సెంట్రల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ సబ్సిడరీని కొంటున్న బీఓబీ
ముంబై: రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల మధ్య ఒక సబ్సిడరీ చేతులు మారనుంది. సెంట్రల్ బ్యాంక్‌కు చెందిన హౌసింగ్ ఫైనాన్స్ సబ్సిడరీ సెంట్ బ్యాంక్ హోం ఫైనాన్స్ (సీబీహెచ్‌ఎఫ్‌ఎల్)ను కొనుగోలు చేసేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సీబీహెచ్‌ఎఫ్‌ఎల్‌లో సెంట్రల్ బ్యాంక్‌కు 64 శాతం వాటా వుంది. మిగిలిన వాటా హడ్కో, యూటీఐ, నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌ల వద్ద వుంది. చర్చలు తుదిదశలో వున్నాయని, సెంట్రల్ బ్యాంక్ తన వాటానంతటినీ విక్రయించడానికి అంగీకరించిందని ఆ వర్గాలు వెల్లడించాయి. అయితే సీబీహెచ్‌ఎఫ్‌ఎల్‌లో ఇతర షేర్‌హోల్డర్ల వాటాల్ని కొనుగోలు చేసేందుకు ఆయా సంస్థల్ని బ్యాంక్ ఆఫ్ బరోడా సంప్రదించిందీ, లేనిదీ తెలియరాలేదు.