నీరవ్ మోదీ (ఫైల్ ఫోటో)
పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.11,400 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడి, విదేశాలకు పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, తన ఉద్యోగులకు లేఖ రాశారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో వేతనాలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నామని తెలిపారు. ఇతర అవకాశాలు చూసుకోవాలంటూ ఉద్యోగులకు సూచించారు. అయితే గతంలో ఉన్న బకాయిలను చెల్లించేందుకు తమకు అనుమతి ఇవ్వాలంటూ బ్యాంకులను కోరినట్టు కూడా తెలిపారు. స్టాక్స్, బ్యాంకు అకౌంట్లు యాక్సస్ లభిస్తే, గత బకాయిలు చెల్లిస్తానంటూ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతమైతే జీతాలు చెల్లించలేనని పరిస్థితులో ఉన్నానంటూ చేతులు ఎత్తేశారు. అంతేకాక ఉద్యోగులను రిలీవ్ ఆర్డర్లు కూడా తీసుకోవాలని ఆదేశించారు.
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని దుకాణాలను మూసివేస్తున్నట్టు ప్రకటించారు. భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని పేర్కొన్నారు. అయితే తమ కార్యకలాపాలను పునఃప్రారంభించడానికి చట్టపరమైన సహాయం తీసుకుంటామని తెలిపారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు దాఖలు చేసిన ఫిర్యాదులతో నీరవ్‌మోదీ సంస్థలు తీవ్ర ఆందోళనలో పడిన సంగతి తెలిసిందే. నీరవ్‌మోదీ, ఆయన అంకుల్ మెహుల్ చౌక్సికి చెందిన గీతాంజలి జెమ్స్ షోరూంలు మూతపడుతున్నాయని, దీంతో 5000 మంది ఉద్యోగులు రోడ్డున పడబోతున్నారని రిపోర్టులు వచ్చాయి. మరోవైపు నీరవ్, మెహుల్ ప్రాపర్టీలు, షోరూంలపై సీబీఐ, ఈడీ భారీగా తనిఖీలు చేపడుతోంది. పలు దుకాణాలను సైతం సీజ్ చేస్తున్నాయి. నీరవ్ మోదీ ఎలాంటి మోసానికి పాల్పడలేదని ఆయన న్యాయవాది విజయ్ అగర్వాల్ పీఎన్‌బీ ఆరోపణలను ఖండిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment