కెన్ ఫిన్ హోమ్స్‌లో 13.5% వాటా విక్రయించిన కెనరా బ్యాంక్
డీల్ విలువ రూ.759 కోట్లు
ముంబై: ప్రభుత్వ రంగ కంపెనీ కెనరా బ్యాంక్, తన అనుబంద సంస్థ, కెన్ ఫిన్ హోమ్స్‌లో 13.45 శాతం వాటాను విక్రయించింది. సింగపూర్ జీఐసీకి ఈ వాటాను రూ.758.8 కోట్లకు విక్రయించామని కెనరా బ్యాంక్ స్టాక్ ఎక్సే్చంజ్‌లకు నివేదించింది. ఒక్కో షేర్‌ను రూ.2,105 చొప్పున మొత్తం 35,80,849 షేర్లను జిఐసీ సింగపూర్ అనుబంధ సంస్థ కలాడియమ్ ఇన్వెస్ట్‌మెంట్(సింగపూర్ సావరిన్ హెల్త్‌ఫం డ్)కు అమ్మేశామని పేర్కొంది.
ఈ ధర గురువారం కెన్ ఫిన్ హోమ్స్ ముగింపు ధరకు 9 శాతం అధికమని జేఎమ్ ఫైనాన్షియల్ తెలిపింది. ఈ వాటా విక్రయంలో కెనరా బ్యాంక్‌కు సలహాదారుగా ఈ సంస్థే వ్యవహరించింది. ఈ వాటా విక్రయ వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో కెన్‌ఫిన్ హోమ్స్ షేర్ 2.1%లాభపడి రూ.1,978 వద్ద ముగిసింది. గతేడాది డిసెంబర్ నాటికి కెన్ ఫిన్ హోమ్స్‌లో కెనరా బ్యాంక్‌కు 44.1% వాటా ఉంది. కాగా స్టాక్ మార్కెట్లో లిస్ట్‌కాని అనుబంధ కంపెనీ కెనరా ఫ్యాక్టర్స్‌లో వాటా విక్రయం నిమిత్తం మర్చంట్ బ్యాంకర్లను నియమించామని గత నెలలోనే కెనరా బ్యాంక్ వెల్లడించిది.