సాక్షి,న్యూఢిల్లీ: చమురు ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. ఇరాన్ పై అమెరికా ఆంక్షల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్‌ధర నాలుగేళ్ల గరిష్టానికి చేరింది. లండన్ మార్కెట్లో తాజాగా బ్రెంట్ చమురు బ్యారల్ తాజాగా 83 డాలర్లనూ దాటేసింది. ఇదే విధంగా నైమెక్స్ చమురు సైతం 73 డాలర్లను అధిగమించింది. ప్రస్తుతం బ్రెంట్ బ్యారల్ 0.57 శాతం ఎగసి 83.21 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు బ్యారల్ 0.43 శాతం పెరిగి 73.56 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. నవంబరు 4 నుంచి ఇరాన్‌పై ఆంక్షలు అమలుకానున్న నేపథ్యంలోఆయిల్ ధరలకు 100 డాలర్ల చేరనుందనే అంచనా మరింత ఊపందుకుంది.
మరోవైపు డాలరుతో మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి సోమవారం క్షీణించింది. శుక్రవారం కొంతమేర బలపడినప్పటికీ ప్రస్తుతం 33 పైసలు నష్టంతో 72.82 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో దేశీయంగా పెట్రో ధరలు మరింత మండుతున్నాయి. ఇవి మరింత పెరిగే అవకాశమున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ చమురు మార్కెట్లోని పరిస్థితుల కారణంగా ఇప్పటికే ముంబైలో పెట్రోల్ లీటరు ధర రూ.91 ల మార్క్‌ను అధిగమించింది. అంతేకాదు ఈ చమురు సెగ ఏవియేషన్ కంపెనీలను మరింత బలంగా తాకనుంది. విమానయాన ఇంధన ఏటీఫ్ ధరలు మరింత పెరగనున్నాయనే అంచనాలతో ఏవియేషన్ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. స్పైస్‌జెట్ దాదాపు 5 శాతం, జెట్ ఎయిర్‌వేస్ దాదాపు 5 శాతం, ఇంటర్‌గ్లోబ్ 2 శాతం నష్టపోతున్నాయి. అటు హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ షేర్లు కూడా నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment