
ఇన్వెస్టర్ల ముందుజాగ్రత్త
* డెరివేటివ్స్ ముగింపు, పార్లమెంట్ సమావేశాల నేపథ్యం
* 44 పాయింట్ల నష్టంతో 25,776 పాయింట్లకు సెన్సెక్స్
దశ, దిశ లేకుండా సాగిన మంగళవారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్ స్వల్పంగా నష్టపోయింది. స్టాక్ సూచీలు నష్టపోవడం ఇది వరుసగా రెండో రోజు. బీఎస్‌ఈ సెన్సెక్స్ 44 పాయింట్ల నష్టపోయి 25,776 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 18 పాయింట్ల నష్టంతో 7,832 పాయింట్ల వద్ద ముగిశాయి. టెక్నాలజీ, ఇన్‌ఫ్రా, వాహన , కొన్ని బ్యాంక్ షేర్లు మార్కెట్‌ను పడగొట్టాయి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉండడం, యూరోప్ మార్కెట్లు బలహీనంగా ప్రారంభం కావడం, నేడు(బుధవారం) గురునానక్ జయంతి సందర్భంగా సెలవు, రేపు(గురువారం) నవంబర్ నెల డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగియనుండడం, పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుండడం, వచ్చే వారం ఆర్‌బీఐ పాలసీ ప్రకటన వంటి కారణాల వల్ల ఇన్వెస్టర్లు ఆచి, తూచి ట్రేడింగ్ జరిపారు. బలహీనంగా ప్రారంభమైన సెన్సెక్స్ రియల్టీ, ఆయిల్, గ్యాస్, ప్రభుత్వ రంగ కంపెనీల షేర్లలో కొనుగోళ్లతో కొంచెం రికవరీ అయింది. ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగుతూ, చివరకు 44 పాయింట్ల నష్టంతో 25,776 పాయింట్ల వద్ద ముగిసింది.
ఫైజర్ 9 శాతం అప్ : అలెర్గాన్ కంపెనీని ఫైజర్ కొనుగోలు చేసిన నేపథ్యంలో ఫైజర్ షేర్ జోరుగా పెరిగింది. బీఎస్‌ఈలో ఈ షేర్ 8.6 శాతం లాభపడి రూ.2,648 వద్ద ముగిసింది. క్రెడిట్ సూసీ సంస్థ సన్ ఫార్మాకు తటస్థం రేటింగ్‌ను కొనసాగిస్తామని పేర్కొనడంతో ఆ కంపెనీ షేర్ 1.5 శాతం పతనమైంది. మారుతీ సుజుకీ 2 శాతం క్షీణించింది. సెన్సెక్స్ బాగా నష్టపోయిన షేర్ ఇదే.
ఎల్ అండ్ టీ 1.9 శాతం నష్టపోగా, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, టీసీఎస్, బజాజ్ ఆటో, విప్రో, ఎన్‌టీపీసీ షేర్లు 1-2 శాతం రేంజ్‌లో పడిపోయాయి. హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందూస్తాన్ యూనిలివర్, లుపిన్, భారతీ ఎయర్‌టెల్ 1-2 శాతం రేంజ్‌లో పెరిగాయి. 1,475 షేర్లు లాభాల్లో, 1,182 షేర్లు నష్టాల్లో ముగిశాయి.
ఇతర ప్రాంతాల మార్కెట్ల తీరు...
ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా, రష్యా యుద్ధ విమానాన్ని సిరియా సరిహద్దుల్లో టర్కీ దేశం కూల్చివేయడంతో భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో యూరోప్ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.
ఆర్‌కామ్ 9 శాతం అప్
రిలయన్స్ కమ్యూనికేషన్స్ షేర్ 9.2 శాతం లాభంతో రూ.71 వద్ద ముగిసింది. ఈ ఒక్క రోజులోనే కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1,506 కోట్లు పెరిగింది. తన టవర్ల విభాగమైన రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్‌లో మొత్తం వాటాను ఆర్‌కామ్ విక్రయించనున్నదని, దీనికి సంబంధించి ఒప్పందం తుది దశకు చేరిందని, పది రోజుల్లో దీనికి సంబంధించి ప్రకటన వెలువడవచ్చని సమాచారం.
ఆర్‌కామ్‌కు రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్‌లో 96 శాతం వాటా ఉంది. ఈ వాటా విక్రయం వల్ల ఆర్‌కామ్‌కు రూ.22,000 కోట్లు వస్తాయని అంచనా. దీంతో రూ.38,000 కోట్లుగా ఉన్న ఆర్‌కామ్ రుణభారం గణనీయంగా తగ్గుతుంది. కాగా టవర్ల విక్రయ వార్తలపై స్పందించడానికి ఆర్‌కామ్ నిరాకరించింది.
నేడు సెలవు
గురు నానక్ జయంతి సందర్భంగా స్టాక్ మార్కెట్‌కు సెలవు. బులియన్, ఫారెక్స్ మార్కెట్లు కూడా పనిచేయవు.