ఇంటి కొనుగోలు నిర్ణయాల్లో మహిళలదే పైచేయి
ముంబై: ఇంటి కొనుగోలు నిర్ణయాల్లో మహిళల పాత్ర క్రమంగా పెరుగుతోంది. ఇంటిని కొనుగోలు చేయాలా? లేదా అద్దెకు తీసుకోవాలా? అనే అంశాల్లో మహిళలే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ విషయం హౌసింగ్.కామ్ సర్వేలో వెల్లడైంది. సర్వే ప్రకారం..ఇంటికి సంబంధించిన కొనుగోలు, అద్దె వంటి అంశాల్లో 95 శాతానికి పైగా మహిళలే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కుటుంబాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే మహిళల శాతం 30కి పైగానే ఉంది. కుటుంబంలోని ఇతర సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకునే మహిళలు 50 శాతంగా ఉన్నారు. ఇళ్లు, ఇతర రియల్టీ సంబంధిత నిర్ణయాలు తీసుకునేవారిలో 18-34 ఏళ్ల వయసున్న వారు ఎక్కువగా ఉన్నారు. ప్రాపర్టీ ప్లాట్‌ఫామ్స్‌ను సందర్శిస్తున్న మహిళలు 58 శాతంగా ఉన్నారు. ఇంటి కొనుగోలు, అద్దెకు సంబంధించిన లావాదేవీల్లో మహిళల పాత్ర పెరుగుతోంది. మహిళల స్వతంత్రత పెరిగే కొద్ది ఆస్తి కొనుగోలు నిర్ణయాల్లో వారి పాత్ర పెరుగుతుందని హౌసింగ్.కామ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రిషాబ్ గుప్తా తెలిపారు.