జెట్‌ క్రాష్‌ ల్యాండింగ్‌! | Cash-strapped Jet Airways to suspend operations from tonight | Sakshi
Sakshi News home page

జెట్‌ క్రాష్‌ ల్యాండింగ్‌!

Published Thu, Apr 18 2019 12:32 AM | Last Updated on Thu, Apr 18 2019 5:32 AM

 Cash-strapped Jet Airways to suspend operations from tonight - Sakshi

న్యూఢిల్లీ: ఏవియేషన్‌ రంగంలో కఠిన పరిస్థితులను ప్రతిబింబిస్తూ మరో విమానయాన సంస్థ మూసివేత అంచులకు చేరింది. రుణభారం, నిధుల కొరతతో నాలుగు నెలలుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. కార్యకలాపాలను కొనసాగించేందుకు అత్యవసరంగా కావాల్సిన రూ. 400 కోట్లను సమకూర్చేందుకు బ్యాంకులు నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని జెట్‌ ఎయిర్‌వేస్‌ తెలిపింది. ‘రుణదాతల నుంచి గానీ మరే ఇతర మార్గాల ద్వారా గానీ అత్యవసరంగా కావాల్సిన నిధులు లభించే భరోసా లేదు. దీంతో కార్యకలాపాలు కొనసాగించే క్రమంలో ఇంధన విక్రేతలకు, ఇతరత్రా సేవలందించే వారికి చెల్లింపులు జరపలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాం. దేశీయంగాను, విదేశీ రూట్లలోనూ నడిపే ఫ్లయిట్స్‌ అన్నింటినీ తక్షణం రద్దు చేయాల్సి వస్తోంది. బుధవారం రాత్రి అమృత్‌సర్‌ విమానాశ్రయం నుంచి న్యూఢిల్లీకి రాత్రి 10.30 గం.లకు వెళ్లే ఫ్లయిట్‌ ఆఖరుది‘ అని స్టాక్‌ ఎక్సే్చంజీలకు జెట్‌ ఎయిర్‌వేస్‌ బుధవారం తెలిపింది. దీంతో 20 వేల మందికి పైగా ఉద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ప్రయాణికులు, బ్యాంకులు, రుణదాతలకు వేల కోట్ల రూపాయల బాకీల చెల్లింపు ప్రశ్నార్థకంగా మారింది.  నియంత్రణ సంస్థల నిబంధనలకు లోబడి జెట్‌ పరిష్కార ప్రణాళికకు తోడ్పాటునిస్తామని పేర్కొంది.  

మే 10 దాకా నిరీక్షణ .. 
సంస్థలో వాటాలను విక్రయిస్తున్న రుణదాతలు .. బిడ్లను ఖరారు చేసే ప్రక్రియ పూర్తయ్యే దాకా వేచి చూడనున్నట్లు జెట్‌ తెలిపింది. నాలుగు సంస్థలు అర్హత పొందాయని, ఇవి తుది బిడ్లను దాఖలు చేసేందుకు మే 10 దాకా గడువుందని పేర్కొంది. ఎతిహాద్‌ ఎయిర్‌వేస్, జాతీయ పెట్టుబడి నిధి ఎన్‌ఐఐఎఫ్, ప్రైవేట్‌ సంస్థ టీపీజీ, మరో ఫండ్‌ హౌస్‌ ఇండిగో పార్ట్‌నర్స్‌ ఈ జాబితాలో ఉన్నాయి. మరోవైపు, జెట్‌ కార్యకలాపాల నిలిపివేతపై పౌర విమానయాన శాఖ స్పందించింది. సంస్థ సమస్యల పరిష్కారమార్గాన్ని కనుగొనేందుకు సంబంధిత వర్గాలతో కలిసి పనిచేస్తున్నామని ఉద్యోగులకు పంపిన లేఖలో జెట్‌ ఎయిర్‌వేస్‌ సీఈవో వినయ్‌ దూబే తెలిపారు. ‘అయితే, విక్రయ ప్రక్రియ పూర్తి కావడానికి సమయం పడుతుందన్న సంగతి అంతా దృష్టిలో ఉంచుకోవాలి. ఈలోగా మరిన్ని సవాళ్లు ఎదురవ్వొచ్చు. వీటికి సంబంధించి ప్రస్తుతానిౖMðతే మన దగ్గర సమాధానాలు లేవు‘  అని ఆయన తెలిపారు.  మంగళవారం సమావేశంలో ఆఖరు ప్రయత్నంగా రూ. 400 కోట్లయినా సమకూర్చాలని బ్యాంకులను కోరాలంటూ సీఈవో వినయ్‌ దూబేకి జెట్‌ బోర్డు సూచించింది. బ్యాంకులు దానికి అంగీకరించకపోతే, సంస్థ భవిష్యత్‌పై నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. అయితే, అత్యవసరంగా నిధులను సమకూర్చాలన్న విజ్ఞప్తిని అంగీకరించడం లేదంటూ రుణాలిచ్చిన బ్యాంకుల కన్సార్షియం తరఫున ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. మంగళవారం రాత్రి పొద్దుపోయాక జెట్‌ ఎయిర్‌వేస్‌కు తెలిపింది. ఈ పరిణామాల దరిమిలా సర్వీసులను నిలిపివేయాలన్న నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్లు జెట్‌ ఎయిర్‌వేస్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది.

దేశీ ఎయిర్‌లైన్స్‌ కష్టాలకు కారణాలు.. 
విమానయాన సంస్థల కష్టాలకు పలు కారణాలు ఉంటున్నాయి. ప్రధానంగా దేశీ విమాన సర్వీసులకు ఉపయోగించే ఇంధనంపై అధిక పన్నుల పోటు, విమానాశ్రయాల్లో ఇన్‌ఫ్రా సమస్యలతో మరిన్ని ప్లేన్స్‌ను చేర్చే పరిస్థితి లేకపోవడం, తీవ్రమైన పోటీ కారణంగా చౌక చార్జీలతో కొనసాగాల్సి వస్తుండటం, నష్టాల్లో ఉన్న సంస్థలను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోతుండటం మొదలైన అంశాలు ఇందులో ఉన్నాయి.

జెట్‌ పాతికేళ్ల ప్రస్థానమిదీ.. 
►1992లో సంస్థ ఏర్పాటు. 1993లో ఎయిర్‌ ట్యాక్సీ ఆపరేటర్‌గా కార్యకలాపాలు ప్రారంభం. 1995లో పూర్తి స్థాయి విమానయాన సంస్థగా కార్యకలాపాలు. 2004లో విదేశీ రూట్లలో ఫ్లయిట్స్‌. 
►2005లో పబ్లిక్‌ ఇష్యూ(ఐపీఓ). 
► 2007లో రూ. 2,050 కోట్లతో ఎయిర్‌ సహారా కొనుగోలు.  
►  2010 – 2012 దాకా ప్యాసింజర్‌ మార్కెట్లో అత్యధిక వాటాతో అగ్రస్థానం.
►  2011–12లో సంక్షోభ పరిస్థితులు. 2013లో ఎతిహాద్‌కు 24 శాతం వాటాల విక్రయం. డీల్‌ విలువ 379 మిలియన్‌ డాలర్లు. 
►   గడిచిన పదేళ్లలో ఎనిమిది సంవత్సరాలు నష్టాలు. 2015లో 22.5 శాతంగా ఉన్న మార్కెట్‌ వాటా 2018 నాటికి 15.5 శాతానికి పడిపోయింది.  
►2018 మార్చి నుంచి తాజాగా మరో సంక్షోభం మొదలు. ఉద్యోగుల జీతాల చెల్లింపుల్లో జాప్యాలు, టాప్‌ మేనేజ్‌మెంట్‌ జీతభత్యాల్లో 25 శాతం దాకా కట్‌. గడిచిన ఏడాది కాలంగా సంస్థ మార్కెట్‌ విలువ 60 శాతం పైగా హరించుకుపోయింది. రుణదాతలకు దాదాపు రూ. 8,000 కోట్లకు పైగా బాకీపడింది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో మరింత ముదిరిన సంక్షోభం. 100కు పైగా విమానాలు నిలిచిపోయాయి. 
►ఈ ఏడాది తొలినాళ్ల నుంచి ఆర్థిక పరిస్థితులు మరింతగా దిగజారాయి. కంపెనీ బోర్డు నుంచి వ్యవస్థాపకుడు నరేష్‌ గోయల్‌ తప్పుకున్నారు. బ్యాంకు యాజమాన్యాన్ని బ్యాంకులు తమ చేతుల్లోకి తీసుకున్నాయి. సంస్థలో 75 శాతం దాకా వాటాలను విక్రయించేందుకు బిడ్స్‌ ఆహ్వానించాయి. కార్యకలాపాలు కొనసాగించేందుకు రూ. 1,500 కోట్లు సమకూర్చే ప్రతిపాదనలు చేశాయి. వీటిని అందించడంపైనే మల్లగుల్లాలు పడిన బ్యాంకులు చివరికి అత్యవసరంగా కావాల్సిన నిధులను ఇచ్చేందుకు ససేమిరా అన్నాయి. ప్రస్తుతం కంపెనీలో ఎస్‌బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్షియంకు 51 శాతం, నరేష్‌ గోయల్‌కు 24 శాతం, ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌కు 12 శాతం వాటాలు ఉన్నాయి.  
►ఒకప్పుడు 120 పైగా విమానాలు ఉండేవి. కానీ అద్దెలు కట్టకపోవడంతో లీజుకిచ్చిన సంస్థలు పలు విమానాలను నిలిపివేయడంతో ప్లేన్స్‌ సంఖ్య 5కి పడిపోయింది. ఉద్యోగులకు జీతభత్యాలు నిల్చిపోయాయి. జెట్‌ సంక్షోభంతో విమాన చార్జీలు భారీగా పెరుగుతున్నాయి. స్వయంగా ప్రధాని కార్యాలయం, పౌర విమానయాన శాఖ పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. 

అయిదేళ్లలో ఏడో సంస్థ.. 
దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నా ఆర్థిక సంక్షోభం, తీవ్ర పోటీ ధాటికి పలు విమానయాన సంస్థలు కుప్పకూలుతున్నాయి. గడిచిన అయిదేళ్లలో ఎయిర్‌ పెగాసస్, ఎయిర్‌ కోస్టా, ఎయిర్‌ కార్నివాల్, ఎయిర్‌ డెక్కన్, ఎయిర్‌ ఒడిశా, జూమ్‌ ఎయిర్‌ మూతబడ్డాయి. తాజాగా ఈ జాబితాలో ఏడో సంస్థగా జెట్‌ ఎయిర్‌వేస్‌ కూడా చేరుతోంది. అంతక్రితం 1987లో వాయుదూత్, 1996లో ఈస్ట్‌ వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌.. మోదీలుఫ్త్, 1997లో దమానియా ఎయిర్‌వేస్, ఎన్‌ఈపీ, 2000లో అర్చనా ఎయిర్‌వేస్‌ మూతబడ్డాయి.

ఎయిర్‌లైన్‌ కర్మ: మాల్యా.. 
జెట్‌ ఎయిర్‌వేస్‌ పరిస్థితిపై మూతబడిన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ మాజీ ప్రమోటర్‌ విజయ్‌ మాల్యా స్పందించారు. కంపెనీకి సంఘీభావం ప్రకటించారు. ప్రైవేట్‌ విమానయాన సంస్థల కష్టాలకు కేంద్రమే కారణమని ధ్వజమెత్తారు.  ప్రభుత్వ రంగ ఎయిరిండియాకు వేల కోట్ల ప్రజాధనమిచ్చి గట్టెక్కిస్తోంది కానీ .. ప్రైవేట్‌ ఎయిర్‌లైన్స్‌పై మాత్రం పక్షపాతం చూపిస్తోందని ఆరోపించారు. ‘కింగ్‌ఫిషర్‌కు జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రధాన పోటీదారు అయినప్పటికీ.. అంత పెద్ద సంస్థ మూసివేత పరిస్థితుల్లోకి జారిపోవడం చూస్తే నాకు బాధేస్తోంది. ఎయిరిండియాను కాపాడేందుకు కేంద్రం రూ. 35,000 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చిస్తోంది. ప్రైవేట్‌ రంగ సంస్థలను మాత్రం వదిలేస్తోంది. అప్పట్లో నేను భారీ పెట్టుబడులు పెట్టిన కింగ్‌ఫిషర్‌ దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థగా ఎదిగింది. అవార్డులూ అందుకుంది.  బ్యాంకుల నుంచి కూడా కింగ్‌ఫిషర్‌ రుణాలు తీసుకున్న సంగతి వాస్తవమే. నేను 100 శాతం చెల్లించేస్తానంటున్నా నాపై క్రిమినల్‌ కేసులు పెడుతున్నారు. ఇదంతా ఎయిర్‌లైన్‌ కర్మ అనుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి‘ అని మాల్యా వ్యాఖ్యానించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement