వడ్డీ రాయితీ కొనసాగింపు
రూ.3 లక్షల వరకూ స్వల్ప కాలిక పంట రుణాలకు 7 శాతం వడ్డీ ∙ కేంద్ర కేబినెట్ నిర్ణయం
న్యూఢిల్లీ: స్వల్పకాలిక రుణాలు తీసుకునే రైతులకు వడ్డీ రాయితీ పథకాన్ని కొనసా గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.3 లక్షల వరకూ రైతులు తీసుకునే స్వల్పకాలిక రుణానికి 7 శాతం వడ్డీ.. ఈ రుణాన్ని సకాలంలో చెల్లించే రైతులు 4 శాతం(3 శాతం సబ్సిడీ) వడ్డీ చెల్లించే పథకాన్ని పొడిగించాలని నిర్ణయించింది.
ఈ పథకం కోసం రూ.20,339 కోట్లను కేటా యించింది. ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రకృతి వైపరీత్యాల బారిన పడి నష్టపోయిన రైతులు సకాలంలో రుణాన్ని చెల్లించలేకపోతే.. వారికి మొదటి ఏడాది వడ్డీపై 2 శాతం సబ్సిడీ అందించనున్నారు. అలాగే పంటను నిల్వ ఉంచుకునేందుకు ఆరు నెలల కాలానికి తీసుకునే రుణాలను 7 శాతానికే అందజేయనున్నారు.
2006–07 నుంచి వడ్డీ రాయితీ
వడ్డీ రాయితీ పథకాన్ని 2006–07 నుంచి అమలు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సంలో కూడా దీనిని కొనసాగించాలని నిర్ణయించారు. పథకాన్ని నాబార్డు, రిజర్వ్ బ్యాంకు అమలు చేస్తున్నాయి. ఈ పథకం కింద రూ.3 లక్షల వరకూ స్వల్ప కాలిక రుణాలకు 2 శాతం వడ్డీ సబ్సిడీని ఇస్తూ 7 శాతం వడ్డీకే రుణాలను అందజేస్తోంది. దీనికి అదనంగా సకాలంలో రుణాలను తిరిగి చెల్లించే రైతులకు 3 శాతం వడ్డీ రాయితీ ఇస్తోంది. దీంతో సకాలంలో రుణాలను తిరిగి చెల్లించే రైతులు 4 శాతం వడ్డీకే రుణాలు పొందుతున్నారు. ఈ రుణాలను అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు, సహకార బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు అందజేస్తున్నాయి.