గ్లోబల్‌ ఎకానమీపైనే సీఈఓలకు నమ్మకం..! | CEOs believe in global economy | Sakshi
Sakshi News home page

గ్లోబల్‌ ఎకానమీపైనే సీఈఓలకు నమ్మకం..!

Published Tue, Jul 31 2018 1:16 AM | Last Updated on Tue, Jul 31 2018 1:16 AM

CEOs believe in global economy - Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపైనే తమకు నమ్మకం ఎక్కువగా ఉందని భారత కంపెనీలకు చెందిన చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ)లు వెల్లడించినట్లు ఆర్థిక సేవల సంస్థ కేపీఎంజీ తేటతెల్లం చేసింది. 125 మంది భారత సీఈఓలలో ఏకంగా 89 మంది తమకు గ్లోబల్‌ ఎకానమీపైనే అత్యంత ఎక్కువగా నమ్మకం ఉందని వెల్లడించగా, వీరిలో 69 మంది మాత్రం భారత ఆర్థిక వ్యవస్థపై ఆశావాదంతో ఉన్నట్లు చెప్పారని పేర్కొంది. ఏడాదికి ఒకసారి ’కేపీఎంజీ సీఈఓ అవుట్‌లుక్‌ రిపోర్ట్‌’ పేరిట నివేదికలను అందిస్తున్న ఈ సంస్థ.. తాజాగా రూపొందించిన నాలుగవ నివేదికలో ఈ విషయాలను బయటపెట్టింది.

భౌగోళిక విస్తరణలో అత్యధిక ప్రాధాన్యత అభివృద్ధి చెందుతున్న దేశాలదే అని సీఈఓలు భావిస్తున్నట్లు నివేదికలో పేర్కొన్న ఈ ఆర్థిక సేవల సంస్థ.. ఇదే సమయంలో భూగోళిక రాజకీయ అస్థిరత కారణంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొందని వీరు వెల్లడించినట్లు తెలిపింది. 36 శాతం మంది సీఈఓలు ఇదే అంశంపై జాగ్రత్త ధోరణిలో ఉన్నట్లు వివరించింది. కంపెనీ కార్యకలాపాల విస్తరణలో భాగంగా ఈ మాత్రం జాగ్రత్త వైఖరి సీఈఓలకు తప్పదని కేపీఎంజీ ఇండియా చైర్మన్‌ అరుణ్‌ ఎం కుమార్‌ వ్యాఖ్యానించారు. ‘తమ సంస్థల అభివృద్ధికి ప్రాదేశిక వాదం ముప్పుకానుందని 66 శాతం మంది సీఈఓలు భావిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీరు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ బాట పట్టాల్సిందే. భవిష్యత్‌ అవకాశాల కోసం ఈ నిర్ణయం తప్పదు. బ్రెగ్జిట్‌ అంశాన్ని సీఈఓలు ఒక వ్యాపార అవకాశంగానే చూస్తున్నారు.’ అని వెల్లడించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement