ధాన్యం సేకరణ ఇక సమష్టి బాధ్యత
ఏలూరు : నూతన లెవీ విధానం అమలుకు యంత్రాంగం వడివడిగా అడుగులు వేస్తోం ది. ధాన్యం సేకరణ విషయంలో అధికారులు, మిల్లర్లు, ఐకేపీ సభ్యులు సమష్టి బాధ్యత వహించాలని కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన జిల్లా సమన్వయక కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా పౌర సరఫరాలు, రెవెన్యూ, మార్కెటింగ్ అధికారులు, మిల్లర్లు, ఇందిరా క్రాంతిపథం (ఐకేపీ) సభ్యులను ఉద్దేశించి కలెక్టర్ కె.భాస్కర్ మాట్లాడారు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం అమ్మిన రైతులకు 48 గంటల్లోగా సొమ్ము చెల్లించేలా చర్యలు చేపట్టాలని ఆయన
ఆదేశించారు. రైతులు ఎలాంటి ఇబ్బం దులు పడకుండా పటిష్ట ప్రణాళిక అమ లు చేయూలని, ధాన్యం సేకరణ విధానంపై వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ఇందిరా క్రాంతిపథం సభ్యులు, పౌర సరఫరాలు, మార్కెటింగ్, రెవెన్యూ శాఖల అధికారులు ఏఏ గ్రామాల్లో ఎంతమంది రైతులు ఉన్నారు, గ్రామాలవారీగా ఎంత ధాన్యం దిగుబడి వస్తుంది, ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలనే అంశాలపై సమగ్ర సమాచారాన్ని ముందుగానే సిద్ధం చేయూలన్నారు.
ఛత్తీస్‌గఢ్‌కు అధికారుల బృందం
ధాన్యం సేకరణ, రైతులకు సకాలంలో చెల్లింపుల తీరును పరిశీలించేందుకు పౌర సరఫరాలు, డీఆర్‌డీఏ, రెవెన్యూ, వ్యవసాయ, మార్కెటింగ్ అధికారుల బృందాన్ని ఛత్తీస్‌గఢ్ పంపిస్తామని కలెక్టర్ భాస్కర్ చెప్పారు. జిల్లాలో 2.50 లక్షల హెక్టార్లల్లో ఖరీఫ్ సాగవుతోందని, సుమారు 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఐకేపీ సెంటర్లతోపాటు సహకార సంఘాల ద్వారా కూడా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. గోనె సంచుల కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో పాల్గొన్న జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ ప్రభుత్వం రైస్‌మిల్లర్లకు కేటాయించిన మేరకు లెవీ సేకరణ చేపడతామన్నారు. పౌర సరఫరాల సంస్థ, రైస్‌మిల్లర్ల సమన్వయంతో జిల్లాలో ధాన్యం కొనుగోలుకు తమవంతు సహకారం అందిస్తామన్నారు. ఎఫ్‌సీఐ ఏరియా మేనేజర్ కేవీఆర్ రాజు, డీఎస్‌వో డి.శివశంకరరెడ్డి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ సుబ్బారావు, వ్యవసాయ శాఖ జేడీ వి.సత్యనారాయణ, డీఆర్‌డీఏ పీడీ పులి శ్రీరాములు పాల్గొన్నారు.