Interest subsidy scheme
-
త్వరలోనే కొత్త హౌసింగ్ స్కీమ్.. ధ్రువీకరించిన కేంద్ర మంత్రి
గృహ రుణాలపై వడ్డీ రాయితీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుందని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి (Hardeep Singh Puri) తాజాగా ధ్రువీకరించారు. “మేము కొత్త హోమ్ సబ్వెన్షన్ స్కీమ్ వివరాలను ఖరారు చేసే ప్రక్రియలో ఉన్నాం. ప్రధాన మంత్రి చెప్పినట్లుగా లబ్ధిదారులకు వడ్డీ రాయితీని అందించే ఇది ఒక పెద్ద పథకం. త్వరలోనే ఈ పథకం తుది వివరాలు వెల్లడిస్తాం ” అని హర్దీప్ సింగ్ పూరి మీడియా సమావేశంలో తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 15న తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో తొలుత ఈ పథకాన్ని ప్రకటించారు. పట్టణ ప్రాంతాల్లో నివసించే నిరుపేదలకు ప్రయోజనం చేకూర్చే కొత్త హౌసింగ్ లోన్ స్కీమ్‌ను తమ ప్రభుత్వం తీసుకువస్తోందని ఆయన ప్రకటించారు. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్న ప్రధాని మోదీ, నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని అద్దె ఇళ్లు, మురికివాడలు, అనధికార కాలనీలలో నివసించే కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే కొత్త పథకాన్ని తమ ప్రభుత్వం తీసుకువస్తుందని చెప్పారు. ‘సొంత ఇల్లు నిర్మించుకోవాలనుకుంటున్న పేదలకు వడ్డీ రేట్లు, బ్యాంకుల నుంచి రుణాల ఉపశమనంతో సహాయం చేస్తాం. అది వారికి లక్షల రూపాయలు ఆదా చేయడంలో సహాయపడుతుంది’ అని ఆగస్టు 15 ప్రసంగంలో ప్రధాని మోదీ చెప్పారు. రాయిటర్స్ కథనం ప్రకారం.. ఈ పథకం కింద పట్టణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకునే పేదలకు రూ.9 లక్షలు రుణం అందిస్తారు. దీనిపై కేవలం 3 నుంచి 6.5 శాతం వడ్డీ మాత్రమే ఉంటుంది. ఒక వేళ ఇంతకు ముందే హోమ్‌లోన్ తీసుకున్నట్లయితే 20 సంవత్సరాల టెన్యూర్‌తో రూ.50 లక్షల లోపు గృహ రుణాలు తీసుకున్నవారు మాత్రమే ఈ వడ్డీ సబ్సిడీకి అర్హులు. -
ఏపీ చొరవతో దేశవ్యాప్తంగా పరిశ్రమలకు మేలు
సాక్షి, అమరావతి: పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో మన రాష్ట్రం దేశానికి మార్గనిర్దేశం చేస్తోంది. ఇప్పటికే అనేక రంగాల్లో ఎన్నో జాతీయస్థాయి అవార్డులను, గుర్తింపును దక్కించుకున్న ఆంధ్రప్రదేశ్.. కేంద్రప్రభుత్వ నిర్ణయాలను సైతం ప్రభావితం చేస్తోంది. దీనికి ప్రత్యక్ష నిదర్శనమే తాజాగా కేంద్ర విద్యుత్‌శాఖ ప్రవేశపెడుతున్న పరిశ్రమలకు వడ్డీ రాయితీ పథకం. దేశవ్యాప్తంగా పరిశ్రమల్లో ఇంధన సామర్థ్య కార్యక్రమాలను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా నూతన సాంకేతిక విధానాలను అవలంభించే పరిశ్రమలకు, అవి తీసుకున్న రుణాలపై చెల్లించే వడ్డీలో కొంత రాయితీగా ఇచ్చేందుకు కేంద్ర ఆర్థికశాఖ సహకారంతో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ)తో కలిసి కేంద్ర విద్యుత్‌శాఖ ఈ పథకాన్ని తీసుకొస్తోంది. ఇందుకోసం రూ.12 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు బీఈఈ డైరెక్టర్ జనరల్ (డీజీ) అభయ్ భాక్రే చెప్పారు. ఇందులో రూ.6 వేల కోట్లను విద్యుత్ పొదుపు చర్యలను అమలు చేసే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)లకు కేటాయిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన జాతీయ ఎనర్జీ ఎఫిషియెంట్ సమ్మిట్–2023లో ఆయన మాట్లాడారు. రెండేళ్ల కిందట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ప్రతిపాధనల ఆధారంగానే ఈ పథకానికి రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఇంధన సామర్థ్యరంగంలో పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు. దేశంలోనే తొలి ఇన్వెస్ట్మెంట్ బజార్‌ను విశాఖపట్నంలో నిర్వహించిన ఏపీ ఇంధన సామర్థ్య ప్రాజెక్టుల్లో రూ.430 కోట్ల పెట్టుబడులను సాధించిందన్నారు. ఏపీని ఆదర్శంగా తీసుకుని ఇతర రాష్ట్రాల్లోను అలాంటి సదస్సులు నిర్వహించగా మొత్తం రూ.2,500 కోట్ల పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడం పారిశ్రామిక రంగానికి ప్రత్యేక వడ్డీ రాయితీ పథకాన్ని ప్రవేశపెట్టడానికి బీజం వేసిందని, అలాగే ఏపీ ఇంధనశాఖ కూడా రెండేళ్ల కిందట వడ్డీ రాయితీ కోరుతూ ప్రతిపాదనల లేఖ రాసిందని తెలిపారు. ఇంధనం ఆదా, తగ్గుతున్న కాలుష్యం జి–20 సమ్మిట్‌లో ప్రపంచదేశాల నేతలు ఆశించినట్లు.. దేశంలో 2050 నాటికి కర్బన ఉద్గారాలు లేకుండా చేయాలనే లక్ష్యానికి ఈ పథకం దోహదపడుతుందని చెప్పారు. 2021–22లో బీఈఈ చర్యలతో 27.75 ఎంటీవోఈ ఇంధనం ఆదా అయిందని, 130.21 బిలియన్ యూనిట్ల విద్యుత్ పొదుపు చేశామని తెలిపారు. 175.22 మెట్రిక్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించగలిగామన్నారు. పెర్ఫార్మ్, అచీవ్ అండ్ ట్రేడ్ (పాట్) పథకం ద్వారా ఈ ఏడాది మార్చి నాటికే 13 రంగాల్లో సుమారు 26 ఎంటీవోఈ ఇంధనాన్ని ఆదా చేయడమేగాక 70 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించగలిగామని ఆయన వివరించారు. ఈ సమ్మిట్‌లో ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్విసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) సీఈవో విశాల్‌కపూర్ తరఫున ఈఈఎస్ఎల్ సౌత్ సలహాదారు ఎ.చంద్రశేఖరరెడ్డి ఏపీలో వివిధ రంగాల్లో ఇంధన సామర్థ్య చర్యలు, ప్రభుత్వ ప్రోత్సాహంపై నివేదిక సమర్పించారు. -
వడ్డీ రాయితీ కొనసాగింపు
రూ.3 లక్షల వరకూ స్వల్ప కాలిక పంట రుణాలకు 7 శాతం వడ్డీ ∙ కేంద్ర కేబినెట్ నిర్ణయం న్యూఢిల్లీ: స్వల్పకాలిక రుణాలు తీసుకునే రైతులకు వడ్డీ రాయితీ పథకాన్ని కొనసా గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.3 లక్షల వరకూ రైతులు తీసుకునే స్వల్పకాలిక రుణానికి 7 శాతం వడ్డీ.. ఈ రుణాన్ని సకాలంలో చెల్లించే రైతులు 4 శాతం(3 శాతం సబ్సిడీ) వడ్డీ చెల్లించే పథకాన్ని పొడిగించాలని నిర్ణయించింది. ఈ పథకం కోసం రూ.20,339 కోట్లను కేటా యించింది. ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రకృతి వైపరీత్యాల బారిన పడి నష్టపోయిన రైతులు సకాలంలో రుణాన్ని చెల్లించలేకపోతే.. వారికి మొదటి ఏడాది వడ్డీపై 2 శాతం సబ్సిడీ అందించనున్నారు. అలాగే పంటను నిల్వ ఉంచుకునేందుకు ఆరు నెలల కాలానికి తీసుకునే రుణాలను 7 శాతానికే అందజేయనున్నారు. 2006–07 నుంచి వడ్డీ రాయితీ వడ్డీ రాయితీ పథకాన్ని 2006–07 నుంచి అమలు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సంలో కూడా దీనిని కొనసాగించాలని నిర్ణయించారు. పథకాన్ని నాబార్డు, రిజర్వ్ బ్యాంకు అమలు చేస్తున్నాయి. ఈ పథకం కింద రూ.3 లక్షల వరకూ స్వల్ప కాలిక రుణాలకు 2 శాతం వడ్డీ సబ్సిడీని ఇస్తూ 7 శాతం వడ్డీకే రుణాలను అందజేస్తోంది. దీనికి అదనంగా సకాలంలో రుణాలను తిరిగి చెల్లించే రైతులకు 3 శాతం వడ్డీ రాయితీ ఇస్తోంది. దీంతో సకాలంలో రుణాలను తిరిగి చెల్లించే రైతులు 4 శాతం వడ్డీకే రుణాలు పొందుతున్నారు. ఈ రుణాలను అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు, సహకార బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు అందజేస్తున్నాయి. -
పంట రుణాలకు వడ్డీ రాయితీ పథకం
రైతులకు 4 శాతం వడ్డీతో స్వల్పకాలిక రుణాలు - కేంద్ర కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలు న్యూఢిల్లీ : స్వల్పకాలిక పంట రుణాలకు వడ్డీ రాయితీ పథకం అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ప్రధానమంత్రి అధ్యక్షతన మంగళవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఈ పథకం ప్రకారం ఏడాది కాలానికి రైతులకు స్వల్పకాలిక రుణం కింద రూ. 3 లక్షల వరకు 4 శాతం వడ్డీ రేటుపై పంట రుణం లభిస్తుందన్నారు. దీనికి ప్రభుత్వం 5 శాతం వడ్డీ రాయితీ ఇస్తుందన్నారు. ఇందులో రైతులందరికీ 2 శాతం వడ్డీ రాయితీ ఇస్తున్నామని.. రుణాన్ని సకాలంలో చెల్లించినవారికి అదనంగా మరో మూడు శాతం వడ్డీ రాయితీ అందజేస్తున్నామని తెలిపారు. రైతులు ఏడాదిలోపు రుణం చెల్లించకుంటే ఏడు శాతం వడ్డీయే చెల్లించాలన్నారు. తీసుకున్న మరిన్ని నిర్ణయాలు... 8 ఢిల్లీలో ప్రభుత్వ వసతి లేమిని దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం ఏడు హౌసింగ్ కాలనీలను పునర్నిర్మించాలని నిర్ణయం. 8 2007-13లో రిటైరైన 1.88 లక్షల బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు పింఛన్‌ను 9% పెంపు 8 పప్పు ధరలను నియంత్రించేందుకు మొజాంబిక్ దేశం నుంచి ఏడాదికి రెండు లక్షల టన్నుల కంది, ఇతర పప్పు దినుసులను ఐదేళ్ల పాటు దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. బాంబే, మద్రాస్ హైకోర్టుల పేర్ల మార్పు బాంబే, మద్రాస్ హైకోర్టుల పేర్లు మార్చుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. న్యాయ మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదన మేరకు మంగళవారం ఈ రెండు హైకోర్టుల పేర్లను కేంద్ర కేబినెట్ మార్చింది. ఇకపై బాంబే హైకోర్టును ముంబై హైకోర్టుగా, మద్రాస్ హైకోర్టును చెన్నై హైకోర్టుగా పిలుస్తారు. ఈ మేరకు కేబినెట్ నిర్ణయించినట్టు మంత్రి రవిశంకర్ మీడియాకు తెలిపారు. కలకత్తా హైకోర్టు పేరు కూడా కోల్‌కతా హైకోర్టుగా మారనుందని తెలిపారు. సమగ్ర అధ్యయనం అనంతరం రూపొందిన బిల్లు.. ఇటీవలే న్యాయశాఖ ఆమోదం పొందిందని ఆయన చెప్పారు. -
పేదలకు చౌకగా గృహ రుణాలు!
న్యూఢిల్లీ: అల్పాదాయ, పేద ప్రజలకు సబ్సిడీ వడ్డీరేట్లకు గృహ రుణాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పేర్కొన్నారు. పేదలకు సాయం అందించడంతోపాటు రియల్ ఎస్టేట్ రంగంలో డిమాండ్ పెంచే ప్రణాళికల్లో భాగంగా దీనిపై దృష్టిసారిస్తున్నామని చెప్పారు. రియల్టీ పరిశ్రమ సంఘం క్రెడాయ్ సోమవారమిక్కడ నిర్వహించిన సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలను వెల్లడించారు. రియల్టీ అభివృద్ధి, నియంత్రణ బిల్లుకు త్వరలోనే కేబినెట్ ఆమోదం లభించే అవకాశం ఉందని.. వచ్చే బడ్జెట్ సెషన్నాటికి దీనికి పార్లమెంటు ఆమోదముద్ర పడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ‘ఆర్థికంగా బలహీన వర్గాలు(ఈడబ్ల్యూఎస్), అల్పాదాయ వర్గాల(ఎల్ఐజీ)కు గృహ రుణాల్లో వడ్డీ రాయితీ స్కీమ్‌ను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. దిగువ మధ్య తరగతి ప్రజలనూ దీని పరిధిలోకి తీసుకొస్తాం’ అని వెంకయ్య తెలిపారు. కాగా, ఎప్పటికల్లా ఈ రాయితీ అందుబాటులోకి వస్తుందన్న ప్రశ్నకు... త్వరలో మేం ప్రారంభించనున్న కొత్త గృహనిర్మాణ విధానంలో వడ్డీ రాయితీ పథకం భాగంగా ఉంటుందని పేర్కొన్నారు. సొంతింటి కలకు రూ. 14 లక్షల కోట్లు కావాలి.. అధిక వడ్డీరేట్లు, స్థిరాస్థి ధరల పెరుగుదల కారణంగా రియల్టీ రంగం తీవ్ర మందగమనాన్ని ఎదుర్కొంటోందని వెంకయ్య పేర్కొన్నారు. సింగిల్ విండో అనుమతులు ఇవ్వాలన్న రియల్టర్ల డిమాండ్‌పై స్పందిస్తూ... వైమానిక, పర్యావరణ సంబంధ అనుమతులకు సంబంధించి నిబంధనలను సరళతరం చేయడంతోపాటు వేగంగా అనుమతులిచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక 2022 కల్లా దేశవాసులందరికీ సొంతింటి కలను సాకారం చేయాలంటే సుమారు రూ.14 లక్షల కోట్ల భారీ నిధులు అవసరమవుతాయని మంత్రి చెప్పారు. అందుకే ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు.