ప్రముఖ కంపెనీ సీవోవో ఆత్మహత్య
గూర్గావ్ : అంతర్జాతీయ కంపెనీ బ్రిటానికా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) వినీత్ వింగ్(49) తన సొసైటీ బిల్డింగ్ నుంచి దూకి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎన్ సైక్లోపేడియా బ్రిటానికా కంపెనీకి దక్షిణ ఆసియా డివిజన్ సీవోవోగా వినీత్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. సైబర్ సిటీలోని తన అపార్ట్ మెంట్ 19వ అంతస్తు నుంచి దూకి, వినీత్ ఆదివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. అతని జేబులో సూసైడ్ నోట్ ను పోలీసులు గుర్తించారు. తనకి జీవితంపై విసుగు పొందడం వల్లే, ఈ జీవితానికి ఇంతటితో ముగించాలను కుంటున్నానని సూసైడ్ నోట్ లో వినీత్ పేర్కొన్నాడు.
అపార్ట్ మెంట్ లోని డి-బ్లాక్ లో ఉండే వినీత్ , సీ-బ్లాక్ లోని 19వ అంతస్తు నుంచి అతను దూకినట్టు పోలీసులు చెప్పారు. అతని మృతదేహాన్నిఆదివారం ఉదయం 9గంటల ప్రాంతంలో చెత్త ఊడ్చే వారు గుర్తించారన్నారు. 19వ అంతస్తులో అతని చెప్పులు లభ్యం కావడంతో అక్కడినుంచే వినీత్ దూకి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన అనంతరం ఈ ఘటనపై పూర్తివివరాలు తెలియజేస్తామన్నారు మార్నింగ్ వాక్ కోసం వెళ్లారని, అప్పటినుంచి ఇంటికి తిరిగిరాలేదని కుటుంబసభ్యులు చెప్పినట్టు ఏసీపీ హవా సింగ్ తెలిపారు. డీఎల్ఎఫ్ బెల్వెడెరే పార్క్ లో అతని తండ్రి, భార్య, ఇద్దరు కొడుకులు, కూతురితో వినీత్ నివాసం ఉంటున్నాడు. వినీత్ మృతితో అతని తండ్రి గుండెపోటుకు గురై ఆసుపత్రి పాలయ్యాడు.
కాగా వినీత్ కు ఫోటో గ్రాఫింగ్ అంటే చాలా మక్కువ. వన్యప్రాణులు, సంగీతంపై ఫోటోలు తీయడానికి వినీత్ ఎక్కువ ఆసక్తి కనబరిచేవారు. జపాన్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా దేశాలకు ఆయన ట్రావెల్ చేశారు. అతని ఫోటో గ్రాఫ్ లు నేషనల్ జియోగ్రాఫిక్ ట్రావెల్ లో కూడా వచ్చాయి. "నేను వచ్చాను. నేను చూశాను. కొంచెం సేపు ఏడ్చిన అనంతరం కొంత సమయం నిద్రకు ఉపక్రమించాను" అని వినీత్ అన్ ఎర్త్ అనే అతని బ్లాగ్ లో ఇటీవల ఒక పోస్టు పెట్టాడు.