పోంజీ స్కీములపై కొరడా
సహకార సంస్థల ముసుగులో అక్రమంగా డిపాజిట్లు సమీకరించే (పోంజీ స్కీములు) మోసపూరిత సంస్థలపై కఠిన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం కొత్త చట్టం ప్రవేశపెట్టనుంది. బహుళ రాష్ట్రాల సహకార సొసైటీల (ఎంఎస్‌సీఎస్) చట్టం 2002లోని లొసుగులను ఉపయోగించుకుని అక్రమ పథకాలతో మోసగించే సంస్థల నుంచి పేద, అమాయక ఇన్వెస్టర్లకు తక్షణం రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే క్లీన్ ఇండియా అజెండా కింద.. వివిధ వర్గాలతో సంప్రదింపుల అనంతరం కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికే ముసాయిదా బిల్లును రూపొందించి ప్రజాభిప్రాయం సేకరిస్తున్నట్లు, ఖరారయిన తర్వాత తుది బిల్లును త్వరలోనే అమల్లోకి తేనున్నట్లు జైట్లీ చెప్పారు.
బ్యాంకర్ల మాట
వృద్ధికి ప్రోత్సాహం...
బడ్జెట్ ‘‘సమతౌల్యత’’ ఉంది. ద్రవ్య క్రమశిక్షణ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా, వృద్ధికి తగిన ప్రోత్సాహం అందించేందుకు ఆర్థికమంత్రి శ్రమపడ్డారు. రైతులు, పేదల అభ్యున్నతి, మౌలిక రంగం అభివృద్ధి, ఆర్థికరంగం పటిష్టతకు బడ్జెట్ తోడ్పడుతుంది. – చందాకొచ్చర్, ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో
సానుకూల అంశాలు...
ఆర్థిక క్రమశిక్షణ మధ్య సమతౌల్యతను పాటించే విధంగా బడ్జెట్ ఉంది. గ్రామీణ వృద్ధి లక్ష్యంగా ప్రైవేటు పెట్టుబడుల వృద్ధికి చర్యలు తగిన ఫలితాన్ని ఇస్తాయి. హౌసింగ్ రంగ వృద్ధికి చొరవలు, పన్ను సరళీకరణలు సానుకూల అంశాలు.
– శిఖా శర్మ, యాక్సిస్ బ్యాంక్ చీఫ్