న్యూఢిల్లీ: ఏజీఆర్ బాకీల భారంతో సంక్షోభంలో చిక్కుకున్న టెలికం రంగానికి సత్వరం ఊరటనిచ్చే చర్యలపై కేంద్రం దృష్టి సారించింది. కేంద్ర టెలికం శాఖ, ఇతర కీలక శాఖల సీనియర్ అధికారులు ఆదివారం దీనిపై అత్యవసరంగా సమావేశమయ్యారు. దాదాపు గంటకుపైగా సాగిన సమావేశంలో నీతి ఆయోగ్, ఆర్థిక శాఖ అధికారులు కూడా పాల్గొన్నట్లు సమాచారం. టెలికం పరిశ్రమకు తోడ్పాటు అందించేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలపైనా ఇందులో చర్చించినట్లు తెలుస్తోంది. సవరించిన స్థూల ఆదాయ (ఏజీఆర్) లెక్కల ప్రకారం లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల కింద కేంద్రానికి టెలికం సంస్థలు సుమారు రూ. 1.47 లక్షల కోట్లు కట్టాల్సి ఉందని అంచనా. ఇందులో దాదాపు 60 శాతం పైగా భాగం ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలదే ఉంది. బాకీల చెల్లింపులో జాప్యంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో టెల్కోలు కొంత భాగాన్ని ఇప్పటికే జమ చేశాయి. అయితే, ఈ బాకీలు తమపై తీవ్ర భారం మోపుతాయని టెలికం సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై ఎయిర్‌టెల్ చీఫ్ సునీల్ మిట్టల్, వొడాఫోన్ ఇండియా చైర్మన్ కుమార మంగళం బిర్లా.. గతవారం కేంద్ర ప్రభుత్వ వర్గాలతో ముమ్మరంగా చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో తాజాగా అత్యున్నత స్థాయి సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. (చదవండి : టెల్కోలకు మరిన్ని కష్టాలు)
లెక్కింపు విధానం స్థిరంగా ఉండాలి: సీవోఏఐ
ఏజీఆర్ బాకీల విషయంలో వ్యత్యాసాలు రాకుండా .. లెక్కింపు విధానం సర్కిళ్లవారీగా మారిపోకుండా స్థిరంగా ఉండేలా టెలికం శాఖ చూడాలని టెల్కోల సమాఖ్య సీవోఏఐ అభిప్రాయపడింది. ఏజీఆర్ బాకీల వసూలు కోసం టెల్కోల బ్యాంక్ గ్యారంటీలను కేంద్రం స్వాధీనం చేసుకుంటే .. అది పరిశ్రమ మనుగడకే ముప్పుగా పరిణమిస్తుందని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ వ్యాఖ్యానించారు. బకాయిల లెక్కింపులో తేడాలేమైనా ఉన్నాయేమో పరిశీలించేందుకు టెలికం శాఖ ప్రతిపాదించిన ’టెస్ట్ చెక్’ విధానం సాధారణంగా జరిగే ఆడిటింగ్ ప్రక్రియేనని ఆయన తెలిపారు. (టెల్కోలకు మరోషాక్: డాట్ డెడ్‌లైన్)
Comments
Please login to add a commentAdd a comment