సాక్షి, న్యూఢిల్లీ : 2018 ఆర్ధిక బడ్జెట్ మరికొన్ని రోజుల్లో పార్లమెంటు ముందుకు రానున్న నేపథ్యంలో అంచనాలు భారీగా నెలకొంటున్నాయి. తాజాగా ఎస్‌బీఐ ఆకర్షణీయమైన నివేదికను సోమవారం వెల్లడించింది. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని 3లక్షల రూపాయలకు పెంచాల్సిన అవసరం ఉందని నివేదించింది. ముఖ్యంగా ఏడో వేతన కమిషన్ తర్వాత ఉద్యోగుల ఆదాయాలు పెరిగిపోయాయని, ఈ నేపథ్యంలో ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుత 2.50 లక్షల రూపాయల నుంచి 3 లక్షల రూపాయలకు పెంచాలని ఎస్‌బిఐ తన తాజా నివేదికలో పేర్కొంది. తద్వారా దాదాపు 75 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని నివేదించింది. దీని మూలంగా ప్రభుత్వానికి కేవలం 7,500 కోట్ల మేర భారం పడుతుందని పేర్కొంది.
ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న తరుణంలో ఎస్‌బిఐ ఇకోరాప్ నివేదిక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆదాయపన్ను మినహాయింపు పెంపుతోపాటు, గృహ రుణంపై చెల్లించే వడ్డీకి సంబంధించిన మినహాయింపు పరిమితిని ప్రస్తుతమున్న 2 లక్షల రూపాయల నుంచి 2.50 లక్షల రూపాయలకు పెంచాలని కోరింది. దీంతో హోంలోన్ గ్రహీతలు సుమారు 75 లక్షల మందికి లబ్ది చేకూరుతుందని వెల్లడించింది. అంతేకాదు బ్యాంకుల్లో సేవింగ్స్ డిపాజిట్లు పెరిగేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నివేదిక సూచించింది. దీంతోపాటు సేవింగ్స్ టర్మ్ డిపాజిట్ల కాలపరిమితిని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించాలని సూచించింది. ఈ డిపాజిట్లను మినహాయింపు లభించే ఇఇఇ పన్ను విధానంలోకి తీసుకురాలని కోరింది. అంతేకాకుండా వ్యవసాయం, ఎంఎస్‌ఎంఇ, మౌలిక సదుపాయాలు, అందుబాటు ధరల్లో గృహ సదుపాయ కల్పనకు తగిన ప్రాధాన్యం కల్పించాలని సూచించింది. మౌలిక సదుపాయాలకు మద్దతు అందించడం, కార్మికుల నైపుణ్య శిక్షణ లాంటి ఇతర చర్యలు తీసుకోవాలనిఎస్‌బిఐ నివేదిక పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment