బీమాయే చేస్తే.. | Changing dangerous, "Miss Selling ' | Sakshi
Sakshi News home page

బీమాయే చేస్తే..

Published Mon, Jun 29 2015 4:49 AM | Last Updated on Sun, Sep 3 2017 4:32 AM

బీమాయే చేస్తే..

బీమాయే చేస్తే..

♦ ప్రమాదకరంగా మారుతున్న ‘మిస్ సెల్లింగ్’
♦ ఆ మాయలో పడకుండా ముందు జాగ్రత్త అవసరం
♦ పాలసీలోని అంశాలు ముందే చూసుకోవాలి
♦ లేదంటే ఫ్రీ-లుక్ పీరియడ్‌లో రిటర్న్ చేయొచ్చు
♦ ఫ్రీ-లుక్ సమయం దాటితే మాత్రం అంతే సంగతి

 
 ఏజెంట్ ఏదో చెబుతాడు. ఫోన్లలో మార్కెటింగ్ ప్రతినిధులు మరేదో చెబుతారు. మొత్తానికి అంతా కలిసి మన అవసరానికి మేకప్ వేస్తారు. దానికి బోలెడన్ని హంగులు జోడిస్తారు. అందమైన ఇన్సూరెన్స్ పాలసీగా తయారు చేస్తారు. తీరా డబ్బులు కట్టి పాలసీ చేతిలోకి తీసుకున్నాక... అది మీ అవసరానికి సరిపోనిదైతే పరిస్థితేంటి? మీకు అక్కర్లేని ఏ పాలసీనో మీకు అంటగట్టి ఉంటే మీరేం చేయాలి? అలాంటి సమయాల్లో మీకున్న హక్కులేంటి? అసలు పాలసీ రద్దు చేసుకోవటానికి అవకాశం ఉందా? రద్దు చేసుకుంటే పాలసీకి కట్టిన సొమ్ము తిరిగి వెనక్కి వస్తుందా? ఇవన్నీ వివరించేదే ఈ ప్రత్యేక కథనం...
 
 మనలో చాలామందికి బీమా పాలసీ తీసుకున్నాక... అరె! ఇదెందుకు తీసుకున్నామా? అని అనిపించే సందర్భం ఒక్కటైనా జరిగి ఉంటుంది. మనకు చెప్పినదానికన్నా ప్రీమియం ఎక్కువ కావటమో, లేక చె ప్పిన రీతిలో అంత ఎక్కువ సొమ్ము చేతికి రాకపోవటమో ఏదో ఒకటి జరగటం చూస్తూనే ఉన్నాం. దీన్నే బీమా పరిభాషలో ‘మిస్ సెల్లింగ్’గా వ్యవహరిస్తున్నారు. ఈ మిస్ సెల్లింగ్ అనేది ఇటీవల ఎంతలా పెరిగిపోయిందంటే... చివరకు ఐఆర్‌డీఏ కూడా దీన్ని ప్రస్తావించాల్సి వస్తోంది. అందుకే అక్కర్లేని పాలసీ తమకు అంటగట్టకుండా వినియోగదారులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

 ప్రీమియం చూసుకోవాలి
 ఎక్కువమంది చేసే ఫిర్యాదేమిటంటే ప్రీమియం చెల్లింపు వ్యవధి గురించి. చాలామందికి అది ఒకేసారి చెల్లిస్తే సరిపోయే పాలసీ అని చెప్పటం... కానీ చివరికి పలుమార్లు ప్రీమియం చెల్లించాల్సి రావటం జరుగుతోంది. మరో ఫిర్యాదు... హోమ్‌లోన్‌తోనో, వ్యక్తిగత రుణంతోనో కలిపి ఇచ్చే బీమా పాలసీని సేవింగ్స్‌గా భావించకూడదు. అది టెర్మ్ పాలసీ. అంటే ఆ రుణం తీరేదాకానే దాని రక్షణ ఉంటుంది. అంతేతప్ప దాన్నుంచి మనకు చివరకు డబ్బులొస్తాయని మాత్రం ఆశించొద్దు.

దీనిపై ఓ బీమా సంస్థ ఉన్నతాధికారిని సంప్రదించగా... ‘‘ఔను నిజమే! అందుకే మీరు చెల్లిస్తున్న ప్రీమియం, పాలసీ బాండ్లో పేర్కొన్న ప్రీమియం ఒకటేనా కాదా అనేది మొదట చూసుకోవాలి. అలాగే ఇల్లు వంటి ఆస్తి కొనుగోలు చేసేటపుడు దానికి రక్షణగా ఇచ్చే బీమా పాలసీని గమనించాలి. పొదుపు కోసమంటూ ఆ పాలసీకి అదనపు హంగులు జోడిస్తే తీసుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే ఒక ఆస్తికి రక్షణగా బీమా తీసుకోవాలి తప్ప మరో ఆస్తి బీమా రూపంలో అక్కర్లేదు’’ అని వ్యాఖ్యానించారు.

మెచ్యూరిటీ తేదీ, బీమా చేసిన వ్యక్తి వయసు కరెక్ట్‌గా ఉన్నాయో లేదో పాలసీ తీసుకునేటపుడే చూసుకోవాలి. ఉదాహరణకు పాలసీ వ్యవధి పదేళ్లుగా ఉండి, పాలసీదారు వయసు 45 ఏళ్లనుకోండి. మెచ్యూరిటీ 60 ఏళ్లకు ఇస్తామనే షరతు ఉంటే.. ఆ పాలసీ క్లెయిమ్ చెల్లదు.

కొన్నిసార్లు పాలసీదారు అడిగినదానికి బదులు తనకు కమిషన్ ఎక్కువగా వస్తుందనో, వైద్య పరీక్షలుండవనో ఏజెంట్ మరో పాలసీని ఇవ్వటం కొత్తేమీ కాదు. పాలసీదారు ఇది తెలుసుకునేటప్పటికే రెండుమూడు ప్రీమియంలు చెల్లించేసి ఉంటారు. అందుకని పాలసీ ఇల్లస్ట్రేషన్ చూడాలి. దాన్లో పాలసీ ఛార్జీలకింద ఎంత పోతాయో ఉంటుంది. దాన్నిబట్టి కమీషన్లు గట్రా ఎంతున్నాయో తెలిసిపోతుంది. మరీ ఎక్కువ ఛార్జీలుంటే మానేయొచ్చు.

‘‘పాలసీ పేరు, మీ వయసు, పాలసీ వ్యవధి మీ ఎదురుగానే నింపేలా చూసుకోవాలి. లేనిపక్షంలో ఫ్రీ-లుక్ పీరియడ్‌లో మీకొచ్చే వెరిఫికేషన్ కాల్‌లో అన్ని వివరాలూ చెక్ చేసుకోవాలి. అందుకే పాలసీ కాపీ, ఇల్లస్ట్రేషన్ కాపీ మీ దగ్గర ఉంచుకోవటం ముఖ్యం. మరో ముఖ్యమైన విషయమేంటంటే చాలామంది పన్ను ఆదా చేసుకోవటానికి బీమా తీసుకుంటారు.  రూ.2,500 మిగులుతుందని రూ.25వేలు కడతారు. తీరా చూస్తే కవరేజీ ఏ 3 లక్షలకో ఉంటుంది. అదే డబ్బుతో రూ.2 కోట్ల బీమా పాలసీ తీసుకోవచ్చని వారు గుర్తించాలి’’ అనేది బీమా నిపుణుల సలహా. అందుకే ఈ విషయంలో పాలసీదారు- ఏజెంట్ మధ్య మాటల్లో తేడాలుండకూడదంటారు బిగ్ డెసిస్టన్స్ డాట్ కామ్ సీఈఓ మనీష్ షా.

 ‘‘అందుకే ఇపుడు చాలా బీమా కంపెనీలు సూటబిలిటీ మ్యాట్రిక్స్ ప్రొఫైల్‌ను వాడుతున్నాయి. దీంతో పాలసీదారు ప్రొఫైల్ తెలుస్తుంది. ఏజెంటు తనకు అవసరమైన బీమానే అమ్మాడా? లేదా? అన్నది కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే అవసరానికి తగ్గ పాలసీనే ఏజెంటు విక్రయించాలి. అందుకోసం తను పాలసీదారును రకరకాల ప్రశ్నలడగాలి’’ అని హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ వైస్ ప్రెసిడెంట్ సుజయ్ మన్నా చెప్పారు. పాలసీదారుకు పదేళ్ల తరవాత డబ్బు అవసరమయ్యే పక్షంలో ఏజెంటు ఐదేళ్ల వ్యవధి గల పాలసీ అమ్మటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. మనం తీసుకుంటున్న పాలసీపై సరైన అవగాహన లేనపుడు ఎవరో ఒకరిని పాలసీ తీసుకునే ముందు సంప్రదించటం ఉత్తమమని చెప్పారాయన.
 
 ఫ్రీ-లుక్ పీరియడ్‌ను మర్చిపోవద్దు
 బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏ... పాలసీదార్లు మోసపోకుండా ఉండేందుకు ఫ్రీ-లుక్ పీరియడ్‌ను అందుబాటులోకి తెచ్చింది. మీ పాలసీ కవరేజీ ఆరంభమైన 15 రోజుల పాటు ఇది అమల్లో ఉంటుంది. ఈ సమయంలో గనక మీకు అక్కర్లేని పాలసీ ఇచ్చారని భావించినా, వ్యవధి- ప్రీమియం సహా ఏ అంశంలోనైనా మిమ్మల్ని మోసం చేశారని గ్రహించినా ఆ పాలసీని వెనక్కి తిరిగి ఇచ్చేయొచ్చు. అలా ఇచ్చేస్తే మీరు మెచ్యూరిటీ వరకూ దాన్ని కట్టాల్సిన బాధ తప్పటమే కాదు.

మీరు చెల్లించిన సొమ్ము కూడా మీకు తిరిగి వచ్చేస్తుంది. ఖర్చుల కోసం నామమాత్రపు మొత్తాన్ని మాత్రం మినహాయించుకుంటారు. ఈ 15 రోజలు దాటితే మాత్రం మీరు చెల్లించిన ప్రీమియం వెనక్కి రాదని గుర్తుంచుకోవాలి. అందుకే మోసంతో అంటగట్టిన పాలసీలు వెనక్కి ఇవ్వకుండా పాలసీదారును తొలి 15-20 రోజుల పాటు మాయమాటలతో మభ్యపెడుతూనే ఉంటాయి దాన్ని విక్రయించిన ఏజెన్సీలు. తస్మాత్ జాగ్రత్త!!.

గ్రేస్ రాజాకు జరిగిన మోసమిది...
 ఇది రెండు నెలల కిందట జరిగిన వ్యవహారం. హైదరాబాద్‌లోని ఓ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్న గ్రేస్‌రాజాకు ఒకరోజు ఫోనొచ్చింది. అవతలి నుంచి ఓ బీమా కంపెనీ ఎగ్జిక్యూటివ్‌నంటూ పరిచయం చేసుకుంది ఓ అమ్మాయి. ప్రస్తుతం ఓ ఆఫర్ నడుస్తోందని, బీమా పాలసీ తీసుకుంటే 32 అంగుళాల ఎల్‌ఈడీ టీవీ ఫ్రీగా ఇస్తామని చెప్పింది. తను మొదట నమ్మలేదు. మళ్లీ ఫోన్ చేసి... తమ టార్గెట్ గడువు ముగుస్తోందని, అందుకే ఇలా ఇస్తున్నామని నమ్మబలికింది. తరవాత వాళ్ల మేనేజరు, మరో ఎగ్జిక్యూటివ్ కూడా ఫోన్ చేసి ఇదే చెప్పటంతో తను నమ్మాడు. తను ఓకే అనటంతో సోమాజిగూడలోని మరో ఏజెన్సీ రంగంలోకి దిగింది. అంతా నిజమేననుకున్నాడు.

ఫలితం... భారీ ప్రీమియంతో తనకు అక్కరకు రాని ఓ పాలసీని అంటగట్టారు. పెపైచ్చు చేతికి పాలసీ వచ్చింది తప్ప టీవీ రాలేదు. వాళ్ల కాల్స్ రికార్డు కూడా చేసిన గ్రేస్‌రాజా... ఫిర్యాదు చేస్తానని చెప్పాడు. నిజానికి ఏ పాలసీకైనా 15 రోజుల పాటు ఫ్రీ-లుక్ పీరియడ్ ఉంటుంది. ఆ సమయంలో గనక తను అడిగిన పాలసీ ఇవ్వలేదని గ్రహిస్తే దాన్ని వెనక్కిచ్చేసే అవకాశం ఉంటుంది. గ్రేస్‌రాజా అదే చేద్దామనుకున్నాడు. కానీ సదరు ఏజెన్సీ... అదిగో టీవీ వస్తోంది, ట్రాన్స్‌పోర్ట్‌లో ఉంది... మీ భార్య బర్త్‌డే రోజు సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా ఇద్దామనుకుంటున్నాం.. అంటూ రకరకాల కథలు చెప్పింది.

ఇంతలో ఫ్రీ-లుక్ పీరియడ్ ముగిసింది. ఏజెన్సీ ప్రతినిధులు  ముఖం చాటేశారు. ఎవరికి చెప్పినా, కాల్ రికార్డులతో సహా ఫిర్యాదు చేసినా నో యాక్షన్. మరో చిత్రమేంటంటే సోమాజిగూడలోని సదరు అసోసియేట్స్ పేరు ఒక్కసారి నెట్‌లో సెర్చ్ చేసి చూస్తే... వారి చేతిలో తామూ మోసపోయామంటూ వందల కొద్దీ ఫిర్యాదులు. ఇవన్నీ చూసి గ్రేస్ రాజాకు మతిపోయినంత పనయింది. ఈ ఒక్క ఏజెన్సీ నిర్వాకంతో తనకు బీమా వ్యవస్థమీదే నమ్మకం పోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement