పన్నుపోటు తగ్గేరూటు | by thinking smart we can decrease the tax | Sakshi
Sakshi News home page

పన్నుపోటు తగ్గేరూటు

Published Sat, Dec 6 2014 11:19 PM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM

పన్నుపోటు తగ్గేరూటు - Sakshi

పన్నుపోటు తగ్గేరూటు

సంపాదిస్తున్న మొత్తంలోంచి కొంత మొత్తం పన్ను రూపంలో చెల్లించాలంటే చాలామందికి భారంగానే ఉంటుంది. కాని కొంచెం తెలివిగా వ్యవహరిస్తే ఈ పన్ను భారాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవచ్చు. ఇందుకోసం మన ఆదాయ పన్ను చట్టంలో అనేక సెక్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరికి తప్పని ఖర్చులను చూపించడంతో పాటు, ఎంపిక చేసిన పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్‌చేయడం ద్వారా ఈ ప్రయోజనాలను పొందచ్చు. పన్ను భారం తగ్గించుకోవడంలో కొన్ని కీలకమైన సెక్షన్‌ల సమాచారమే ఈ వారం ప్రాఫిట్ లీడ్ స్టోరి...
 
పన్ను భారం తగ్గించుకోవడంలో ముఖ్యమైనది సెక్షన్  80సీ. ఈ సెక్షన్ కింద చేసిన కొన్ని పొదుపులు, చెల్లింపుల ద్వారా పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ఈ సెక్షన్ పరిధిలోకి అనేక సాధనాలు వచ్చినా గరిష్టంగా లక్షన్నర రూపాయలు మించి ప్రయోజనం పొందలేరు. ఈ సెక్షన్ పరిధిలోకి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), ఈక్విటీ ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ (ఈఎల్‌ఎస్‌ఎస్-ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్), 5 ఏళ్ల బ్యాంక్ డిపాజిట్లు, ఎన్‌ఎస్‌సీ, సీనియర్ సిటిజన్ ట్యాక్స్ సేవింగ్ ఫండ్, బీమా, యులిప్, పెన్షన్ వంటి సేవింగ్ పథకాలతో పాటు, గృహరుణ ఈఎంఐలో అసలుకు చెల్లించే వాటా, ఇంటి రిజిస్ట్రేషన్‌కి చెందిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు వంటి వ్యయాలను చూపించడం ద్వారా పన్ను ప్రయోజనాలను పొందవచ్చు.

ఇంటి రుణ వడ్డీపై: రుణం తీసుకుని నిర్మించిన ఇంటికి రెండు సెక్షన్ల ద్వారా పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. చెల్లిస్తున్న రుణంలో  అసలుకు (అంటే వడ్డీ కాకుండా)చెల్లించే మొత్తంపై సెక్షన్ 80సీ కింద ప్రయోజనం పొందవచ్చు. అదే రుణానికి చెల్లించే వడ్డీపై సెక్షన్ 24(బి) కింద గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇది సెక్షన్ 80సీ కింద లభించే రూ.1.50 లక్షల ప్రయోజనానికి అదనం. అంటే.. ఇంటి రుణం తీసుకుంటే కనీసం మూడు లక్షల వరకు పన్ను ఆదాయం తగ్గుతుంది.

ఉన్నత చదువుల కోసం..
సొంతంగా ఉన్నత చదువు కోసం రుణం తీసుకుంటే అందుకు చెల్లించే వడ్డీపై సెక్షన్ 80ఈ  ప్రకారం పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ వడ్డీ మినహాయింపులపై ఎటువంటి పరిమితులు లేవు. కాని ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. ఈ మినహాయింపు కేవలం వడ్డీ చెల్లింపులపైన మాత్రమే. అసలుకు చెల్లించే వాటిపైన ఎటువంటి మినహాయింపులుండవు. అలాగే గరిష్టంగా 8 సంవత్సరాల వరకు ఈ మినహాయింపులను పొందవచ్చు. రుణం తీసుకుని ఎనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత చెల్లించే వడ్డీపై సెక్షన్ 80ఈ మినహాయింపులు లభించవు. భార్య లేదా భర్త, పిల్లలు లేదా సొంతంగా ఉన్నత చదువుల కోసం తీసుకునే రుణాలన్నింటిపైనా ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. పిల్లల ట్యూషన్ ఫీజులకు సెక్షన్ 80సీ ద్వారా లభించే ప్రయోజనాలకు ఇవి అదనం.
 
ఆస్తులు అమ్మితే..
ఈ మధ్య కాలంలో షేర్లు, రియల్ ఎస్టేట్ ధరలు బాగా పెరిగాయి. ఇలా దీర్ఘకాలిక ఆస్తులు అమ్మినప్పుడు వచ్చిన లాభాలపై మూల ధన పన్ను (లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్) చెల్లించాలి. కాని ఈ పన్ను భారం నుంచి తప్పించుకోవడానికి ఆదాయ పన్ను చట్టంలో ప్రత్యేకంగా 54ఈసీ పేరుతో ఒక సెక్షన్ ఉంది. 54ఈసీ పరిధిలోకి వచ్చే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ బాండ్స్‌లో ఈ లాభాలను ఇన్వెస్ట్ చేయడం ద్వారా పన్ను భారం నుంచి తప్పించుకోవచ్చు. దీని ప్రకారం బంగారం, షేర్లు, స్థలాలు, ఇల్లు వంటివి అమ్మినప్పుడు వచ్చే లాభాలను ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ బాండ్స్ మూడేళ్ళ లాకిన్ పిరియడ్‌ను కలిగి ఉంటాయి. కాని ఈ బాండ్స్ అందించే వడ్డీ మాత్రం ఆదాయంగా పరిగణిస్తారు.

హెచ్‌ఆర్‌ఏ లేకపోయినా..
హెచ్‌ఆర్‌ఏ లేకపోయినా చెల్లించే ఇంటద్దెపై పన్ను ప్రయోజనాలు పొందడానికి ప్రత్యేకంగా ఒక సెక్షన్ ఉందన్న సంగతి చాలా మందికి తెలియనే తెలియదు. సెక్షన్ 80జీజీ ప్రకారం హెచ్‌ఆర్‌ఏ సౌలభ్యం లేని వృత్తినిపుణులు, వ్యాపారస్తులు వంటి వారు ఈ ప్రయోజనం పొందచ్చు. ఈ సెక్షన్ ప్రకారం మీ ఆదాయంలో గరిష్టంగా 25% లేదా నెలకు గరిష్టంగా రూ.2,000 వరకు ఆదా యం నుంచి మినహాయింపు పొందవచ్చు. కాని ఈ ప్రయోజనం పొందాలంటే నివసిస్తున్న ఊరిలో మీ పేరు మీద లేక భార్య పిల్లల పేర సొంతిల్లు ఉండకూడదు. అలాగే ఇంటికి సంబంధించిన ఎటువంటి ఇతర పన్ను ప్రయోజనాలను పొంది ఉండకూడదు.

కొత్తగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తే...
రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీం పేరుతో కొత్తగా సెక్షన్ 80సీసీజీ అందుబాటులోకి వచ్చింది. ఇది కేవలం తొలిసారిగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు చేసే వారికే వర్తిస్తుంది. ఈ పథకం కింద  గరిష్టంగా ఇన్వెస్ట్ చేసే రూ.50,000లో  సగభాగం అంటే రూ.25,000 పన్ను ఆదాయం నుంచి తగ్గించి చూపించుకోవచ్చు. వార్షికాదాయం పన్నెండు లక్షలు దాటిన వారికి ఇది వర్తించదు.
 - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం
 
ఆరోగ్యం కోసం...
హెల్త్ ఇన్సూరెన్స్‌కు చెల్లించే ప్రీమియంలపై సెక్షన్ 80డీ ద్వారా పన్ను భారం తగ్గించుకోవచ్చు. గరిష్టంగా రూ.15,000 వరకు  సీనియర్ సిటిజన్స్ అయితే రూ.20,000 వరకు ఈ విధంగా తగ్గించుకోవచ్చు. అదే తల్లిదండ్రులకు కూడా వైద్య బీమా తీసుకుంటే అదనంగా మరో రూ. 5,000 ప్రయోజనం లభిస్తుంది. ముందుజాగ్రత్త చర్యగా చేయిం చుక్ను వైద్య పరీక్షలపై గరిష్టంగా రూ.5,000 వరకు పన్ను ప్రయోజనాలను పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల వైద్యపరీక్షలకూ ఇది వర్తిస్తుంది. అలాగే కొన్ని ప్రధానమైన వ్యాధులకు చికిత్సకు అయ్యే వ్యయాలపై సెక్షన్ 80డీడీబీ కింద పన్ను ప్రయోజనాలను లభిస్తాయి. ఈ సెక్షన్ కింద గరిష్టంగా 40,000 ఆదాయంతగ్గించి చూపించుకోవచ్చు. ఏ వ్యాధులకు మినహాయింపులు లభిస్తాయన్నది సెక్షన్‌లో పేర్కొనడం జరిగింది. సీనియర్ సిటిజన్‌కు రూ.60,000 వరకు చూపించుకోవచ్చు.
 
విరాళాలు ఇస్తే...

హుద్‌హుద్ తుఫాన్, కాశ్మీర్ వరదలు వంటి వాటికి ఇచ్చే విరాళాలపై కూడా పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఇలా విరాళాలపై మినహాయింపులు పొందడానికి సెక్షన్ 80జీ ఉంది. కానీ అన్ని విరాళాలకు ఈ మినహాయింపులు లభించవు. ఇందుకు అర్హత ఉన్న సంస్థలకు ఇస్తేనే ఈ మినహాయింపులు వర్తిస్తాయి. ఇందుకు సంబంధించి సెక్షన్ 80జీలో అనేక నిబంధనలు ఉన్నాయి. కొన్ని విరాళాలపై పూర్తిగా 100 శాతం తగ్గింపు(డిడక్షన్) లభిస్తే మరికొన్నింటిపై 50 శాతం మాత్రమే లభిస్తాయి.

జాతీయ రక్షణ నిధి, ప్రధాన  మంత్రి, ముఖ్య మంత్రి సహాయ నిధి, నేషనల్ ఫౌండేషన్ ఫర్ కమ్యునల్ హార్మోని, జిల్లా సాక్షరతా మిషన్, కేంద్ర స్పోర్ట్స్ ఫండ్, కేంద్ర సాంస్కృతిక ఫండ్, నేషనల్ టెక్నాలజీ ఫండ్ వాటికి ఇచ్చే విరాళాలపై ఎటువంటి పరిమితులు లేకుండా పూర్తిగా 100 శాతం మినహాయింపులు లభిస్తాయి. జవహర్‌లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్, ప్రధానమంత్రి కరువు సహాయక నిధి, జాతీయ చిల్డ్రన్ ఫండ్, ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ వంటి వాటికిచ్చే విరాళాలపై 50 శాతం తగ్గింపు ప్రయోజనం లభిస్తుంది.  అలాగే నగదు రూపంలో ఇచ్చే విరాళాలు, స్థూల జీతంలో 10 శాతం దాటని
 విరాళాలకు మాత్రమే ఈ డిడక్షన్స్ వర్తిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement