మాల్యాను అరెస్ట్ చేయాలి
డీఆర్‌టీకి ఎస్‌బీఐ పిటిషన్
ముంబై: రుణాల ఎగవేతకు గాను వ్యాపారవేత్త, యూబీ గ్రూప్ ప్రమోటరు విజయ్ మాల్యా అరెస్టును కోరుతూ ఎస్‌బీఐ.. డెట్ రికవరీ ట్రిబ్యునల్‌ను (డీఆర్‌టీ) ఆశ్రయించింది. అలాగే ఆయన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాలని, డియాజియో నుంచి మాల్యాకు లభించే పరిహారం నిధులను ముందుగా తమకు దఖలుపర్చడంతో పాటు దేశవిదేశాల్లో ఆయనకున్న ఆస్తుల వివరాలన్నీ వెల్లడయ్యేలా ఆదేశించాలని కోరింది. ఈ మేరకు బెంగళూరులోని డీఆర్‌టీకి ఎస్‌బీఐ 4 పిటిషన్లు సమర్పించినట్లు ఎస్‌బీఐ వర్గాలు తెలిపాయి. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, దాని ప్రమోటరు మాల్యా.. ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియంకు రూ. 7,800 కోట్లు బకాయిపడటం తెలిసిందే. యునెటైడ్ స్పిరిట్స్ చైర్మన్ హోదా నుంచి వైదొలిగినందుకు డియాజియో నుంచి 75 మిలియన్ డాలర్లు పొంది, లండన్‌లో స్థిరపడాలని మాల్యా నిర్ణయించిన నేపథ్యంలో తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి.