
పరుగులు మీద పరుగులుపెడుతూ దూసుకుపోతున్న క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ బబుల్ బ్లాస్ట్ అయింది. నిపుణులు, వివిధ దేశాల కేంద్ర బ్యాంకుల హెచ్చరికలకు అనుగుణంగానే సరికొత్త గరిష్టాన్ని నమోదు చేసిన అనంతరం భారీ పతనాన్ని నమోదు చేసింది. ఆసియన్ ట్రేడింగ్‌లో శుక్రవారం రూ.19వేల డాలర్ల వద్ద ఆల్ టైం హైని తాకింది. వెంటనే 12శాతానికి పైగా నష్టపోయింది. భారీ కొనుగోళ్లతో రూ.19వేల డాలర్లను అధిగమించిన తరువాత రూ.15వేల డాలర్ల దిగువకు పడిపోయింది. ఇటీవల భారీగా పుంజుకున్న వార్తల్లో నిలిచిన బిట్‌కాయిన్ ఈ వారంలో 30శాతానికి ర్యాలీ అయింది.
కాగా క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్... రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ దూసుకుపోతోంది. దీంతో ఈ అనూహ్య ర్యాలీపై పలువురు మార్కెట్ నిపుణులు, ట్రేడ్ పండితులు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. బిట్ కాయిన్ ట్రేడింగ్‌లో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా హెచ్చరించింది. సాఫ్ట్‌వేర్ కోడ్ రూపంలో ఉండే ఈ వర్చువల్ కరెన్సీ.. ఏ నియంత్రణ సంస్థ పరిధిలోనూ లేదని, దీంతో ఇన్వెస్టర్లు లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలని లేదంటే భారీ నష్టం తప్పదని తెలిపింది.