న్యూఢిల్లీ: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంకులో (కేఎంబీ) ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ గురు వారెన్ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాథవే పెట్టుబడులు పెట్టనుందన్న వార్తలు శుక్రవారం మార్కెట్లో హల్‌చల్ చేశాయి. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం కేఎంబీలో 10 శాతం వాటాలను బెర్క్‌షైర్ కొనుగోలు చేయాలని భావిస్తోంది. ప్రమోటర్ వాటాలను కొనుగోలు చేయడం లేదా ప్రిఫరెన్షియల్ అలాట్‌మెంట్ రూపంలో ఈ డీల్ ఉండవచ్చు. ఒప్పందం విలువ సుమారు 4 బిలియన్ డాలర్ల నుంచి 6 బిలియన్ డాలర్ల దాకా (దాదాపు రూ. 28,000 కోట్ల నుంచి రూ. 42,000 కోట్ల దాకా) ఉండొచ్చని అంచనా. ఒకవేళ ఈ డీల్ గానీ పూర్తయితే ఆర్‌బీఐ నిబంధనలకు అనుగుణంగా కేఎంబీలో ప్రమోటర్లు తమ వాటాలను తగ్గించుకోవడం సాధ్యపడుతుంది. సెప్టెంబర్ ఆఖరు నాటికి కేఎంబీలో ప్రమోటరు, వైస్ చైర్మన్ ఉదయ్ కొటక్‌కు 29.73 శాతం వాటాలున్నాయి. ఆర్‌బీఐ ఆదేశాల ప్రకారం డిసెంబర్ 2018 నాటికల్లా ప్రమోటర్ల వాటాను 20 శాతానికి, 2020 మార్చి నాటికి 15 శాతానికి తగ్గించుకోవాల్సి ఉంది. ప్రస్తుతం కేఎంబీ మార్కెట్ క్యాప్ దాదాపు 34 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ. 2.38 లక్షల కోట్లు) ఉంది. మరోవైపు, ఈ వార్తలపై స్టాక్ ఎక్సే్చంజీలకు కేఎంబీ వివరణనిచ్చింది. బెర్క్‌షైర్ హాథవే తమ బ్యాంకులో వాటాలు కొనుగోలు చేసే ప్రణాళికల గురించి తమ వద్ద సమాచారమేమీ లేదని పేర్కొంది.
షేరు 9 శాతం అప్..: బెర్క్‌షైర్ హాథవే పెట్టుబడులు పెడుతున్నట్లు వెలువడిన వార్తలతో శుక్రవారం కోటక్ మహీంద్రా షేర్లు భారీగా ఎగిశాయి. బీఎస్‌ఈలో ఒక దశలో సుమారు 14 శాతం పెరిగి రూ. 1,345.35 స్థాయిని కూడా తాకింది. చివరికి 8.53 శాతం లాభంతో రూ. 1,282.25 వద్ద క్లోజయ్యింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈలో కూడా ఇంట్రాడేలో రూ. 1,345.95 – రూ. 1,176.15 మధ్య తిరుగాడిన షేరు చివరికి 8.84 శాతం లాభంతో రూ. 1,284.55 వద్ద క్లోజయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment