
రెండో రోజూ నష్టాలే..
♦ ముడి చమురు, ప్రపంచ మార్కెట్ల పతన ప్రభావం
♦ 321 పాయింట్ల నష్టంతో 23,089కు సెన్సెక్స్
♦ 91 పాయింట్ల నష్టంతో 7,019కు నిఫ్టీ
ముడి చమురు ధరలు వీటితో పాటు ప్రపంచ స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతుండటంతో బుధవారం కూడా మన స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. నేడు రైల్వే బడ్జెట్, డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచి, తూచి వ్యవహరించారు. బీఎస్‌ఈ సెన్సెక్స్ 321 పాయింట్లు నష్టపోయి 23,089 పాయింట్ల వద్ద ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 91 పాయింట్లు నష్టపోయి 7,019 పాయింట్ల వద్ద ముగిశాయి. ఆయిల్ అండ్ గ్యాస్ మినహా ఇతర అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. లోహ షేర్లు బాగా నష్టపోయాయి. సమీప భవిష్యత్తులో ఉత్పత్తిని తగ్గించేదే లేదని సౌదీ అరేబియా తెగేసి చెప్పడంతో ముడి చమురు ధరలు క్షీణించాయి. దీంతో చైనా మినహా ప్రధాన ఆసియా మార్కెట్లు కుదేలయ్యాయి. యూరప్ మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి.
ఆరేళ్ల కనిష్టానికి పీఎన్‌బీ
30 సెన్సెక్స్ షేర్లలో 23 షేర్లు నష్టాల్లో ముగిశాయి. చమురు ధరల పతనం కారణంగా ఓఎన్‌జీసీ, కెయిర్న్ ఇండియా షేర్లు 2 శాతం వరకూ నష్టపోగా, రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీ షేర్లు 4 శాతం వరకూ లాభపడ్డాయి. పీఎన్‌బీ ఇంట్రాడేలో 5 శాతం నష్టపోయి ఆరేళ్ల కనిష్ట స్థాయి రూ.69ను తాకింది. చివరకు 0.6 శాతం నష్టంతో రూ.72 వద్ద ముగిసింది. రెండు వారాల్లో ఈ షేర్ 27 శాతం క్షీణించింది. ఈ నెల 8న ఈ షేర్ ధర రూ.94గా ఉంది. ఇంట్రాడేలో ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, సిప్లా, ఐసీఐసీఐ బ్యాంక్, భెల్‌లు కొత్త ఏడాది కనిష్ట స్థాయిలను తాకాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా సెన్సెక్స్ 10 శాతం నష్టపోగా ఈ ఐదు షేర్లు 12-42% చొప్పున పడిపోయాయి.
బ్యాంక్ షేర్లు తగ్గించుకుంటున్న మ్యూచువల్ ఫండ్స్
మొండి బకాయిలు భారీగా పెరిగిపోతుండటడంతో బ్యాంక్ షేర్లను మ్యూచువల్ ఫండ్స్ తగ్గించుకుంటున్నాయి. మ్యూచువల్ ఫండ్ కంపెనీల బ్యాంక్ షేర్ల నుంచి గత నెలలో రూ.6,662 కోట్లు ఉపసంహరించుకోవడంతో ఆ షేర్లలో పెట్టుబడులు రూ.78,600 కోట్లకు పడిపోయాయని వెల్త్‌ఫోర్స్‌డాట్‌కామ్ తెలిపింది.