
సాక్షి, ముంబై : ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నట్టు కనిపిస్తోంది. సంస్థ చర్రితలో తొలిసారి ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలో విఫలమైంది. రిలయన్స్ జియోలాంటి ప్రయివేటు టెలికాంల నుంచి ఎదురవుతున్న ప్రైస్ వార్ నేపథ్యంలో ఫిబ్రవరి మాస జీతాలను పది రోజులు ఆలస్యంగా చెల్లించినట్టు తెలుస్తోంది. తద్వారా 1.76 లక్షల మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారు. కేరళ, ఒడిషా, జమ్ము కశ్మీర్ ఉద్యోగులకు వేతనాలను బట్వాడా ను ప్రారంభించామని సంస్థ అధికారి ఒకరు వెల్లడించారు. మార్చి నెల జీతాలు కూడా కొన్ని రోజులు ఆలస్యం అయ్యే అవకాశం ఉందన్నారు.
టైమ్స్‌ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం మహారాష్ట్ర సర్కిల్ రూ. 60 కోట్ల విలువైన వేతనాలు చెల్లించాల్సింది ఉంది. దేశవ్యాప్తంగా మొత్తం 22 సర్కిళ్లలోని ఉద్యోగుల వేతనాల విలువ సుమారు రూ.12వందల కోట్లు. సంస్థ ఆదాయంలో సగభాగానికే పైగా వేతనాలకే పోతుంది. అలాగే సంవత్సరానికి వేతన బిల్లు భారం అదనంగా 8శాతం. అయితే ఈ మేరకు సంస్థ ఆదాయం పుంజుకోకపోవడంతో సంక్షోభంలో పడుతోంది.
కాగా ఈ నేపథ్యంలో నిధులను విడుదల చేయాల్సిందిగా కోరుతూ బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగ సంఘాలు కేంద్ర టెలికాం మంత్రి మనోజ్ సిన్హాకు ఇటీవల ఒక లేఖ కూడా రాశాయి. ఆర్థిక సంక్షోభాన్ని ఇతర ఆపరేటర్లు కూడా ఎదుర్కొంటున్నప్పటికీ వారు భారీ మొత్తాలను నింపడం ద్వారా నెట్టుకొస్తున్నారని ఆ లేఖలో పేర్కొడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment