సాక్షి, న్యూఢిల్లీ : ఈక్విటీ మార్కెట్లలో షేర్ల అమ్మకాలతో ఆర్జించే లాభాలపై విధించే దీర్ఘకాల మూలధన లాభాల పన్నును రద్దు చేయాలనే డిమాండ్ల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ లాభాలపై పన్ను నిబంధనలను సవరించాలని బీజేపీ సీనియర్ నేత కోరారు. పెట్టుబడులు ఊపందుకునే చర్యలను బడ్జెట్‌లో ప్రకటించాలని ఆర్థిక మంత్రి, ప్రధాని కార్యాలయ అధికారులతో నిర్వహించిన ప్రీ బడ్జెట్ సంప్రదింపుల్లో బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, డివిడెండ్ డిస్ర్టిబ్యూషన్ ట్యాక్స్‌పై పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని, ఈ అవాంతరాలతో పలు ఆర్థిక లావాదేవీలు భారత్ నుంచి సింగపూర్, హాంకాంగ్, లండన్‌లకు తరలిపోతున్నాయని బీజేపీ ఆర్థిక వ్యవహారాల విభాగం ప్రతినిధి గోపాల్ కృష్ణ అగర్వాల్ చెప్పారు.
పరిశ్రమ, మార్కెట్ వర్గాలు కోరుతున్నట్టు లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్‌ను రద్దు చేయడం లేదా షేర్లను కలిగిఉండే వ్యవధిని ఏడాది నుంచి రెండేళ్లకు పెంచాలని ఆయన కోరారు. ఈక్విటీ షేర్ల అమ్మకాలపై 14 ఏళ్ల తర్వాత అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2018లో పది శాతం క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌ను ప్రవేశపెట్టారు. ఈ నిబంధన స్టాక్ మార్కెట్‌లో నిధుల ప్రవాహానికి, విదేశీ పెట్టుబడులకు తీవ్ర అవరోధంగా మారిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. డివిడెండ్ డిస్ర్టిబ్యూషన్ ట్యాక్స్‌పైనా ఇన్వెస్టర్లు, మదుపుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment