ముంబై: ఆర్‌బీఐ స్వతంత్రతను కాపాడటంతోపా టు విశ్వసనీయత, సమగ్రతను నిలబెట్టే ప్రయత్నం చేస్తానని నూతన గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టంచేశారు. ప్రభుత్వంతో పాటు ఆయా అంశాలతో ముడిపడి ఉన్న ప్రతి భాగస్వామి అభిప్రాయాన్నీ పరిగణనలోకి తీసుకుంటానని, ఆయా అంశాల పరిష్కారానికి సంప్రతింపుల విధానాన్ని అనుసరిస్తానని చెప్పారు. ఆధునికతతో కూడిన నేటి కాలంలో నిర్ణయ ప్రక్రియలో సంక్లిష్టతల దృష్ట్యా భాగస్వాములతో సంప్రతించడమనేది ఆర్‌బీఐ ప్రాథమిక నిర్వహణలో భాగమన్నారు. ఉర్జిత్ పటేల్ ఆకస్మిక రాజీనామాతో ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి శక్తికాంత దాస్‌ను కేంద్ర ప్రభుత్వం మంగళవారం నియమించిన విషయం తెలిసిందే. దీంతో ఆర్‌బీఐ 25వ గవర్నర్‌గా శక్తికాంతదాస్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ‘‘ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించాను. శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఆర్థిక వ్యవస్థకు అవసరమైన చర్యలను క్రమానుగతంగా చేపడతానని వెల్లడించారు. ముందుగా ప్రభుత్వరంగ బ్యాంకుల సారథులతో భేటీ అవుతానని చెప్పారు. కొత్త బాధ్యతలు స్వీకరించిన అనంతరం శక్తికాంత్ దాస్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఆర్‌బీఐ ఓ గొప్ప సంస్థ. సుదీర్ఘకాల ఘనమైన వారసత్వం ఉంది. ఈ సంస్థ స్వతంత్రతను, గుర్తింపును, విశ్వసనీయత, విలువలు, సమగ్రతలను కాపాడేందుకు నా శక్తివంచన లేకుండా కృషి చేస్తా. అవి చెక్కు చెదరవని నేను భరోసా ఇస్తున్నాను’’ అని దాస్ చెప్పారు. ప్రభుత్వంపై దేశాన్ని నడిపించే బాధ్యత ఉందని, కేంద్ర బ్యాంకు కూడా ఇందుకు జవాబుదారీయేనని చెప్పారాయన. తద్వారా ప్రభుత్వ అభిప్రాయాలకు విలువ ఉంటుందని చెప్పినట్టయింది. ఉర్జిత్ పటేల్, కేంద్ర ప్రభుత్వానికి మధ్య పలు అంశాలపై విభేదాలే ఆయన రాజీనామాకు దారి తీసిందన్న అభిప్రాయాలున్న విషయం తెలిసిందే.
సంప్రతింపులు కొనసాగాలి...
ప్రభుత్వంతో విభేదాలు ఉర్జిత్ పటేల్ రాజీనామాకు దారితీశాయా? అన్న దానిపై మీడియా సమావేశంలో దాస్ ప్రశ్నలు ఎదుర్కొన్నారు. ‘‘ఆర్‌బీఐ, ప్రభుత్వం మధ్య ఉన్న ఆ అంశాల జోలికి నేను వెళ్లను. కానీ, ప్రతి వ్యవస్థా తన స్వయంప్రతిపత్తిని నిలుపుకోవాలి. విశ్వసనీయతకు కట్టుబడి ఉండాలి’’ అని దాస్ బదులిచ్చారు. ఆర్‌బీఐ, ప్రభుత్వం మధ్య సంబంధాలు మూసుకుపోయాయా? అనేది తనకు తెలియదంటూ... భాగస్వాముల మధ్య సంప్రతింపులు కొనసాగాలని అభిప్రాయపడ్డారు. ‘‘ప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య పారదర్శకమైన, స్వేచ్ఛతో కూడిన చర్చ జరగాలి. అన్ని అంశాలు, వివాదాస్పదమైనవి కూడా సంప్రతింపుల ద్వారా పరిష్కారం అవుతాయని నేను నమ్ముతాను’’ అని దాస్ చెప్పారు. ద్రవ్యోల్బణ లక్ష్యం ముఖ్యమైన కర్తవ్యమన్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14న (శుక్రవారం) ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డు సమావేశం జరుగుతుందని స్పష్టం చేశారు.
నియంత్రణ సంస్థల స్వతంత్రత కాపాడాలి: రాజన్
ఆర్థిక రంగ నియంత్రణ సంస్థల స్వతంత్రతను కాపాడాల్సిన అవసరం ఉందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్, ప్రముఖ ఆర్థిక నిపుణుడు రఘురామ్ రాజన్ సైతం అభిప్రాయపడ్డారు. ఐదవ భారత ఆర్థిక సదస్సులో పాల్గొన్న ఆయన సైతం ఈ అంశంపై స్పందించారు. నియంత్రణ సంస్థలను మరింత పటిష్టం చేయాలన్నారు. మన వృద్ధి ఆరోగ్యంగా, నిలకడగా ఉండేందుకు గాను ఇవి స్వతంత్ర సంస్థలుగా కొనసాగాలని అభిప్రాయపడ్డారు.
దాస్ తగిన వారు: జైట్లీ
ఆర్‌బీఐ ఉన్నత పదవిని నిర్వహించేందుకు తగిన యోగ్యతలు శక్తికాంత దాస్‌కు ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఆయన పూర్తి స్థాయి నిపుణుడని, పలు ప్రభుత్వాలతో కలసి పనిచేశారని కితాబిచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థ ముందున్న సవాళ్ల విషయంలో ఆర్‌బీఐ గవర్నర్‌గా సమర్థంగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. ‘‘దాస్ చాలా సీనియర్. ఎంతో అనుభవం ఉన్న ప్రభుత్వాధికారి. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖలో పనిచేసిన కాలంలో ఎక్కువ కాలం ఆర్థిక అంశాల నిర్వహణనే చూశారు’’అని జైట్లీ పేర్కొన్నారు.
ఆర్‌బీఐ స్వతంత్రతపై రాజీవద్దు: అరవింద్
ఆర్‌బీఐకి ఉన్న స్వతంత్రత ఎంతో పవిత్రమైనదని, ఎట్టి పరిస్థితుల్లోనూ దాని పట్ల రాజీ పడరాదని కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ సూచించారు. ఐదవ భారత ఆర్థిక సదస్సులో భాగంగా ఆయన మాట్లాడారు. ‘‘ఆర్‌బీఐకి ఎంతో ప్రతిష్ట ఉంది. నిర్ణయాలు తీసుకోవడం, పరిపాలన పరంగా నిర్వహణపరమైన స్వయం ప్రతిపత్తి ఉంది. ఇది పూర్తిగా పవిత్రమైనది. దీని విషయంలో అస్సలు రాజీ పడకూడదు. ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ చేపట్టిన ఆర్థిక వ్యవస్థ సమగ్రతను నిలబెట్టే చర్యలు కొనసాగుతాయా? లేదా? అన్నది చూడాలి. అతిపెద్ద సంస్థలో ఏం జరుగుతుందో అంచనా వేసేందుకు ఇదొక కొలమానం అవుతుంది’’ అని సుబ్రమణియన్ చెప్పారు. ఉర్జిత్ పటేల్ సారథ్యంలో ఆర్‌బీఐ కచ్చితమైన దిద్దుబాటు కార్యాచరణ (పీసీఏ) వంటి అంశాల్లో సమర్థంగా పనిచేసిందన్నారు. ఎన్‌బీఎఫ్‌సీలు, ఐఎల్‌ఎఫ్‌ఎస్ విషయానికొస్తే ఆర్‌బీఐ కాస్త అత్యుత్సాహం ప్రదర్శించినట్టు అభిప్రాయపడ్డారు. ఆర్‌బీఐ వద్ద అధికంగా ఉన్న నిధులను ఎన్‌పీఏల సమస్యలను ఎదుర్కొంటున్న ప్రభుత్వరంగ బ్యాంకుల రీక్యాపిటలైజేషన్‌కు మాత్రమే వినియోగించుకోవాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బ్యాంకుల విషయంలో 2015లో జరిగినట్టే, ఎన్‌బీఎఫ్‌సీలకు సంబంధించి కూడా ఆస్తుల నాణ్యత మదింపు (ఏక్యూఆర్) అవసరమన్నారు. వీటిల్లో రిస్క్–రివార్డ్ రేషియో అధికంగా ఉందని, దీన్ని దగ్గరగా పరిశీలించాల్సి ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment