రైతులకు 4 శాతం వడ్డీతో స్వల్పకాలిక రుణాలు
- కేంద్ర కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలు
న్యూఢిల్లీ : స్వల్పకాలిక పంట రుణాలకు వడ్డీ రాయితీ పథకం అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ప్రధానమంత్రి అధ్యక్షతన మంగళవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఈ పథకం ప్రకారం ఏడాది కాలానికి రైతులకు స్వల్పకాలిక రుణం కింద రూ. 3 లక్షల వరకు 4 శాతం వడ్డీ రేటుపై పంట రుణం లభిస్తుందన్నారు. దీనికి ప్రభుత్వం 5 శాతం వడ్డీ రాయితీ ఇస్తుందన్నారు. ఇందులో రైతులందరికీ 2 శాతం వడ్డీ రాయితీ ఇస్తున్నామని.. రుణాన్ని సకాలంలో చెల్లించినవారికి అదనంగా మరో మూడు శాతం వడ్డీ రాయితీ అందజేస్తున్నామని తెలిపారు. రైతులు ఏడాదిలోపు రుణం చెల్లించకుంటే ఏడు శాతం వడ్డీయే చెల్లించాలన్నారు.
తీసుకున్న మరిన్ని నిర్ణయాలు...
8 ఢిల్లీలో ప్రభుత్వ వసతి లేమిని దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం ఏడు హౌసింగ్ కాలనీలను పునర్నిర్మించాలని నిర్ణయం. 8 2007-13లో రిటైరైన 1.88 లక్షల బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులకు పింఛన్‌ను 9% పెంపు 8 పప్పు ధరలను నియంత్రించేందుకు మొజాంబిక్ దేశం నుంచి ఏడాదికి రెండు లక్షల టన్నుల కంది, ఇతర పప్పు దినుసులను ఐదేళ్ల పాటు దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది.
బాంబే, మద్రాస్ హైకోర్టుల పేర్ల మార్పు
బాంబే, మద్రాస్ హైకోర్టుల పేర్లు మార్చుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. న్యాయ మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదన మేరకు మంగళవారం ఈ రెండు హైకోర్టుల పేర్లను కేంద్ర కేబినెట్ మార్చింది. ఇకపై బాంబే హైకోర్టును ముంబై హైకోర్టుగా, మద్రాస్ హైకోర్టును చెన్నై హైకోర్టుగా పిలుస్తారు. ఈ మేరకు కేబినెట్ నిర్ణయించినట్టు మంత్రి రవిశంకర్ మీడియాకు తెలిపారు. కలకత్తా హైకోర్టు పేరు కూడా కోల్‌కతా హైకోర్టుగా మారనుందని తెలిపారు. సమగ్ర అధ్యయనం అనంతరం రూపొందిన బిల్లు.. ఇటీవలే న్యాయశాఖ ఆమోదం పొందిందని ఆయన చెప్పారు.
పంట రుణాలకు వడ్డీ రాయితీ పథకం
Published Wed, Jul 6 2016 1:23 AM | Last Updated on Mon, Sep 4 2017 4:11 AM
Advertisement
Advertisement