బ్యాంక్ ఆఫ్ ఇండియా నష్టం రూ.3,587 కోట్లు
ముంబై: ప్రభుత్వం రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ)కు గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో నికర నష్టాలు భారీగా పెరిగాయి. 2014-15 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.56 కోట్లుగా ఉన్న నికర నష్టాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ.3,587 కోట్లకు పెరిగాయని బీఓఐ తెలిపింది. మొండి బకాయిలు బాగా పెరగడమే దీనికి కారణమని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.12,287 కోట్ల నుంచి రూ.11,385 కోట్లకు తగ్గింది. స్థూల మొండి బకాయిలు 5.39 శాతం (రూ.22,193 కోట్లు) నుంచి 13%కి (రూ.49,879 కోట్లకు), నికర మొండి బకాయిలు 3.36 శాతం(రూ.13,518 కోట్ల) నుంచి 7.79 శాతానికి(రూ.27,776 కోట్లకు) పెరిగాయని పేర్కొంది.
ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం. మొండి బకాయిలు, ఇతర అంశాలకు కేటాయింపులు భారీగా పెంచాల్సి వచ్చిందని వివరించింది. ఈ కేటాయింపులు రూ.2,255 కోట్ల నుంచి రూ.5,470 కోట్లకు పెరిగాయి. ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2014-15లో రూ.1,709 కోట్ల నికర లాభం రాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.6,089 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. మొత్తం ఆదాయం రూ.47,663 కోట్ల నుంచి రూ.45,449 కోట్లకు పడిపోయింది. భారీ నష్టాల కారణంగా డివిడెండ్‌ను ఇవ్వలేకుపోతున్నామని బ్యాంక్ పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఇంట్రాడేలో ఏడాది కనిష్ట స్థాయి(రూ.79)ని తాకిన ఈ షేర్ చివరకు స్వల్ప నష్టంతో రూ.80 వద్ద ముగిసింది.