
ఎయిర్ టెల్ చేతికి వీడియోకాన్ స్పెక్ట్రం
6 సర్కిళ్లలో కొనుగోలు డీల్ విలువ రూ. 4,428
న్యూఢిల్లీ: వీడియోకాన్ టెలికమ్యూనికేషన్స్‌కి(వీటీఎల్) 6 సర్కిళ్లలో ఉన్న 1800 మెగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రంను భారతీ ఎయిర్‌టెల్ కొనుగోలు చేయనుంది. ఇందుకోసం రూ. 4,428 కోట్లు వెచ్చించనుంది. దీనికి సంబంధించి వీటీఎల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎయిర్‌టెల్ తెలిపింది. బీహార్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్ (ఈస్ట్), ఉత్తర్‌ప్రదేశ్ (వెస్ట్), గుజరాత్ సర్కిళ్లు ఈ జాబితాలో ఉన్నాయి. స్పెక్ట్రం కాలావధి 2032 డిసెంబర్ 18 దాకా ఉంది. డీల్‌కు సంబంధించి ఎయిర్‌టెల్ రూ. 642 కోట్లు సేవా పన్ను కింద ప్రభుత్వానికి చెల్లించనుంది.
తాజా స్పెక్ట్రం కొనుగోలుతో ఎయిర్‌టెల్ 4జీ సర్వీసులు ప్రస్తుత మున్న 15 సర్కిళ్ల నుంచి 19 సర్కిళ్లకు విస్తరిస్తాయి. పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో త్వరలో దేశవ్యాప్తంగా 4జీ సర్వీసులు ప్రారంభించనున్న నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. వాస్తవానికి గుజరాత్, యూపీ (వెస్ట్)సర్కిళ్లలో స్పెక్ట్రంను వీడియోకాన్ నుంచి కొనుగోలు చేసేందుకు ఐడియా సెల్యులార్ గత నవంబర్‌లో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం రూ. 3,310 కోట్లు చెల్లించేందుకు కూడా సిద్ధపడింది. అయితే, పలు కారణాల రీత్యా ఈ ఒప్పందాన్ని ఇరు కంపెనీలు ఇటీవలే రద్దు చేసుకున్నాయి.