ఇన్వెస్టర్లూ.. పారాహుషార్!
న్యూఢిల్లీ: బీజేపీ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో అధికారాన్ని చేపడుతుందన్న అంచనాలతో స్టాక్ మార్కెట్ల సూచీలు కొత్త శిఖరాలకు ఎగిశాయి. అయితే, లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి కొనసాగుతున్నందున ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని పలు బ్రోకరేజీ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీకి 249 నుంచి 290 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. మొత్తం 543 సీట్లుండే లోక్‌సభలో సంపూర్ణ మెజారిటీ రావాలంటే 272 ఎంపీ స్థానాలను సాధించాలి. 2004, 2009 ఎన్నికల తుది ఫలితాల అంచనాల్లో నాటి ఒపీనియన్, ఎగ్జిట్ పోల్స్ విఫలమైన విషయాన్ని బ్రోకరేజీ సంస్థలు గుర్తు చేస్తున్నాయి. తాజా అంచనాలతో స్టాక్ మార్కెట్లు ఉవ్వెత్తున ఎగుస్తున్నప్పటికీ ఇన్వెస్టర్లు తమ జాగ్రత్తలో తాముండాలని క్రెడిట్ సూసీ, బార్ల్కేస్, యూబీఎస్, సిటీ గ్రూప్, నోమురా, కార్వీ సెక్యూరిటీస్, వెల్త్‌రేస్ వంటి బ్రోకరేజీ సంస్థలు హితవు పలుకుతున్నాయి.
ఆ తర్వాత భిన్నంగా స్పందించవచ్చు...
ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందనే అంచనాతో మార్కెట్లలో ర్యాలీ నెలకొందనీ, ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత మార్కెట్లు భిన్నంగా స్పందించవచ్చని కార్వీ రీసెర్చ్ రిపోర్టు పేర్కొంది. నెల క్రితం 30గా ఉన్న దేశ దుర్బల సూచీ (వీఐఎక్స్) ప్రస్తుతం 37.1 పాయింట్లకు చేరిందని యూబీఎస్ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. 2009 మేలో ఇది 56 పాయింట్ల రికార్డు స్థాయిని తాకిందని గుర్తుచేసింది. కొత్త ప్రభుత్వం విధాన నిర్ణయాలను సమర్థంగా అమలు చేయడంపైనే మార్కెట్ల స్థిరత్వం ఆధారపడి ఉంటుందని తెలిపింది.
తీవ్ర అనిశ్చితిలో ఉన్నాం...
ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమన్న అభిప్రాయం స్టాక్ మార్కెట్లలో ఇప్పటికే నెలకొందనీ, ఎగ్జిట్ పోల్ ఫలితాలు మరింత అధిక స్థాయిలో ఉన్నాయనీ క్రెడిట్ సూసీ రీసెర్చ్ నోట్ తెలిపింది. మనం ఇప్పటికీ అత్యధిక అనిశ్చితిలో ఉన్నామని వ్యాఖ్యానించింది. మే 16న (లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ప్రకటించే తేదీ) ఆశ్చర్యపడే విషయాలు వెల్లడికావచ్చని కూడా పేర్కొంది.
జాగ్రత్తగా గమనిస్తున్నాం: నోమురా
2004, 2009 ఎన్నికల ఫలితాల అంచనాలు, వాస్తవ ఫలితాల్లో తేడాలుండడంగా తాజా ఎగ్జిట్ పోల్స్‌ను తాము జాగ్రత్తగా గమనిస్తున్నట్లు నోమురా తెలిపింది. కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వానికి భారీ మెజారిటీ వస్తే స్టాక్ మార్కెట్లో ర్యాలీ నెలకొంటుందని వెల్త్‌రేస్ రీసెర్చ్ రిపోర్ట్ తెలిపింది. ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాకపోతే అస్థిర ప్రభుత్వం ఏర్పడి మార్కెట్లు పతనం కావచ్చని వ్యాఖ్యానించింది.