పేదలకు చౌకగా గృహ రుణాలు!
న్యూఢిల్లీ: అల్పాదాయ, పేద ప్రజలకు సబ్సిడీ వడ్డీరేట్లకు గృహ రుణాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పేర్కొన్నారు. పేదలకు సాయం అందించడంతోపాటు రియల్ ఎస్టేట్ రంగంలో డిమాండ్ పెంచే ప్రణాళికల్లో భాగంగా దీనిపై దృష్టిసారిస్తున్నామని చెప్పారు. రియల్టీ పరిశ్రమ సంఘం క్రెడాయ్ సోమవారమిక్కడ నిర్వహించిన సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలను వెల్లడించారు. రియల్టీ అభివృద్ధి, నియంత్రణ బిల్లుకు త్వరలోనే కేబినెట్ ఆమోదం లభించే అవకాశం ఉందని.. వచ్చే బడ్జెట్ సెషన్‌నాటికి దీనికి పార్లమెంటు ఆమోదముద్ర పడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.
‘ఆర్థికంగా బలహీన వర్గాలు(ఈడబ్ల్యూఎస్), అల్పాదాయ వర్గాల(ఎల్‌ఐజీ)కు గృహ రుణాల్లో వడ్డీ రాయితీ స్కీమ్‌ను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. దిగువ మధ్య తరగతి ప్రజలనూ దీని పరిధిలోకి తీసుకొస్తాం’ అని వెంకయ్య తెలిపారు. కాగా, ఎప్పటికల్లా ఈ రాయితీ అందుబాటులోకి వస్తుందన్న ప్రశ్నకు... త్వరలో మేం ప్రారంభించనున్న కొత్త గృహనిర్మాణ విధానంలో వడ్డీ రాయితీ పథకం భాగంగా ఉంటుందని పేర్కొన్నారు.
సొంతింటి కలకు రూ. 14 లక్షల కోట్లు కావాలి..
అధిక వడ్డీరేట్లు, స్థిరాస్థి ధరల పెరుగుదల కారణంగా రియల్టీ రంగం తీవ్ర మందగమనాన్ని ఎదుర్కొంటోందని వెంకయ్య పేర్కొన్నారు. సింగిల్ విండో అనుమతులు ఇవ్వాలన్న రియల్టర్ల డిమాండ్‌పై స్పందిస్తూ... వైమానిక, పర్యావరణ సంబంధ అనుమతులకు సంబంధించి నిబంధనలను సరళతరం చేయడంతోపాటు వేగంగా అనుమతులిచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక 2022 కల్లా దేశవాసులందరికీ సొంతింటి కలను సాకారం చేయాలంటే సుమారు రూ.14 లక్షల కోట్ల భారీ నిధులు అవసరమవుతాయని మంత్రి చెప్పారు. అందుకే ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు.