న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణ ఉచ్చులో ఆర్‌బీఐ కూడా పడబోతోందా? అంటే అవుననే అనిపిస్తోంది. పీఎన్‌బీ స్కాం విషయంలో తొలిసారి ఆర్‌బీఐ అధికారులను కూడా సీబీఐ విచారిస్తోంది. నలుగురు సీనియర్ ఆర్‌బీఐ అధికారులను సీబీఐ ప్రశ్నిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. నలుగురు ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్‌ల్లో ముగ్గురు చీఫ్ జనరల్ మేనేజర్లు, ఒకరు జనరల్ మేనేజర్ ఉన్నారు. మోదీ, చౌక్సిలకు జారీచేసిన లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్(ఎల్‌ఓయూ) జారీచేయడం విషయం సెంట్రల్ బ్యాంకుకు తెలుసా? లేదా? అనే విషయంపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఎల్‌ఓయూ జారీ ప్రక్రియలో ఆడిటింగ్‌పై కూడా ప్రశ్నలు సంధిస్తున్నట్టు తెలుస్తోంది.
అదేవిధంగా నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సి సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా ఉన్న 80:20 గోల్డ్ ఇంపోర్ట్ స్కీమ్‌పై కూడా సీబీఐ విచారిస్తోంది. ఈ స్కీమ్ చౌక్సి, మోదీ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా ఉందని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఆరోపించిన సంగతి తెలిసిందే. 2014 మేలో ఆర్‌బీఐ ఈ స్కీమ్‌ను ప్రారంభించింది. పీఎన్‌బీలో ఈ కుంభకోణం చోటు చేసుకోవడానికి ప్రధాన కారణం ఆర్‌బీఐ సరియైన ఆడిట్ చేపట్టలేకపోవడమేనని సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి ఆరోపించారు. మరింత పటిష్టమైన ఆడిటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. కాగ, భారత దేశ బ్యాంకింగ్ చరిత్రలోనే పీఎన్‌బీ స్కాం అతిపెద్దది. రెండు జ్యువెల్లరీ గ్రూప్ అధినేతలు నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సిలు కలిసి పీఎన్‌బీలో దాదాపు రూ.13,500 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడిన వీరు, స్కాం బయట పడకముందే దేశం విడిచిపారిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment