ముంబై : మేం కూడా సాధరణ మనుషులమే. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు చాలా ఒత్తిడికి గురవుతాం. కానీ ఒక్కసారి కాక్‌పిట్‌లో ప్రవేశించామంటే.. అన్ని సమస్యలను పక్కన పెట్టేస్తాం. అలా చేయకపోతే ప్రయాణికుల భద్రతను పణంగా పెట్టిన వారిగా మిగిలిపోవాల్సి వస్తుందంటున్నారు జెట్ ఎయిర్‌వేస్ సీనియర్ కమాండర్ ఒకరు. దేశీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ తీవ్ర ఆర్థిక సంక్షభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. నాలుగు నెలలుగా ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడం లేదని సమాచారం.
ఈ విషయం గురించి గత 20 ఏళ్లుగా జెట్ ఎయిర్‌వేస్ సంస్థలో బోయింగ్ 7777 కమాండర్‌గా పనిచేస్తున్న కరణ్ చోప్రా మాట్లాడుతూ.. ‘మేం కూడా అందరి లాంటి వాళ్లమే. నాలుగు నెలలుగా జీతాలు అందడం లేదు. ఇల్లు గడవడం కోసం మా అమ్మ నగలను కుదవపెట్టాను. ఆర్థిక ఇబ్బందులు మనిషిని ఎంత కుంగదీస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒత్తిడిని మేం కాక్‌పిట్ బయటే వదిలేసి వెళ్తాం. అలా చేయకపోతే ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేసిన వారిగా మిగులుతాం’ అని తెలిపారు. అంతేకాక మిగితా ఉద్యోగాలతో పోలిస్తే.. దీనికి చాలా ఏకాగ్రత, ప్రశాంతమైన మనసు అవసరం అని చెప్పుకొచ్చారు.
ఏప్రిల్ 1 లోగా ఈ సమస్యకు పరిష్కారం చూపకపోయినా.. జీతాలు ఇవ్వకపోయిన నిరవధిక సమ్మెకు దిగుతాం అని తెలిపారు. మరో సీనియర్ కమాండర్ మాట్లాడుతూ.. ‘ఒక వేళ జెట్ ఎయిర్‌వేస్ ఈ సంక్షభం నుంచి బయటపడకపోతే.. దాదాపు 1500 మంది ఉద్యోగులు వీధిన పడాల్సి వస్తుంది. ప్రసుత్తం మార్కెట్‌లో ఇన్ని ఖాళీలు కూడా లేవు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఈ విషయంలో ఎవరి మీద నిందలు వేయడం సరికాదు’ అని పేర్కొన్నారు.
జెట్ ఎయిర్‌వేస్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలిసిందే. కంపెనీ రుణ చెల్లింపుల్లో డిఫాల్ట్ అవుతూ వస్తోంది. చాలా వరకు విమానాలను నడపకుండా నిలిపివేసింది. వేతనాల చెల్లింపుల్లోనూ జాప్యం అవుతోంది. కంపెనీలో ప్రధాన వాటాదారైన ఎతిహాద్ ఎయిర్‌వేస్ కూడా జెట్ ఎయిర్‌వేస్ నుంచి తప్పుకోవాలని చూస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment