
దొంగ ‘దాతృత్వ’ సంస్థలపై ఐటీ కన్ను
న్యూఢిల్లీ: దాతృత్వం(చారిటీ) ముసుగులో ఆదాయపు పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందే అక్రమ సంస్థలను గుర్తించాలని ఐటీ శాఖను ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) ఆదేశించింది. ఇందుకు సంబంధించి పటిష్ట ఆధారాలను సంపాదించాలని, చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఇలాంటి అక్రమ చారిటీ సంస్థల వల్ల ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయ నష్టం జరుగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నిజానికి అక్రమ చారిటీ సంస్థలు ఏవి? సక్రమంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న చారిటీల ఏవి? అన్న విషయాన్ని నిర్థారించుకోవడం కష్టమే అయినా... దీనికి ఒక సవాలుగా పన్ను అధికారులు స్వీకరించాలని సీబీడీటీ సూచించింది. వ్యత్యాసాన్ని గుర్తించడంలో అధికారులందరూ తమ అనుభవాలను వినియోగించుకోవాలని తెలిపింది.