రేట్ల కోత ఆశలపై ‘రూపాయి’ నీళ్లు!
ఎస్‌బీఐ సర్వే అంచనా..
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పాలసీ రేట్ల కోత ఆశలపై రూపాయి బలహీన ధోరణి నీళ్లు జల్లుతోందని ఎస్‌బీ సర్వే ఒకటి అభిప్రాయపడింది. ద్రవ్యోల్బణం ఆమోదనీయ స్థాయికి దిగిరావడం, అంతర్జాతీయంగా క్రూడ్ ధరల తగ్గుదల నేపథ్యంలో... వృద్ధికి ఊతం ఇస్తూ సమీప కాలంలో ఆర్‌బీఐ వడ్డీరేట్ల కోత నిర్ణయం తీసుకోవచ్చని ఇటీవల అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఎస్‌బీఐ సర్వే వెలువడింది. రూపాయి బలహీనత వల్ల వడ్డీరేట్ల కోత నిర్ణయంలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని తాము భావిస్తున్నట్లు నివేదికలో ఎస్‌బీఐ పేర్కొంది. ప్రస్తుతం డాలర్ మారకంలో రూపాయి విలువ 63.62 వద్ద ఉంది.
త్వరలోనే బలపడుతుంది...
అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కరెంట్ అకౌంట్(క్యాడ్) తగిన స్థాయిలో ఉండడం వల్ల రూపాయి తిరిగి సాధ్యమైనంత త్వరలోనే బలపడుతుందని కూడా నివేదిక అభిప్రాయపడింది. క్రూడ్ ఆయిల్ ధరలు దిగువ శ్రేణిలో కదలాడుతున్న పరిమాణం వాణిజ్యలోటు సమతౌల్యతపై ఒత్తిడిని తగ్గిస్తుందని తెలిపింది. 2014-15లో దిగుమతులు గత ఆర్థిక సంవత్సరంకన్నా 3.7 శాతం అధికంగా 483.4 బిలియన్ డాలర్లుగా ఉంటాయన్నది అంచనా అని ఎస్‌బీఐ చీఫ్ ఎకనమిస్ట్ సౌమ్యకంటి ఘోష్ పేర్కొన్నారు.
కాగా అంతర్జాతీయ అంశాలు భారత్ స్థూల ఆర్థిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని వివరించింది. చైనా ఆర్థిక వ్యవస్థ బలహీనత, రూబుల్ మారకం విలువను రక్షించుకోడానికి రష్యా హఠాత్తుగా పెంచిన వడ్డీరేటు వంటి అంశాలు మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ప్రతికూలాంశాలని ఎస్‌బీఐ సర్వే నివేదిక తెలిపింది.