో సంబంధాలు కల్గి ఉండను.. నీ (జయలలిత)సంక్షేమమే ముఖ్యం’ అని ఆ లేఖలో వివరించి గార్డెన్‌లో చేరినట్టు పేర్కొన్నారు.
తాను ఎప్పుడూ అన్నాడీఎంకే వ్యవహారాల్లో గానీ, అధికార విషయాల్లో గానీ జోక్యం చేసుకోవడం లేదన్న విషయం అక్కకు తెలుసు అని తెలిపారు. అయితే, కొన్ని సందర్భాల్లో అక్క ఆజ్ఞ మేరకు అనేక వివరాలను , ఇచ్చే సూచనల్ని, ఆదేశాలను ద్వితీయ శ్రేణి నేతల దృష్టికి తాను తీసుకెళ్లాని తెలిపారు. ఆ పయనం సాగిస్తూ ఉన్న సమయంలో సెప్టెంబరు 19న జయలలిత జ్వరం బారిన పడటం, ఆ తదుపరి వివరాలను ఆమె ప్రమాణ పత్రంలో వివరించి ఉండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment