
న్యూఢిల్లీ: మొండిబాకీలకు కేటాయింపులు తగ్గడంతో ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రెండు రెట్లు ఎగిసి రూ.318 కోట్లకు చేరింది. 2017 అక్టోబర్–డిసెంబర్ కాలంలో బ్యాంక్ లాభం రూ.126 కోట్లు. మరోవైపు, తాజా క్యూ3 లో కెనరా బ్యాంక్ ఆదాయం రూ. 12,341 కోట్ల నుంచి రూ. 13,513 కోట్లకు పెరిగింది. స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏ) 10.38 శాతం నుంచి 10.25%కి, నికర ఎన్‌పీఏలు 6.78% నుంచి 6.37%కి తగ్గాయి.
అటు మొండిబాకీలకు కేటాయింపులు రూ. 2,674 కోట్ల నుంచి రూ. 1,977 కోట్లకు తగ్గాయి. జనవరి 21న ప్రారంభించిన ఎంప్లాయీ స్టాక్ పర్చేజ్ స్కీమ్(ఈఎస్‌పీఎస్) 25తో ముగిసిందని, 134% ఓవర్‌సబ్‌స్క్రయిబ్ అయ్యిందని బ్యాంకు పేర్కొంది. ఈ స్కీమ్ కింద తొలి విడతలో రూ. 557 కోట్లు సమీకరిస్తున్నట్లు వివరించింది. సోమవారం కెనరా బ్యాంక్ షేరు 5 శాతం క్షీణించి రూ. 240.30 వద్ద క్లోజయ్యింది.