‘ఐకేపీ’కి టోకరా
►తక్కువ ధాన్యం తెచ్చి ఎక్కువ నమోదు చేసుకున్న బినామీలు
► హమాలీల రిజిస్టర్‌తో వెల్లడైన అక్రమాలు
►రూ.14 లక్షలకు పైగా జేబులోకి..
► కమీషన్‌కు ఎసరు
► డబ్బులు తిరిగి ఇవ్వమంటే దబాయిస్తున్న దళారులు
మహదేవపూర్ : ఖరీఫ్ సీజన్‌లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం మహదేవపూర్ మండలంలోని బ్రాహ్మణపల్లి, బొమ్మాపూర్, సూరారం, అన్నారం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. కేంద్రాల నిర్వహణ బాధ్యలను ఆయా గ్రామాల్లోని మహిళా సంఘాలకు అప్పగించింది. సూరారం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు 284 మంది రైతుల నుంచి 20,887.60 క్వింటాళ్ల ధాన్యం కొన్నారు. ఇందులో కేవలం సూరారం గ్రామానికి చెందిన నలుగురు రైతులే 11,900 క్వింటాళ్లు విక్రయించారు. వీరితోపాటు రైతులందరికీ కలిపి రూ.2,80,09,248 చెల్లించారు.
తక్కువ విక్రయించి.. ఎక్కువ చూపించి..
సూరారం గ్రామానికి చెందిన రైతు నల్లమాసు నగేశ్ 6,414.80 క్వింటాళ్లు, నల్లమాసు సదాశివుడు 2,393.60 క్వింటాళ్లు, నల్లమాసు నాగేందర్ 618 క్వింటాళ్లు, పొడేటి లక్ష్మారెడ్డి 2,473,60 క్వింటాళ్లు విక్రయించినట్లు మహిళా సంఘాలను నమ్మించారు. ఐకేపీ నుంచి రూ.1,60,07,048 తీసుకున్నారు. నిజానికి నగేశ్ విక్రయించింది కేవలం 6158.72 క్వింటాళ్లు. కానీ ఇతడు 256.08 క్వింటాళ్లు అదనంగా చూపి మహిళా సంఘాలను తప్పుదోవ పట్టించాడు. అలాగే నల్లమాసు సదాశివుడు విక్రయించింది 2352.08 క్వింటాళ్లయినా.. 40.80 క్వింటాళ్లు అదనంగా చూపాడు. పొడేటి లక్ష్మారెడ్డి విక్రయించింది 1786 క్వింటాళ్లయినా.. 686.80 క్వింటాళ్లు అదనంగా చూపాడు.
హమాలీ రిజిస్టర్ల పరిశీలనతో వెలుగులోకి..
సూరారం ఐకేపీ కేంద్రానికి డీఆర్డీఏ నుంచి రైతులకు చెల్లించేందుకు మొత్తం రూ.3,10, 87,911 మంజూరయ్యాయి. ఇందులో రైతులకు చెల్లించిన రూ.2,80,09,248, హమాలీలకు రూ.2,29,757 పోను తమ వద్ద ఇంకా రూ.13,70,060 మాత్రమే నిల్వ ఉన్నాయని పేర్కొంటూ మహిళా సంఘాలు డీఆర్‌డీఏకు పంపించారు. మిల్లులకు చేర్చిన ధాన్యం.. చెల్లించిన మొత్తాన్ని పరిశీలించిన అధికారులు.. మహిళా సంఘాల వద్దే ఇంకా రూ.14,78,846 ఉన్నాయనుకుని కమీషన్ పంపలేదు. ఈ విషయం తెలియని కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తమకు కమీషన్ (సుమారు రూ.ఆరు లక్షలు క్వింటాల్‌కు రూ.34 ప్రభుత్వం కమీషన్ ఇస్తుంది) ఇవ్వాలంటూ బుధవారం ఐకేపీ కార్యాలయానికి చేరుకున్నారు.
రికార్డులు పరిశీలించిన అధికారులు.. మహిళా సంఘం నుంచే రూ.14,78,846 రావాల్సి ఉందని చెప్పడంతో అవాక్కయ్యారు. కొనుగోలు రిజిస్టర్‌తోపాటు హమాలీల రిజిస్టర్‌ను పరిశీలించగా తేడా కనిపించింది. ముగ్గురు దళారులు కలిసి ఏకంగా 983.68 క్వింటాళ్లు అదనంగా చూపి రూ.14లక్షలకు పైగా తమ జేబుల్లో నింపుకున్నారు. ఈ విషయమై సదరు రైతులు (దళారులను) అడిగితే తాము విక్రయించిన ధాన్యానికే డబ్బులు చెల్లించారంటూ దబాయిస్తున్నారని మహిళలు పేర్కొంటున్నారు. విషయాన్ని మహిళలు ఏపీఓ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన పీడీకి నివేదిస్తానని తెలిపారు. రైతులు (దళారులు) డబ్బులు చెల్లించకుంటే పోలీసులను ఆశ్రయించేందుకు మహిళా సంఘాల సభ్యులు సిద్ధమవుతున్నారు.