ఎయిర్‌టెల్‌కు పెట్టుబడుల బూస్ట్‌.. | Bharti Airtel shares fly like rocket on $1.25 billion booster | Sakshi
Sakshi News home page

ఎయిర్‌టెల్‌కు పెట్టుబడుల బూస్ట్‌..

Published Thu, Oct 25 2018 12:50 AM | Last Updated on Thu, Oct 25 2018 8:17 AM

Bharti Airtel shares fly like rocket on $1.25 billion booster - Sakshi

న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌ ఆఫ్రికా విభాగంలో ఆరు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఇన్వెస్ట్‌ చేయనున్నాయి. వార్‌బర్గ్‌ పింకస్, టెమాసెక్, సింగ్‌టెల్, సాఫ్ట్‌బ్యాంక్‌ గ్రూప్‌ ఇంటర్నేషనల్‌ మొదలైన సంస్థలు సుమారు రూ.125 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు బ్రిటన్‌లో లిస్టయిన భారతి ఎయిర్‌టెల్‌ అనుబంధ సంస్థ వెల్లడించింది. పెట్టుబడుల అనంతరం ఎయిర్‌టెల్‌ ఆఫ్రికా ఐపీవోకి రానుందని, సమీకరించిన నిధులతో రుణభారం తగ్గించుకోనుందని పేర్కొంది. నెట్‌వర్క్‌ను పెంచుకోవడానికి, వివిధ మార్కెట్లలో కార్యకలాపాలు మరింతగా విస్తరించటానికి ఈ పెట్టుబడులు ఉపయోగపడగలవని ఎయిర్‌టెల్‌ వివరించింది. ప్రతిపాదిత లావాదేవీలో ప్రస్తుత షేర్‌హోల్డర్ల వాటాల విక్రయమేమీ ఉండబోదని పేర్కొంది. తమ వ్యాపార వ్యూహాలపైనా, ఆఫ్రికా విభాగం లాభదాయకత అవకాశాలపైనా అంతర్జాతీయ దిగ్గజాలకు ఉన్న నమ్మకానికి ఈ డీల్‌ నిదర్శనమని భారతి ఎయిర్‌టెల్‌ ఆఫ్రికా విభాగం ఎండీ, సీఈవో రఘునాథ్‌ మండవ తెలిపారు. ఎయిర్‌టెల్‌ ఆఫ్రికా విభాగం కొన్నాళ్ల క్రితమే టర్న్‌ అరౌండ్‌ అయ్యింది. గత కొన్ని త్రైమాసికాలుగా భారత్‌లో టారిఫ్‌ల పరంగా తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న ఎయిర్‌టెల్‌కు కొంత ఊతంగా నిలుస్తోంది. ఎయిర్‌టెల్‌ ఆఫ్రికా రుణభారం దాదాపు 5 బిలియన్‌ డాలర్ల మేర ఉంది. 

షేరు జూమ్‌..: ఆఫ్రికా విభాగంలో పెట్టుబడుల వార్తలతో బుధవారం దేశీ స్టాక్‌ ఎక్సే్చంజీల్లో భారతి ఎయిర్‌టెల్‌ షేరు దాదాపు 11 శాతం ఎగిసింది. మార్కెట్‌ విలువ సుమారు రూ.12,332 కోట్ల మేర పెరిగింది. బీఎస్‌ఈలో ఎయిర్‌టెల్‌ షేరు 10.79 శాతం పెరిగి రూ. 316.75 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో ఏకంగా 15 శాతం కూడా ఎగిసి రూ. 328.75 స్థాయిని తాకింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో అత్యధికంగా లాభపడిన షేరు ఇదే. అటు ఎన్‌ఎస్‌ఈలో 9 శాతం పెరిగి రూ. 311.55 వద్ద క్లోజయ్యింది. బీఎస్‌ఈలో 5.19 లక్షలు, ఎన్‌ఎస్‌ఈలో 1 కోటి పైగా షేర్లు చేతులు మారాయి. కంపెనీ మార్కెట్‌ విలువ రూ. 1,26,617.65 కోట్లకు పెరిగింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement