కెనరా బ్యాంక్ లాభం మూడింతలు
మొండి బకాయిలు రెట్టింపు
న్యూఢిల్లీ: కెనరా బ్యాంక్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో మూడు రెట్లు పెరిగింది. మొండి బకాయిలు రెట్టింపైనప్పటికీ, ఈ స్థాయి నికర లాభం సాధించామని కెనరా బ్యాంక్ తెలిపింది. గత క్యూ3లో రూ.85 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.322 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.12,051 కోట్ల నుంచి స్వల్పంగా పెరిగి రూ.12,079 కోట్లకు చేరిందని వివరించింది. స్థూల మొండి బకాయిలు 5.84 శాతం నుంచి 9.97శాతానికి, నికర మొండి బకాయిలు 2.42 శాతం నుంచి 6.72 శాతానికి పెరిగాయని పేర్కొంది.
గత క్యూ3లో రూ.19,813 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో రూ.34,339 కోట్లకు పెరిగాయని తెలిపింది. మొత్తం కేటాయింపులు (ఆదాయపు పన్ను మినహా) రూ.1,429 కోట్ల నుంచి స్వల్పంగా పెరిగి రూ.1,485 కోట్లకు చేరాయని వివరించింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల కాలానికి రూ. 908 కోట్ల నికర లాభం సాధించామని, గతేడాది ఇదే కాలంలో ఆర్జించిన నికర లాభం(రూ.1,093 కోట్లు)తో పోల్చితే 17% క్షీణత నమోదైందని తెలిపింది. ఇక మొత్తం ఆదాయం రూ.36,781 కోట్ల నుంచి రూ.36,053 కోట్లకు తగ్గిందని కెనరా బ్యాంక్ పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో బ్యాంక్ షేరు ధర 5% దిగజారి రూ.273 వద్ద ముగిసింది.