అక్రమ జువెల్లరీ అమ్మకాలకు జీఎస్టీ ఊతం
అక్రమ జువెల్లరీ అమ్మకాలకు జీఎస్టీ ఊతం
Published Tue, Jul 4 2017 1:19 PM | Last Updated on Thu, Aug 2 2018 4:08 PM
ముంబై : బంగారం అమ్మకాలపై పన్ను రేట్ల పెంపుపై ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఈ రేట్ల పెంపుతో అక్రమ ఆభరణాల అమ్మకానికి ఎక్కువగా దారితీసే అవకాశముందని ఇండస్ట్రి వర్గాలు చెబుతున్నాయి. జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా కొత్త పన్ను విధానం జీఎస్టీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో బంగారంపై జీఎస్టీ పన్ను రేట్లు కూడా అంతకముందు కంటే పెరిగాయి. ముందస్తు 1.2 శాతంగా ఉన్న బంగారంపై పన్ను రేట్లు, ప్రస్తుతం 3 శాతానికి ఎగిశాయి. దీంతో బ్లాక్ మార్కెట్ ఎక్కువగా విజృంభించే అవకాశముందని తెలుస్తోంది.
'' మూడు శాతం పన్ను చాలా ఎక్కువ. ఎలాంటి రశీదులు లేకుండా కొనుగోలుకు మేము సిద్ధం. జువెల్లర్‌కు ఎలాంటి సమస్య ఉండదు'' అని ఓ కొనుగోలదారుడు తన అభిప్రాయం వ్యక్తంచేశారు. దేశంలో అతిపెద్ద బులియన్ మార్కెట్ ముంబైలోని జవేరి బజార్‌కు చెందిన ఈ కొనుగోలుదారుడు పేరు చెప్పడానికి నిరాకరించాడు. పన్ను రేట్లు పెరగడంతో చాలా దుకాణాలు రశీదులు లేకుండా విక్రయాలు చేపడతాయని జేజే గోల్డ్ హౌజ్ ప్రొప్రైటర్ హర్షద్ అజ్మేరి కూడా చెప్పారు. కేవలం 1 శాతం కొనుగోలుకే కొంతమంది కస్టమర్లు రశీదులు లేకుండా కొనుగోళ్లు చేపట్టేవారు, కానీ ప్రస్తుతం 3 శాతం జీఎస్టీతో చిన్న జువెల్లరీలు కచ్చితంగా అనధికారిక విక్రయాలు చేపడతారని అజ్మేరీ పేర్కొన్నారు. ఈ పన్ను రేట్లు పెంపు గోల్డ్ స్మగ్లింగ్‌కు ఎక్కువగా దారితీస్తుందన్నారు.
ప్రపంచవ్యాప్తంగా భారత్ రెండో అతిపెద్ద బంగారం వినియోగదారునిగా ఉంది. మెటల్స్‌పై దిగుమతి సుంకాలను 10 శాతానికి పెంచినప్పటి నుంచి గోల్డ్ స్మగ్లింగ్ ఎక్కువగా పెరిగింది. 2016లో 120 టన్నులకు పైగా బంగారం స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ల ద్వారా భారత్‌లోకి ప్రవేశించిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనావేసింది. ఇది ఇప్పుడు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. స్మగ్లింగ్ చేసే బంగారానికి జీఎస్టీ ప్రోత్సాహకంగా ఉందని, ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని తగ్గించి, స్మగ్లింగ్‌కు అవకాశం లేకుండా చేయాలని ముంబైకు చెందిన ఓ జువెల్లరీ సూచించారు. తక్కువ దిగుమతి సుంకం, అధికారిక దిగుమతులను ప్రోత్సహించి, చట్టపరమైన విక్రయాలకు దోహదం చేస్తుందని హోల్‌సేలర్ ఎంఎన్‌సీ బులియన్ డైరెక్టర్ దమన్ ప్రకాశ్ రాథోడ్ కూడా చెప్పారు. ఏడాదిలో అధికారికంగా జరిగే దిగుమతులు 800 టన్నులుంటున్నాయి.
Advertisement