మాట్లాడుతున్న ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
అనంతగిరి: టీఆర్‌ఎస్ అన్నివిధాలుగా జిల్లాకు తీవ్ర అన్యాయం చేసిందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని చిగుళ్లపల్లి గ్రౌండ్‌లో వికారాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు. టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య రహస్య పొత్తు ఉందని, వచ్చే ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీల మధ్యే పోటీ ఉంటుందన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నల్లధనాన్ని వెనక్కి రప్పించడంలో ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు.
సీఎం కేసీఆర్‌ది ఫెడరల్ ఫ్రంట్ కాదని.. అది బీజేపీ టీం అని ఎద్దేవా చేశారు. ప్రాణహిత–చేవెళ్ల డిజైన్‌ను మార్చి జిల్లాకు టీఆర్‌ఎస్ తీరని అన్యాయం చేసిందన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇంకా ప్రారంభానికి కూడా నోచుకోలేదన్నారు. జిల్లా విభజనలో అన్యాయం చేయడంతో పాటు, చార్మినార్ జోన్‌లో కలపకుండా జోగులాంబలో కలిపారని మండిపడ్డారు. జిల్లాకు అన్ని విధాలుగా అన్యాయం చేసిన టీఆర్‌ఎస్ నుంచి తాను కాంగ్రెస్‌లో చేరానని ఎంపీ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేద్దామని పిలుపునిచ్చారు. వికారాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ విషయం కోర్టులో ఉందని, త్వరలో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆయన ఆశాభావంవ్యక్తం చేశారు.
అప్రజాస్వామయ్య పద్ధతిలో టీఆర్‌ఎస్ గెలుపు
తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సేనని, అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచిందని మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ ఆరోపించారు. కేసీఆర్‌ది నియంత పాలన అని, అక్కడ ఇమడలేకనే ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారని తెలిపారు. కొండా కాంగ్రెస్ పార్టీలోకి రావడం కొండంత బలం అని పేర్కొన్నారు. ఆయనను ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రైతుబంధు చెక్కులు, పాసుపుస్తకాల పంపిణీలో తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ త్వరలో మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తామని చెప్పారు. వికారాబాద్ నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉందని, ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేస్తున్నాడని తెలిపారు.
ఒకే కుటుంబంతో అన్యాయం
అనంతరం డీసీసీ అధ్యక్షుడు, తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ.. వికారాబాద్, పరిగి ఈవీఎంల ట్యాంపరింగ్ ఘటనలో త్వరలో తమకు అనుకూల తీర్పు వచ్చే అవకాశం ఉందన్నారు. జిల్లాను ఒకే కుటుంబం అన్యాయం చేస్తోందని, ఇంట్లో ముగ్గురికి పదవులు ఉండడంతో అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని దుయ్యబట్టారు. వికారాబాద్‌లో పాస్‌పోర్టు కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డికే దక్కుతుందని పేర్కొన్నారు. ఎంపీ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి పోటీ చేసేందుకు టీఆర్‌ఎస్‌కు అభ్యర్థి దొరకడం లేదని రోహిత్‌రెడ్డి ఎద్దేశా చేశారు. అసెంబ్లీలో మన జిల్లా విషయంలో గొంతెత్తని వ్యక్తి పార్లమెంట్‌లో ఏం మాట్లాడుతారని ఈ సందర్భంగా పైలెట్.. మహేందర్‌రెడ్డిని విమర్శించారు.
కాంగ్రెస్ నాయకుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెఓచ్చరించారు. అనంతరం పరిగి మాజీ ఎమ్మెల్యే రామోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇది ధర్మానికి, అధర్మానికి జరుగుతున్న యుద్ధమని, ఈ ఎన్నికల్లో ఎంపీని భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పారు. జోన్ విషయంలో అన్యాయంతో ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారన్నారు. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం మాట్లాడుతూ..పార్లమెంట్‌లో ప్రజాసమస్యలపై గొంతువిప్పిన ఘనత ఎంపీకే దక్కుతుందన్నారు. కేసీఆర్‌ను అప్పట్లో తిట్టినోళ్లు ప్రస్తుతం పొగుడుతున్నారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా ధూం ధాం నిర్వహించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, జెడ్పీటీసీ రాములు, పీఏసీఎస్ చైర్మన్ కిషన్‌నాయక్, ఎంపీపీటీసీలు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడుద అనంత్‌రెడ్డి, కృష్ణారెడ్డి, పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, సీనియర్ నాయకులు రత్నారెడ్డి, అడ్వకేట్ బస్వరాజు, నర్సింహారెడ్డి, కమాల్‌రెడ్డి, సంగమేశ్వర్, నర్సింలు, మురళి, విజయ్, సుధాకర్, శ్రీనివాస్‌గౌడ్, మేక చంద్రశేఖర్‌రెడ్డి, ఆయా మండలాల అధ్యక్షులు, సర్పంచులు తదితరులు ఉన్నారు.
ఎంపీ జన్మదిన వేడుకలు
సమావేశం అనంతరం నాయకులు, కార్యకర్తలు ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బర్త్‌డే సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. అతిథులతో పాటు నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి ఆయా గ్రామాల్లో ఒక్కో విద్యార్థికి తన ట్రస్టు తరుఫున రూ.1500 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment