ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020) ద్వితీయ త్రైమాసికంలో దిగ్గజ కంపెనీ ఏసీసీ ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో సిమెంట్ రంగ కౌంటర్లు వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. వెరసి ఏసీసీసహా అంబుజా, జేకే, రామ్‌కో, శ్రీ సిమెంట్ తదితర కౌంటర్లు భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. ఏసీసీ జనవరి-డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. ఈ నేపథ్యంలో ఏసీసీ క్యూ2 ఫలితాలతోపాటు.. సిమెంట్ రంగ షేర్ల జోరు వివరాలు చూద్దాం..
ఏసీసీ ఫలితాలు
ఈ ఏడాది క్యూ2(ఏప్రిల్-జూన్)లో ఏసీసీ సిమెంట్ నికర లాభం 41 శాతం క్షీణించి రూ. 271 కోట్లకు పరిమితమైంది. ఇందుకు లాక్‌డవున్ ప్రభావం చూపగా.. నికర అమ్మకాలు సైతం 38 శాతం తక్కువగా రూ. 2520 కోట్లకు చేరాయి. అయితే నిర్వహణ లాభ మార్జిన్లు 1.56 శాతం బలపడి 20.8 శాతాన్ని తాకాయి. ఏప్రిల్ నెలలో దాదాపు అమ్మకాలు నిలిచిపోయినప్పటికీ మే, జూన్ నెలల్లో సిమెంట్ విక్రయాలలో పటిష్ట రికవరీ కనిపించినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమయంలో సరఫరా సౌకర్యాలను మెరుగుపరచడంతోపాటు, వ్యయాలను తగ్గించుకోవడంపై యాజమాన్యం దృష్టిసారించడంతో ఇకపై మెరుగైన ఫలితాలు సాధించే వీలున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు.
షేర్ల స్పీడ్
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఏసీసీ 5 శాతం జంప్‌చేసి రూ. 1397 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1424కు ఎగసింది. అంబుజా సిమెంట్స్ 5.5 శాతం పెరిగి రూ. 207ను తాకగా.. జేకే సిమెంట్ 5 శాతం లాభపడి రూ. 1500కు చేరింది. తొలుత రూ. 1512 వద్ద 52 వారాల గరిష్టాన్ని అందుకుంది. ఈ బాటలో తొలుత రూ. 696 వరకూ ఎగసిన రామ్‌కో సిమెంట్ 2.25 శాతం పుంజుకుని రూ. 690 వద్ద ట్రేడవుతోంది. అల్ట్రాటెక్ 1.4 శాతం లాభంతో రూ. 3916 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 3,955 వరకూ ఎగసింది. ఇదే విధంగా శ్రీ సిమెంట్ తొలుత రూ. 22,810 వరకూ ఎగసింది. ప్రస్తుతం 2 శాతం లాభంతో రూ. 22,634 వద్ద కదులుతోంది. ఇతర కౌంటర్లలో ఇండియా సిమెంట్స్ 2.3 శాతం పురోగమించి రూ. 122 వద్ద, బిర్లా కార్పొరేషన్ 2 శాతం బలపడి రూ. 575 వద్ద, హీడెల్‌బర్గ్ 1.5 శాతం పుంజుకుని రూ. 179 వద్ద ట్రేడవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment