స్పైస్‌జెట్ నుంచి మరో ఆఫర్.. రూ. 2,999కే టికెట్
న్యూఢిల్లీ: విమాన యాన సంస్థ స్పైస్‌జెట్ గురువారం వన్ స్టాప్ సేల్ పేరిట మరో ఆఫర్ ప్రకటించింది. దీని కింద రూ. 2,999కి విమాన టికెట్లను (అన్ని చార్జీలు సహా) అందిస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 22 దాకా చేసే ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఫిబ్రవరి 22 లోగా వీటిని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం దేశీ రూట్లలో ప్రయాణాలకే ఇది వర్తిస్తుంది.
మరోవైపు, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న స్పైస్‌జెట్‌లో ప్రమోటర్ అజయ్ సింగ్ మెజారిటీ వాటాలు కొనుగోలు చేసే ప్రతిపాదనకు కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కంపెనీలో 58 శాతం పైచిలుకు వాటాలు తీసుకునేందుకు ఆయనకు మార్గం సుగమమైంది.సీసీఐ ఆమోదం లభించిన తర్వాత తొలి దశలో రూ. 400 కోట్ల మేర నిధులు ఇన్వెస్ట్ చేయనున్నట్లు సింగ్ చెప్పారు.