న్యూఢిల్లీ: అత్యవసర రుణ వితరణ హామీ పథకం కింద (ఈసీఎల్‌జీఎస్) సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) రూ.3 లక్షల కోట్ల మేర రుణాల మంజూరును వేగవంతం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులను కోరారు. ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులతో ఆమె మంగళవారం ఈ పథకంపై సమీక్ష నిర్వహించారు. కరోనా కారణంగా లాక్‌డౌన్ వల్ల ఎంఎస్‌ఎంఈ రంగం తీవ్ర సంక్షోభ పరిస్థితులను చవిచూస్తుండడంతో.. కేంద్ర ప్రభుత్వం వాటిని ఆదుకునేందుకు రూ.3లక్షల కోట్ల మేర హామీ లేని రుణాలను మంజూరు చేసేందుకు ఈసీఎల్‌జీఎస్ పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ‘‘ఈసీఎల్‌జీఎస్ కింద రూ.20,000 కోట్ల రుణాలను మంజూరు చేసిన ప్రభుత్వరంగ బ్యాంకులను ఆర్థిక మంత్రి సీతారామన్ అభినందించారు. బ్యాంకు శాఖల స్థాయిలో రుణ వితరణను పెంచడంతోపాటు ఇందుకు సంబంధించిన ప్రక్రియలు సులభంగా ఉండేలా చూడాలని సూచించారు’’ అంటూ కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అంతకుముందు ఆర్థిక మంత్రి జూన్ 8 నాటికి ప్రభుత్వరంగ బ్యాం కుల రుణ వితరణ గణాంకాలను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment